అసదుద్దీన్ ఒవైసీ.. చాలా పవర్‌ఫుల్ లీడర్.. ఓ పార్టీకి అధినేత, అది కూడా ఓ వర్గానికి ప్రతినిథినని గట్టిగా చెప్పుకునే వ్యక్తి. అందుకే ఆ వర్గం ఆయన్ని నాయకుడిగా చూస్తుంది. మొత్తంగా కాదు, హైద్రాబాద్‌లో 'ఆ వర్గానికి చెందిన మెజార్టీ ఓట్లు' ఒవైసీ పార్టీ ఖాతాలోనే వుంటాయి. హైద్రాబాద్‌లో.. అందునా పాత బస్తీలో ఒవైసీని కాదని, ఏ పార్టీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అంతెందుకు, పాతబస్తీలో ఒవైసీ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కూడా అడుగు పెట్టే పరిస్థితి వుండదనే బలమైన అభిప్రాయం నెలకొంది. అదెంత నిజం.? అన్నది పాత బస్తీలోనే కాదు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ తెలుసు.
ఇంత పవర్‌ఫుల్ లీడర్‌కి ఇప్పుడు పదవీ భయం పట్టుకున్నట్టుంది. భారతీయ జనతా పార్టీ, ఒవైసీని టార్గెట్‌గా చేసుకుని నానా రచ్చా చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి (ఈయనా బీజేపీ సీనియర్ నాయకుడే కదా), అసదుద్దీన్ ఒవైసీ మీద ఫిర్యాదు చేసేశారు. ఒవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ నానా యాగీ చేసేస్తున్నారు. ఇంతకీ, ఒవైసీ చేసిన ఆ నేరమేంటో తెలుసా.? ఐసిస్ తీవ్రవాదుల్ని వెనకేసుకురావడం.
ఆగండాగండీ.. ప్రస్తుతానికి వారంతా ఐసిస్ తీవ్రవాదులు కాదు.. ఐసిస్ సానుభూతిపరులు లేదా అనుమానితులు మాత్రమే. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది గనుక, నిందితులు. నిందితులు దోషులుగా తేలాకనే, ఐసిస్ తీవ్రవాదులవుతారు. ఈలోగా వారిని నిందితులు అని మాత్రమే అనాలట. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. అదృష్టవశాత్తూ భాగ్యనగరవాసులు తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్నారు. లేదంటే, పరిస్థితులు అత్యంత దారుణంగా వుండేవి ఈ ఐసిస్ నిందితుల పుణ్యమా అని.
మామూలుగా అయితే, ఇలాంటోళ్ళ తరఫున వాదించడానికి న్యాయవాదులు కూడా ముందుకు రాకూడదు. మన ప్రజాస్వామ్యం లెక్కలు వేరు. కసబ్ లాంటోడికే న్యాయవాదిని పెట్టిన ఘనత మనది. అలాగని, ఓ రాజకీయ పార్టీ తనంతట తానుగా ముందుకొచ్చి తీవ్రవాదులకు న్యాయసహాయం చేస్తామంటే ఎలా.? ఇక్కడే ఒవైసీ అడ్డంగా ఇరుక్కుపోయారు. అది మొదలు, వీలు చిక్కినప్పుడల్లా ఒవైసీ, ఐసిస్ మీద విరుచుకుపడిపోతున్నారు.
తాజాగా ఐసిస్ మీద 'కుక్కలు..' అంటూ విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ, 100 ముక్కలుగా నరికేస్తామంటూ యావత్ ముస్లిం జాతి తరఫున ఐసిస్ చీఫ్ అబూ బాకర్ బగ్దాదీకి అల్టిమేటం జారీ చేసేశారు. ఇంకో గొప్ప మాట కూడా చెప్పారండోయ్.. ఈ సమయంలో భారతదేశంలోని ముస్లింలు అంతా శాంతియుతంగా, ఐక్యంగా వుండాలని నినదించారు.
వారెవ్వా.. అసదుద్దీన్‌లో ఎంత మార్పు.? ఈ మార్పు అంతా, 'న్యాయసహాయం' అంటూ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలోనేనా.? ఎంతగా ఇప్పుడు అసదుద్దీన్ మాట మార్చినా, ఆయనగారిపై 'వేటు' మాత్రం తప్పదా.? ఏమో, ఆయన భయం చూస్తోంటే వేటు తప్పదనే అన్పిస్తోంది. అసదుద్దీన్ భయం కాకపోతే.. ఇండియాలో వాక్‌స్వాతంత్య్రాన్ని ప్రదర్శిస్తే పదవులు ఊడిపోతాయా.?