సినిమా నటులైనా రాజకీయాల్లోకి రావాలని, అధికారం అందుకోవాలని అందుకే అంగలార్చుతూ వుంటారు. అధికారం అలాంటిది. ఎవరైనా వంగి వంగి సలాం కొట్టాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నిన్నటికి నిన్న గంటా పది నిమిషాలు సీఎం ప్రగతి భవన్ లోని గెస్ట్ రూమ్ లో కూర్చుని వుండాల్సి వచ్చింది.
మరి ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్నారో? అప్పటికప్పుడు అడిగారో? లేదా తను వెళ్తే కలవకపోతారా? అన్న ధీమానో, మొత్తానికి ఏ విషయం బయటకు తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడానికి వెళ్లారు.
కానీ ముందుగా వున్న కార్యక్రమాలు కావచ్చు, లేదా న్యూ ఇయర్ కాబట్టి బిజీగా వుండడం వల్ల కావచ్చు, ఆ టైమ్ కు కేసీఆర్ ఆఫీసులో లేరు. పవన్ కళ్యాణ్ వచ్చారని కబురు వెళ్లిందట. గెస్ట్ రూమ్ లో కూర్చో పెట్టండి. వస్తున్నానని చెప్పండి అని సమాధానం వచ్చిందని వినికిడి.
దాంతో గెస్ట్ రూమ్ లో పవన్ వేచి కూర్చున్నారు. గంటా పది నిమిషాలు అలా మౌనంగా వేచి వున్నారట. ఈ గంటా పది నిమిషాల్లో రెండుసార్లు టీ నో కాఫీనో మాత్రం తాగారట. ఆ తరువాత కేసీఆర్ వస్తే కలిసి వెనక్కు వచ్చారు.
24గంటల కరెంట్ పై కేసీఆర్ ను అభినందించడానికి అని పవన్ చెప్పారు. అయితే నిజమో, అబద్ధమో, తెలియదు కానీ, ఇండస్ట్రీలో మాత్రం అజ్ఞాతవాసికి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నం చేసేందుకే వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారంరోజులు యూనిఫాం రేటు అమలు కోసం ప్రయత్నించారని టాక్ వినిపిస్తోంది. ఏం జరిగిందన్నది పవన్ బాబుకే ఎరుక.