Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ కళ్యాణ్ కు 'దేశం' అభిమాని లేఖ

పవన్ కళ్యాణ్ కు 'దేశం' అభిమాని లేఖ

కేంద్రం ఎంత ఇచ్చింది? రాష్ట్రం వాటిని ఏం చేసింది. ఇలా లెక్కలు నిజనిజాలు తేలుస్తాం అంటూ రంగంలోకి దిగిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వ్వవహారంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సహజంగా ఎవరి అభిమానం వారికి వుంటుంది. తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం వుందని, తాను ఆ పార్టీ అభిమానిని అంటూ ఓ వ్యక్తి గమ్మత్తుగా రాసి పంపిన లేఖ ఇది..

పవన్ కళ్యాణ్ గారికి

నేను ముందుగానే అసలు విషయం చెబుతున్నాను. నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని. మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ధన్యవాదాలు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని మాత్రం సరిగా లేదనిపిస్తోంది. కేంద్రం మన రాష్ట్రానికి ఏం చేయాలో, ఏం కావాలో అన్నది మీరు డిమాండ్ చేయాలి. ఓ పార్టీ నేతగా మీరు చేయాల్సింది ఇది. అంతే కానీ, కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు, అసలు ఏం వచ్చాయి? ఎంత వచ్చాయి? ఏం చేసారు అన్నది కాదు.

ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీ కానీ, రాజకీయ పార్టీలకు కాదు. ఆ విషయం మీకు తెలుసు. రైట్ ఆఫ్ ఇన్ ఫార్మేషన్ ప్రకారం మీరు సమాచారం అడగడానికి అవకాశం వుంది కనుక దాన్ని వాడుతున్నారు. అదే మీ దగ్గర నుంచి మేం సమాచాం అడిగితే చెబుతారా? అజ్ఞాతవాసి సినిమా కారణంగా కేవలం ఏరియాల వారీ కొన్న బయ్యర్లే కాదు, చిన్నచిన్న ఊళ్లకు కొన్నవారు, థియేటర్ల వారీ కొన్నవారు ఎందరో భారీగా నష్టపోయారు. ఆ లెక్కలపై నిజానిజాలు తేల్చగలరా మీరు?

పోనీ అజ్ఞాతవాసి అంటే మీకు నేరుగా సంబంధం లేకపోవచ్చు. మీరు సమర్పించి సగం వాటా తీసుకున్న సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయడు లెక్కలు చెప్పగలరా? దాని వల్ల మీకు ఎంత లాభం వచ్చింది? బయ్యర్లకు ఎంత నష్టం జరిగింది వివరిస్తారా? దీనికోసం కావాలంటే మేం కూడా రైట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసే అవకాశం వుందేమో చెప్పగలరు.

మీరు కేవలం ఓ నిర్మాత లేదా హీరో అయితే మేమూ ఇలా అడిగే వాళ్లం కాదు. కానీ మీరు ఓ రాజకీయ నాయకుడు. అన్నీ అనుకున్నట్లు అంటే మీరు అనుకున్నట్లు జరిగితే, ఎప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలోని కీలమైన పదవిలో వుంటారు. అలా వుండాలనుకునే వారు, వుండేవారు మిగిలిన వారికి ఆదర్శంగా వుండాలి. చంద్రబాబు ఏటా తన ఆస్తులు వెల్లడిస్తున్నారు. అందువల్ల మీరు కూడా అలా మీ ఆస్తుల వివరాలు వెల్లడించాలి. మీ సినిమాల లెక్కలు వెల్లడించాలి. మీ సినిమాల వల్ల అన్యాయం అయినవారిని ఆదుకోవాలి.

అప్పుడు మీకు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని డిమాండ్ చేసే హక్కు వుంటుంది. అంతే కానీ మీరు ఆచరించకుండా కబుర్లు చెప్పడం సరికాదు.

ఇట్లు

తెలుగుదేశం పార్టీ అభిమాని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?