పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌లో ఏం చెబుతాడో?? రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడో.. అనే చర్చ బాగానే జరుగుతోంది. పవన్ పార్టీ పెట్టడుగానీ, ఏదో ఓ పార్టీకి మద్దతు తెలపడం ఖాయం అనే ఊహాగానాలు జోరందుకొంటున్నాయి. ఈలోగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకొంటున్నారు. కొన్ని పార్టీలు వవన్‌ని లాగేసుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. ఈలోగా చిరంజీవి కూడా రంగంలోకి దిగిపోయాడు. పవన్ ఏ టీడీపీ జెండానో పట్టుకొంటే ముందు పోయేది చిరు పరువే.
`సొంత ఇంట్లో తమ్ముడిని కంట్రోల్ చేసుకోలేకపోయావా?` అని కాంగ్రెసోళ్లు కాకిలా పొడుచుకుతింటారన్నది చిరు భయం. అందుకే… తమ్ముడిని దారిలోకి తెచ్చుకోవడానికి చిరు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారట.
అల్లు అరవింద్ కూడా పవన్‌ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నయ్య ఓపార్టీలో నువ్వో పార్టీలో ఉంటే మంచిది కాదు.. అని బుజ్జగిస్తున్నారని సమాచారమ్. వీటికి పవన్ లొంగిపోతే… ఇంకో ప్రెస్ నోట్ రేపో, ఎల్లుండో రావడం ఖాయం. పార్టీ పెట్టడం ఊహాగానాలు మాత్రమే అని ఒక్క ప్రెస్ నోట్‌తో సరిపెట్టేయొచ్చు. ఒక వేళ మరో పార్టీ తీర్థం పుచ్చకొనే ఉద్దేశం ఉంటే మాత్రం.. ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ మనసు విప్పి మాట్లాడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.