నాన్సెన్స్‌.. ఇది మోడీ ఘనతేంటి.?

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశంలో నీఛ నికృష్ట రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. పాకిస్తాన్‌ సైన్యం, తీవ్రవాదుల్ని భారత్‌లోకి ఎగదోసే క్రమంలో భారత సైన్యాన్ని యురీలో ఊచకోత కోసింది. ఈ ఘటనలో…

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశంలో నీఛ నికృష్ట రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. పాకిస్తాన్‌ సైన్యం, తీవ్రవాదుల్ని భారత్‌లోకి ఎగదోసే క్రమంలో భారత సైన్యాన్ని యురీలో ఊచకోత కోసింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా భారత సైన్యం, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాల్లోకి దూసుకెళ్ళింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయిన విషయం విదితమే. 

ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరు చెప్పి బీజేపీ, కాంగ్రెస్‌.. ఇతర రాజకీయ పార్టీలు పొలిటికల్‌ డ్రామా షురూ చేశాయి. సైన్యం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, శతృమూకలతో పోరాడుతోంటే, దురదృష్టవశాత్తూ ఆ క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం.. ఆ ప్రయత్నాన్ని విపక్షాలు ఆక్షేపిస్తుండడం.. అంతా నిస్సిగ్గు వ్యవహారంలా తయారయ్యింది. 

ముందుగా కాంగ్రెస్‌ నేత నోట, 'సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఆధారాలు చూపించండి..' అనే మాట వచ్చింది. అప్పట్లో, కాంగ్రెస్‌ తీరుని 'నాన్సెన్స్‌' అని దేశమంతా ఒప్పుకుంది. ఆ తర్వాత, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, కూడా 'ఆధారాలు' అడిగి, చీవాట్లు తిన్నారు.. చివరికి, క్షమాపణ కోరారు కూడా. కానీ, బీజేపీ నీఛ రాజకీయాలు చూస్తే, కాంగ్రెస్‌ – ఆప్‌ అలా ప్రశ్నించడం తప్పేమీ కాదన్పిస్తోంది. 

కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఘనత ప్రధాని నరేంద్రమోడీదేనంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఎవరి ఖాతాలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ క్రెడిట్‌ వేయాలన్నది, భారత ప్రజానీకం డిసైడ్‌ చేస్తారు. అసలు, ఈ సమయంలో 'క్రెడిట్‌ కోసం ఆరాటం' ప్రదర్శించడమంటే అంతకన్నా, దిక్కుమాలిన రాజకీయం ఇంకొకటుండదు. ప్రధాని నరేంద్రమోడీ అనుమతి లేకుండా, సర్జికల్‌ స్ట్రైక్స్‌ క్రెడిట్‌ని బీజేపీ, తన ఖాతాలో వేసుకుంటోందని అనుకోలేం. 

ఇక, కాంగ్రెస్‌ హయాంలోనూ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయనడానికి కొన్ని ఆధారాలున్నాయి. అయితే, అదంతా ఉత్తదేనని బీజేపీ చెబుతోందిప్పుడు. సాక్షాత్తూ రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆనాటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ వ్యవహారాన్ని కొట్టి పారేస్తున్నారు. 

ఇంకా పాకిస్తాన్‌ – భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోలేదు. భారత్‌పై యుద్ధానికి పాకిస్తాన్‌ కాలు దువ్వుతోంది. అదే సమయంలో, పాకిస్తాన్‌కి చైనా తెరవెనుక వుండి సహాయ సహకారాలు అందించేందుకు సమాయత్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలని విపక్షాలు ప్రశ్నించడమెంత హేయమో, సర్జికల్‌ స్ట్రైక్స్‌ క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకునేందుకు మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నం అంతకన్నా హేయం. 

ప్రాణాలు కోల్పోయింది సైన్యం.. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆపరేషన్‌ నిర్వహించింది సైన్యం.. మధ్యలో ఈ రాజకీయాల గోలేమిటి నాన్సెన్స్‌ కాకపోతే.!