రివ్యూ: జనతా గ్యారేజ్
రేటింగ్: 2.75/5
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
తారాగణం: మోహన్‌లాల్, ఎన్టీఆర్, సమంత, నిత్య మీనన్, ఉన్ని ముకుందన్, సాయికుమార్, సురేష్, అజయ్, బ్రహ్మాజీ, దేవయాని, సితార, కాజల్ అగర్వాల్ తదితరులు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఎస్. తిరునావుక్కరసు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎం)
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: సెప్టెంబరు 1, 2016
'జనతా గ్యారేజ్'పై ఏ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడు, ఎన్టీఆర్‌లాంటి మాస్ హీరోతో కలిసినప్పుడు ఆ కలయికలో వచ్చే సినిమా సంచలనానికి తగ్గే సమస్యే లేదని ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్‌కి తోడు మోహన్‌లాల్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు ఉండడం, ట్రెయిలర్ చాలా ప్రామిసింగ్‌గా అనిపించడంతో 'జనతా గ్యారేజ్' తప్పక చూడాల్సిందేనని సినీ ప్రియులు నిర్ణయించేసుకున్నారు. పాత కథలతోనే కనికట్టు చేసి మొదటి రెండు చిత్రాలనీ అంతటి హిట్లు చేసిన కొరటాల శివ పనితనంపై ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు. కమర్షియల్ అంశాలని జోడించి అన్ని వర్గాలనీ ఆకట్టుకోవడంలో సిద్ధహస్తుడని అనిపించుకున్న కొరటాల శివ ఈసారి మాత్రం గారడీ చేయలేకపోయాడు, తన కథకి వాణిజ్య విలువలు జోడించే క్రమంలో గాడి తప్పాడు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఒక సామాన్యుడు 'డాన్' మాదిరిగా ఎదగడం, ప్యారలల్ గవర్నమెంట్‌లాంటిది నడపడం అనే పాయింట్ కొత్తదేమీ కాదు. ఈ ప్లాట్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి, అలాగే ఇలాంటి పాత్రలు నిజ జీవితంలోను ఉన్నాయి. నాయకుడు, గాయం, సర్కార్… వీటన్నిటికీ మూలమైన 'ది గాడ్ ఫాదర్' లాంటి గొప్ప చిత్రాలు ఈ ప్లాట్‌తో తెరకెక్కాయి. ఒక పాత కథని తీసుకుని దానిని తిరిగి చెప్పడమనేది కొత్తేమీ కాదు కానీ, ఎప్పుడయితే ఆ ప్లాట్‌తో పైన చెప్పిన లాంటి అద్భుతమైన సినిమాలు రూపొందాయో అప్పుడు వాటిని తలదన్నేలా కాకపోయినా, కనీసం వాటికి సాటి నిలిచేలా మళ్లీ సినిమా తీయడం మాత్రం తేలిక కాదు.
కొరటాల శివ ఎన్ని వంకర్లు తిప్పి ఈ కథకీ, పైన చెప్పుకున్న వాటికీ సంబంధం లేదనిపించాలని చూసినా కానీ మనకి అవే సినిమాలు, వాటిలోని పాత్రలు, సంఘటనలు తలపుకొస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రామ్‌గోపాల్‌వర్మ తీసిన 'సర్కార్'కి యాక్షన్ జోడించి, కాస్త మాస్ మసాలా ట్రీట్‌మెంట్ ఇస్తే ఎలాగుంటుందో 'జనతా గ్యారేజ్' అలాగే ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు కొన్ని కీలకమైన ఘట్టాలు సైతం 'సర్కార్' నుంచి కాపీ చేసినట్టే అనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఒకే కథని పలుమార్లు తెరకెక్కించి పలువురు దర్శకులు సక్సెస్ అయినప్పుడు ఆ కథనే మళ్లీ చెప్పి కొరటాల శివ ఫెయిలవడానికి ఆస్కారం లేదు. కాకపోతే తన పాత్రలని, సన్నివేశాలనీ అద్భుతంగా తీర్చి దిద్దుకోవాలి.
'జనతా గ్యారేజ్'లో ఒక సన్నివేశముంటుంది. గ్యారేజ్ బాధ్యతలని ఎన్టీఆర్ భుజానికి ఎత్తుకున్న తర్వాత తమ దగ్గరకి సాయానికి వచ్చిన ప్రభుత్వోద్యోగి రాజీవ్ కనకాలని కలవడానికి వెళతాడు. అతడిని కలిసిన దగ్గర్నుంచి, అతని సమస్య తీర్చే వరకు జరిగేదంతా చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఒక్కటి కాదు కనీసం అయిదారు పెట్టుకునే వీలున్న ప్లాట్ ఇది. కానీ కొరటాల శివ అలాంటి బలమైన సన్నివేశాల జోలికి పోకుండా, ఎమోషనల్ డెప్త్ గురించి ఆలోచించకుండా పైపైన టచ్ చేసుకుంటూ పోయాడు. మోహన్‌లాల్ 'జనతా గ్యారేజ్'లో కార్లు, బైకులతో పాటు మనుషుల్ని కూడా రిపేర్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణమైతే బాగుంది కానీ దానికి ముందు బిల్డప్ సరిగా కుదర్లేదు. అప్పటికప్పుడు సడన్‌గా రైజ్ అయిపోయినట్టు చూపిస్తే ఇక ఆ 'ఎదుగుదల'లో కిక్ ఉండదు, వాస్తవికత అసలే ఉండదు. పోనీ సమయాభావం వల్ల అని సరిపెట్టుకున్నా కానీ తర్వాత అతను ప్రభుత్వాన్ని శాసించే శక్తిగా ఎదిగాడనేది చూపించడానికి సరైన సన్నివేశాలు పడలేదు. 'మీరే అర్థం చేసుకోండి' అన్నట్టుగా పలు నమ్మశక్యం కాని సన్నివేశాలని చాలా సింపుల్‌గా కథలోకి ఇరికించేసారు.
Watch Janatha Garage Public Talk
ఇక పాతికేళ్ల పాటు జనతా గ్యారేజ్‌తో తిప్పలు పడుతోన్న విలన్ అయినా స్ట్రాంగ్‌గా లేడు. మోహన్‌లాల్ కొడుకే శత్రు పక్షంతో చేరినప్పటికీ అటువైపు ఎలాంటి బలం రాదు. ఇటు హీరో పాత్రకి వస్తే ప్రకృతి ప్రేమికుడు. సాధారణంగా ఇలాంటి వాళ్లు సాత్వికంగా ఉంటారు. కానీ మన కథానాయకుడు మాస్ కనుక ఫైట్లు చేస్తాడు. ఒక ఫైట్లో ప్రకృతికి కోపం వస్తే ఎలాగుంటుందో శాంపిల్ చూపిస్తానంటాడు. అతను చూపించిన శాంపిల్‌లో 'అబ్బా' అనిపించేదేదీ మనకి కనిపించదు. కానీ అతడిని కొట్టడానికి వచ్చినవాడు మాత్రం భయపడిపోయి కాళ్ల మీద పడిపోతాడు. దృశ్యంతో కాకుండా మాటలతో విషయాన్ని కన్వే చేసేటట్టయితే ఇక అంతలేసి ఫైట్లెందుకు, ఫీట్లెందుకు? హీరో గ్యారేజ్‌లోకి వచ్చేవరకు మోహన్‌లాల్ చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఇక ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందే అనుకున్న టైమ్‌లో మోహన్‌లాల్ డల్ అయిపోతాడు. ఎంత అంటే ఇక ఆ తర్వాత ప్రతీ పనీ ఎన్టీఆరే చేస్తుంటాడు తప్ప మోహన్‌లాల్ ఎక్కడా కానరాడు. అంత పవర్‌ఫుల్ పాత్రని చిన్న యాక్సిడెంట్‌తో అలా పాసివ్‌గా మార్చేయడం ఏమాత్రం పాత్రౌచిత్యం అనిపించదు.
ఎమోషనల్ డెప్త్ ఉందనిపించడానికా అన్నట్టు ఎన్టీఆర్, సమంత విడిపోయే బలవంతపు సన్నివేశమొకటి పెట్టారు. వాళ్లు విడిపోయినందుకు చివుక్కుమనిపించాలంటే, అసలు వాళ్లిద్దరి మధ్య బంధం బలమైనదనే సంగతి మనకి అర్థం కావాలి కదా. 'ఆ మొక్కంటే ఎంత ఇష్టమో బుజ్జి అంటే అంత ఇష్టం' అని హీరో చెప్పిన మాటతో మనం వాళ్లిద్దరి మధ్య విడదీయరాని బంధం ఉందని అనేసుకోవాలి. సరే విడిపోయారు తర్వాతేంటి అని చూస్తే… అజయ్, అతను ప్రేమించిన స్త్రీకి సంబంధించిన సబ్ ప్లాట్ ఉంది. వాళ్లిద్దరికీ పెళ్లి చేసి నెక్స్‌ట్ సీన్‌లో ఆమెని చంపేస్తారు. కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కారణం… సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం. ఇక ఫైనల్‌గా క్లయిమాక్స్‌కి తీసుకున్న అంశం కూడా మనకి తెలియనిదేమీ కాదు. పైగా దానిని సరిగా తీయనూలేదు.
ఒకటి రెండు సందర్భాలు మినహా చాలా బలహీనంగా సాగే కథనం ఈ చిత్రానికి అతి పెద్ద విలన్ అయింది. పలు సందర్భాల్లో కథనంలోని బలహీనతని కప్పి పుచ్చగలిగే ప్రదర్శనతో ఎన్టీఆర్ ఈ చిత్రానికి నిజంగా హీరో అనిపించుకున్నాడు. మోహన్‌లాల్ సామర్ధ్యానికి తగ్గ పాత్ర కాదు కానీ ఆయన ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి కొండంత బలమయ్యాయి. హీరోయిన్లిద్దరివీ కూరలో కరివేపాకు తరహా పాత్రలే. హీరోయిన్లు ఉన్నారా అంటే ఉన్నారుగా అన్నట్టు. సమంతతో విడిపోయే దృశ్యంలో ఎన్టీఆర్ నటన అతని స్థాయిని తెలియజెప్తుంది. ఈతరం నటుల్లో అతనెంత టాలెంట్ ఉన్నవాడో స్పష్టం చేస్తుంది. నిత్య మీనన్ మరోసారి ప్రాధాన్యత లేని పాత్రలో వృధా అయింది. కాజల్ అగర్వాల్ పాట మాస్‌కి ఊపునిస్తుంది. మిగిలిన వారిలో దేవయాని నటన అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి బాగున్నాయి. ఉన్నత శ్రేణి ఛాయాగ్రహణం, సాంకేతిక, నిర్మాణ విలువలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలయ్యాయి. కొరటాల శివ మాటల రచయితగా రాణించినా కానీ కథకుడిగా, దర్శకుడిగా తన సామర్ధ్యం మేరకు ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. పాత్రధారులే అతడి బలహీనతల్ని కప్పిపుచ్చాల్సి వచ్చింది. ఎన్టీఆర్ మరోసారి తన సర్వ శక్తులూ ఒడ్డాడు. మరో 'సింహాద్రి' కనుచూపు మేరలోనే ఉందనిపించేంతలోనే ఒక సగటు సినిమాతో ఉస్సూరనిపించాడు.
ఎన్టీఆర్ ఇమేజ్‌కి భిన్నంగా కంటెంట్ హైలైట్ అయ్యే అటెంప్ట్ చేద్దామనేది మంచి థాట్ కానీ… అతని సినిమాలకి ఉండాల్సిన, జనం ఆశించే లక్షణాలు, గుణాలు, అంశాలు లేనప్పుడు కథలోని డ్రామా కట్టిపడేయాలి. సన్నివేశాల్లోని గాఢత కదలకుండా కూర్చోబెట్టగలగాలి. పాత్రలు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాలి. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అంటూ సినిమా తీసిన దర్శకుడు తన కథకి సంబంధించిన రిపేర్ల కోసం ముందుగా దానిని 'జనతా గ్యారేజ్'కి పంపించి ఉండుంటే బాగుండేది!
బోటమ్ లైన్: జనతా గ్యారేజ్ – ఇచట చాలా రిపేర్లున్నాయి!
– గణేష్ రావూరి