పవన్ సినిమా చేస్తారహో….?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవన్ కళ్యాణ్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటారు. అది ఇప్పుడా? ఎప్పుడు? అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ మళ్లీ సినిమాలో నటించడానికి ఆయన కాస్త…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవన్ కళ్యాణ్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటారు. అది ఇప్పుడా? ఎప్పుడు? అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ మళ్లీ సినిమాలో నటించడానికి ఆయన కాస్త సుముఖత వ్యక్తం చేసినట్లు బోగట్టా. నిజానికి తాను పూర్తిగా సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు పవన్ కచ్చితంగా ప్రకటించలేదు. ఆయన ఎప్పుడూ తను పెద్దగా ఆసక్తి లేదని, కానీ అభిమానుల కోసం చేస్తున్నా అనే చెబుతూ వస్తున్నారు.

రెండు వరుస పరాజయాల అనంతరం, మూడోసారి మరీ ఘోరమైన పరాజయం ఎదురుకావడం, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో పవన్ ఇటీవల బహిరంగసభల్లో మాట్లాడుతూ ఇక సినిమాలు చేయాలని లేదనే విధంగా అన్నారు తప్ప, చేయను అని క్లారిటీగా అయితే చెప్పలేదు.

చాలా మంది పవన్ సినిమాలు చేయాలనే కోరుతున్నారు. నిన్నటికి నిన్న వివి వినాయక్ లాంటి మంచి దర్శకుడు కూడా సినిమాలు వదలవద్దనే పవన్ కు బహిరంగ విన్నపం చేసారు.

ఇదంతా ఇలా వుంటే, పవన్ దగ్గర ముగ్గురు, నలుగురు నిర్మాతల అడ్వాన్స్ లు వున్నాయి. అవన్నీ కలిపి 20కోట్ల వరకు వుంటాయి. ఇప్పుడు ఆయన సినిమాలకు స్వస్తి చెబితే, వడ్డీల మాట దేవుడెరుగు, ఆ ఇరవై కోట్లు వెనక్కు ఇవ్వాలి. ఇరవై కోట్లు అంటే మాటలు కాదు. అవేమీ నగదు రూపంలో కూర్చోవు. ఎక్కడో ఏదో ఆస్తి రూపంలో వుంటాయి. ఇప్పుడు ఏదో ఒకటి అమ్మి వెనక్కు ఇవ్వాలి.

ఇలాంటి టైమ్ లో పవన్ సన్నిహితులు ఒకే ఒక్క సినిమా ఎన్నికల లోపు చేసేసి, ఈ అడ్వాన్స్ ల నుంచి విముక్తి పొందమని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు మైత్రీ మూవీస్ సినిమా చేయాలని పవన్ డిసైడ్ అయితే ఆయనకు ఎదురు ఎలా లేదన్నా మరో పది కోట్లకు పైగా వస్తాయి. అంటే మైత్రీ సినిమా ఒక్కటి చేసేస్తే, వచ్చే డబ్బులతో మిగిలిన వారి అడ్వాన్స్ లు వెనక్కు ఇచ్చేయచ్చు. లేదా మైత్రీ సినిమా తరువాత పరిస్థితిని బట్టి ఆలోచించుకోవ్చు. ఇదీ పవన్ దగ్గర జరిగిన డిస్కషన్ పాయింట్ అని వినికిడి.

ఈ విషయమై పైనల్ గా చర్చించేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ అమెరికా నుంచి మరో రెండు రోజుల్లో వస్తున్నారు. ఇప్పటికే ఆయన కోసం పవన్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అపాయింట్ మెంట్ ను బట్టి పవన్ కలిసి సినిమా విషయం డిస్కషన్ చేస్తారు. అంగీకారం కుదిరితే జస్ట్ నెల పదిహేను రోజులు టైమ్ కేటాయిస్తే చాలు సినిమా రెడీ అయిపోతుంది. ఎందుకంటే స్క్రిప్ట్ అంతా రెడీగా వుంది.

కాదు, ఇక చేయలేను అంటే మాత్రం, నవీన్ తో జరిగే చర్చల్లో తొమ్మిది కోట్లు (వడ్డీ కాకుండా) అడ్వాన్స్ ఎప్పుడు ఇచ్చేదీ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా వుంది. సినిమా చేయడానికే అవకాశం ఎక్కువ వుందని తెలుస్తోంది. పవన్ అభిమానుల కోరిక కూడా అదే.