'చిక్కడు దొరకడు' అనే టైటిల్ పవన్‌కళ్యాణ్‌కి సరిగ్గా సూటయిపోతుంది. ఇదేమీ సినిమా టైటిల్ కాదు. నిజంగానే పవన్‌కళ్యాణ్ ఎవరికీ చిక్కడు, ఎవరికీ దొరకడు. ఆయనంతే, అదో టైపు.! పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. కాలగర్భంలో కలిసిపోయింది. నిజమే, పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా పూర్తిగా తెరమరుగైపోయినట్లే.
పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన శరద్మరార్కే ఇప్పుడు పవన్‌కళ్యాణ్ అంతరంగం అర్థం కావడంలేదట. అసలు పవన్‌కళ్యాణ్ సినిమాల పట్ల ఆసక్తితోనే వున్నారా.? అనే విషయమై కన్ఫ్యూజన్తో సన్నిహితుల వద్ద వాపోతున్నాడట శరద్ మరార్. 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాతో పవన్‌కళ్యాణ్, శరద్ మరార్‌కి సూపర్ షాకిచ్చాడు. ఎన్నాళ్ళుగానో పవన్‌తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నించీ ప్రయత్నించీ 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో ఆ కోరిక నెరవేర్చుకుని, దారుణమైన ఫ్లాప్ చవిచూశాడు శరద్ మరార్. అయినాసరే, మళ్ళీ పవన్‌తోనే సినిమా తీద్దామని పట్టుదలతో వున్నాడు. ప్చ్, ఈసారి సినిమా పట్టాలెక్కడమే లేదాయె.!
'గోపాల గోపాల' ఫేం డాలీ, పవన్‌కళ్యాణ్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, 'గబ్బర్‌సింగ్' డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇంకా ఎందరో ట్రాక్‌లోనే వున్నారు.. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం వారి ట్రాక్‌లోకి వెళ్ళడంలేదు, వాళ్ళని తన ట్రాక్‌లోకి రానివ్వట్లేదు పవన్‌కళ్యాణ్. వెరసి, పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా ఊహాలోకంలోనే ఇంకా విహరిస్తోంది.
తాజా ఖబర్ ఏంటంటే, పవన్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌ని వదిలేసి, రాజకీయాలపై ఫోకస్ పెడ్తాడట. శరద్మరార్ని పక్కన పెట్టి, దాసరి నారాయణరావు నిర్మాణంలో తెరకెక్కే సినిమాకి పవన్ కమిట్ అవుతాడనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదండోయ్, హీరోగా సినిమాలు మానేసి, నిర్మాతగా అవతారమెత్తాలని కూడా పవన్ అనుకుంటున్నాడట. ఎటూ, రామ్‌చరణ్‌తో సినిమా నిర్మిస్తానని పవన్ ఆ మధ్య ప్రకటించాడు కూడా. ఏమో, పవన్ ఆలోచనలు కూడా ఆ దిశగానే వున్నాయేమో.! అయినా, ఇదెంత నిజమో.? ఎందుకంటే అక్కడున్నది పవన్‌కళ్యాణ్ మరి.