పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' సినిమా లుక్‌ని చిత్ర నిర్మాత శరద్‌మరార్ విడుదల చేశారు. అది కూడా హడావిడిగా. సెప్టెంబర్ 2న పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ముందురోజే టైటిల్‌ని అనౌన్స్ చేసిన విషయం విదితమే. అర్థరాత్రికి ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.
టైటిల్ విషయంలో ముందు నుంచీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆ ఊహాగానాల్నే ఫైనల్ చేసేశారు చిత్ర నిర్మాత శరద్ మరార్. టైటిల్ కోసం కసరత్తు చేశారో లేదోగానీ, పవన్ ఫస్ట్ లుక్ విషయంలో ఏమాత్రం కసరత్తు చేసినట్టు లేదు చిత్ర యూనిట్. దర్శకుడు కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) కూడా ఫస్ట్ లుక్‌పై జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం.
సినిమా టైటిల్‌తో కూడిన పవన్ ఫొటో ఒకదాన్ని విడుదల చేశారంతే. అంతకు మించి, 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్‌లో ప్రత్యేకత ఏమీ లేదు. మామూలుగా అయితే, ఫస్ట్ లుక్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా ఈక్వేషన్స్ ఫాలో అవుతుంటారు. సినిమాపై అంచనాల్ని పెంచే దిశగా ఫస్ట్ లుక్‌ని చాలా పక్కాగా డిజైన్ చేసి వదులుతారు. అలాంటిది, అదేదో గ్రాఫిక్స్ ఫొటో అన్నట్లుగా వదిలేశారంతే.
అసలు, ఫొటోలో వున్నది పవన్కళ్యాణేనా.? లేదంటే చాలా ఫొటోలు మిక్స్ చేసి పవన్‌కళ్యాణ్ లుక్ తీసుకొచ్చారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి 'కాటమరాయుడు' సినిమా అభిమానుల్ని ఇంకా గందరగోళంలోనే వుంచుతోంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అనుకోకుండా డాలీ చేతిలోకి వచ్చింది. అజిత్ హీరోగా వచ్చిన తమిళ సినిమాకి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. అంతా ప్రచారమే, అసలు సినిమా ఏంటి.? అన్నది మాత్రం ఇంకా సస్పెన్సే.
ఓ వైపు రాజకీయం ఇంకో వైపు సినిమా.. రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్, 'కాటమరాయుడు' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా.? ఈ సందేహాలు ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయని ఫస్ట్ లుక్ తర్వాత మరింతగా పెరిగిపోయాయి.