Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌కళ్యాణ్‌ 'స్పీడ్‌' దేనికోసం.?

పవన్‌కళ్యాణ్‌ 'స్పీడ్‌' దేనికోసం.?

సాధారణంగా ఓ సినిమా ఓకే చేశాక, దాన్ని పట్టాలెక్కించడానికే పవన్‌కళ్యాణ్‌ చాలా సమయం తీసుకుంటాడు. ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు.? అన్నది ఆ పైవాడికే ఎరుక. అంత స్లోగా వుంటాయి పవన్‌కళ్యాణ్‌ సినిమాలు. అప్పుడప్పుడూ వేగం కన్పించినాసరే, ఓవరాల్‌గా చూసుకుంటే, సినిమాలు చేయడంలో పవన్‌కళ్యాణ్‌ చాలా 'స్లో'. 

కొన్ని సినిమాలకైతే, స్టార్‌ కాస్టింగ్‌ దగ్గర్నుంచి, దర్శకులు, సంగీత దర్శకులు, ఇతర టెక్నీషియన్లు కూడా మారిపోతుంటారు.. పవన్‌ 'స్లో' కారణంగా. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి దర్శకుడు మారాడు. 'కాటమరాయుడు'కి దర్శకుడే కాదు, సినిమాటోగ్రాఫర్‌ కూడా మారిపోయాడు. అలా చాలానే మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అన్నిటికీ కారణం 'లేట్‌'. కానీ, అనూహ్యంగా పవన్‌కళ్యాణ్‌, ఒకదాని తర్వాత ఒకటి.. వరుస సినిమాల్ని ఓకే చేసేస్తున్నాడు. 

'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. ఇంతలోనే, ఇంకో సినిమా పట్టాలెక్కేసింది. సెట్స్‌ మీదకు వెళ్ళాల్సి వున్నా, ప్రారంభోత్సవం జరిగిపోయింది గనుక.. సినిమా పట్టాలెక్కేసినట్లే లెక్క. పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో చేయబోయే సినిమా డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. జనవరిలో, దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌ సినిమా ప్రారంభమవుతుందట. ఏంటీ, నిజమేనా.? అనడక్కండి. ఏమో, నిజమవ్వొచ్చుగాక.! 

ఇంతకీ, ఈ స్పీడ్‌ దేనికి.? అంటే, జనసేన పార్టీ కోసమేనన్న సమాధానం వస్తోంది. 2019 ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయాలి గనుక, అంతకన్నా ముందే చేయాల్సిన సినిమాల్ని కంప్లీట్‌ చేసెయ్యాలన్నది పవన్‌ ఆలోచన అట. ప్రస్తుతానికైతే ఇవన్నీ 'అట'లు మాత్రమే. ఎందుకంటే, ప్రస్తుతానికి జనసేన పార్టీ నిర్మాణం అయితే జరగలేదు. మొన్నామధ్య యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. అంటూ ఏవేవో ప్రకటనలు జనసేన నుంచి వచ్చాయి. ఆ ప్రకటనలు ఇవ్వడానికే సరైన టీమ్‌ జనసేన వద్ద లేని పరిస్థితి. 

జనసేన పార్టీ కోసమే, పవన్‌కళ్యాణ్‌ హీరోగా సినిమాలు చకచకా చేసేస్తాడంటే, అభిమానులకు అది కొంత సంతోషాన్నిచ్చే విషయమే. అయితే, పవన్‌కళ్యాణ్‌ నుంచి హడావిడిగా వచ్చే సినిమాల్ని అభిమానులూ ఆశించరు. అలాగని, డిలే చేస్తే అన్ని సినిమాలూ హిట్టయిపోతాయా.? అని కూడా చెప్పలేం. మొత్తమ్మీద, పవన్‌కళ్యాణ్‌ అయితే తొందరపడ్తున్నాడు.. అది జనసేన కోసమేనా.? అసలు ఈ వేగంలో చిత్తశుద్ధి వుందా.? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?