కొత్త పార్టీ, కొత్త వ్యవహారం అన్నపుడు ఆమాత్రం తప్పటడుగులు వుంటాయి. 2014నాటికి అప్పుడే పుట్టిన పసిగుడ్డు జనసేన పార్టీ. అప్పటికి ఇంకా ఓ కార్యవర్గం లేదు. కమిటీ లేదు. ఆమాటకు వస్తే ఇప్పటికీ సరైన కమిటీ కానీ కార్యవర్గం కానీ లేవనుకోండి. అది వేరే సంగతి. అలాంటి టైమ్ లో తెలుగుదేశం పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించింది. అందుకు ప్రతిగా మూడో నాలుగో ఎమ్మెల్యే సీట్లు, ఓ ఎంపీ సీటు తీసుకుని వుంటే బాగుండేది.
ఇప్పుడు దాన్నే తమ పార్టీ చేసిన తప్పిదంగా అంటున్నారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. నిజానికి అది ఇలాంటి అలాంటి తప్పిదం కాదు. చారిత్రాత్మిక తప్పిదం. ఎందుకంటే అలా చేసి వుంటే చాలా బాగుండేది.
అలా చేసి వుంటే.. అసలు జనసేన పట్ల ప్రజల అభిప్రాయం ఎలా వుందో, ఎన్ని ఓట్లు వచ్చేవో తెలిసి వుండేది.గెలిచిన వాళ్లు జనసేనలో వుండేవారో? ప్రజా రాజ్యం స్ఫూర్తితోనో, వైకాపా జనాలను చూసో ఆ గెలిచినవాళ్లు అధికార పార్టీలోకి జంప్ జిలానీ అని వుండేవారేమో? అప్పుడు పవన్ కు వైకాపా అధ్యక్షుడు జగన్ పడుతున్న బాధ ఎలాంటిదో తెలిసి వుండేది.
అలాగే ఏ ఎమెల్సీ ఎన్నికలు వచ్చినపుడో జనసేన ఓట్లను నోట్లు ఇచ్చి కొని వుంటే తెలంగాణలో జరిగిన వ్యవహారం క్లియర్ గా అర్థం అయివుండేది.
ఇంకా చాలా చాలా విషయాలు ప్రాక్టికల్ గా పవన్ కు ఈమూడున్నరేళ్లలో చాలా వరకు తెలిసి వచ్చివుండేవి. అలాంటివి అన్నీ మిస్ అయిపోయాడు అంటే మరి చారిత్రాత్మిక తప్పిదం కాదా?