అజ్ఞాతవాసి నైజాంలో ఏ మేరకు?

మరో వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబో సినిమా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. ఈ సినిమా బడ్జెట్ భారీనే, అమ్మకాల రేట్లు భారీనే. అంచనాలు అంతకన్నా భారీనే. ఒక్క…

మరో వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబో సినిమా అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. ఈ సినిమా బడ్జెట్ భారీనే, అమ్మకాల రేట్లు భారీనే. అంచనాలు అంతకన్నా భారీనే. ఒక్క నైజాంలోనే ఈ సినిమా పాతికకోట్లకు పైగా వసూలు చేయాలి.

ఎలా అంటే, అజ్ఞాతవాసి సినిమాను డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నైజాం ఏరియాకు 23కోట్లకు కొన్నారు. కనీసం అయిదుశాతం ఖర్చులు వేసుకున్నా పాతికకోట్లు రావాలి. అప్పుడు బ్రేక్ ఈవెన్ అయినట్లు లెక్కేసుకోవచ్చు. ఇక వడ్డీలు వగైరా వేసుకుంటే మరో రెండు మూడుకోట్లు రావాల్సి వుంటుంది.

ఇక పవన్ సినిమాలు నైజాంలో సర్దార్ గబ్బర్ సింగ్ 12కోట్లకు పైగా, కాటమరాయుడు 15కోట్ల వరకు వసూలు చేసాయి. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 150 అయితే 19కోట్ల వరకు వసూలు చేసింది. కానీ ఆశాభావం ఏమిటంటే, పవన్-త్రివిక్రమ్ అత్తారింటికి దారేది నైజాంలో ఇరవైరెండుకోట్ల వరకు వసూలు చేసింది. పైగా ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి. అందువల్ల సులువుగా పాతికకోట్లు వసూలు చేసేయవచ్చని అంచనా వేసుకుని, రంగంలోకి దిగుతున్నారు.

ఆ మాటకు వస్తే నైజాంలోనే కాదు, ఏ ఏరియా తీసుకున్నా అజ్ఞాతవాసిని భారీ రేట్లకు అమ్మారు. యూనిఫారమ్ రేటు, అయిదారు షోలు వంటి ప్లాన్ లతో రికవరీ సులువు అవుతుందని బయ్యర్లు ధీమాగా వున్నారు. బాహుబలి 2సంగతి అలా వుంచితే మెగాస్టార్ చిరు 150వ సినిమా రికార్డులు అన్నీ కచ్చితంగా తుడిచిపెట్టుకుపోవాల్సిందే. అలా అయితేనే బయ్యర్లు బయటపడతారు.