పవన్‌కళ్యాణ్ ఓ లైన్ అనుకుంటారు.. ఆ లైన్ చుట్టూ దర్శకుడు కథ ప్రిపేర్ చెయ్యాలి. ఇదీ గత కొన్నాళ్లుగా పవన్‌కళ్యాణ్ చేస్తున్న సినిమాల పరిస్థితి. వాస్తవానికి, ఈ వ్యవహారం పవన్‌కళ్యాణ్ సినిమా కెరీర్ స్టార్ట్ అయిన తొలినాళ్ళ నుంచీ అక్కడక్కడా కనిపిస్తున్నా, ఈ మధ్యకాలంలో మరీ 'విపరీత పోకడలకు' పోతున్నారట పవన్‌కళ్యాణ్ 'లైన్' విషయంలో.
'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ఈ 'లైన్' కారణంగానే దెబ్బతినేసిందనీ, అంతకు ముందు సంపత్ నంది కూడా ఈ 'లైన్' గోల తట్టుకోలేక ఈ సినిమాకి దూరమైపోతే, బాబీ బలిపశువైపోయాడనీ టాలీవుడ్లో చాన్నాళ్ళుగా గుసగుసలు విన్పిస్తున్నాయి. 'అబ్బే.. ఒక్కసారి కథ ఓకే అయ్యాక.. పవన్‌కళ్యాణ్ ఎక్కడా జోక్యం చేసుకోరు.. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు..' అని 'సర్దార్ గబ్బర్‌సింగ్' విడుదలకు ముందు చెప్పిన బాబీ, ఇప్పుడు పవన్‌కళ్యాణ్ పేరు చెబితేనే ఆమడదూరం పారిపోతున్నాడట.
పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎస్‌జె సూర్య కూడా ఇప్పుడాయన్ని తట్టుకోలేక, తనదారి తాను చూసుకున్నాడన్నది ఈ మధ్యకాలంలో విన్పిస్తోన్న వాదన. తాజాగా, ఈ దెబ్బ 'డాలీ'కి కూడా తగిలేసిందట. త్రివిక్రమ్ కూడా పవన్‌కళ్యాణ్ 'లైన్'లోకి వెళ్ళలేకపోవడంతో, పవన్‌కళ్యాణ్ తదుపరి సినిమా 'గాల్లో దీపం'లా తయారయ్యిందన్నది సినీ వర్గాల్లో విన్పిస్తోన్న హాటెస్ట్ గాసిప్.
'సర్దార్ గబ్బర్‌సింగ్' దెబ్బతినేసింది కాబట్టి ఇలాంటి గాసిప్స్.. అదే, ఆ సినిమా హిట్టయ్యి వుంటే పరిస్థితులు ఇంకోలా వుండేవని 'పవనిజం'లో కొట్టుమిట్టాడే అభిమానులు అనుకోవచ్చుగాక.. సినిమా లాంఛనంగా ప్రారంభమైపోయి, దర్శకులు మారుతూ వుంటే, అసలు ఆ సినిమా భవిష్యత్తు ఏంటో ఎవరికీ తెలియడంలేదంటే.. పవన్‌కళ్యాణ్ 'లైన్' గురించి విన్పిస్తున్నవన్నీ ఉత్త గాసిప్స్ ఎలా అవుతాయి.?