వేర్పాటు వాదులు నిన్నా మొన్నటి వరకు ఒక పక్క తెలంగాణా కోరుకొంటూనే మరో పక్క “హైదరాబాద్ లేని తెలంగాణా రాష్ట్రం” మాకు వద్దు అని విజ్ఞప్తులు చేసుకున్న విషయం అందరికీ విదితమే. హైదరాబాద్ లేని తెలంగాణా రాష్ట్రం లో రాజధాని పునర్నిర్మాణం చేయడం శక్తికి మించిన పని అని వేర్పాటు వాదులు అందరు నిన్నటి వరకు దాదాపు గా అంగీకరించిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు కేంద్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం లో ఉన్న బిజెపి అపవిత్ర కలయిక మూలం గా పార్లమెంటు లో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి అనక పుట్టించిన తెలంగాణా రాష్ట్రం లోనే హైదరాబాద్ ఉండడం ఖాయం అయిన రీత్యా ఇంకా తెలంగాణా పునర్నిర్మాణం చెయ్యడం గురించి మాట్లాడటం మభ్యపెట్టడం కాదా అని ప్రజలు భావిస్తున్నారు? అమెరికా లో 1871 లో అగ్ని ప్రమాదానికి ద్వంసం అయిన చికాగో నగరాన్ని, అలాగే 1906 లో వచ్చిన భూకంపాల ధాటికి మూడువంతులు నాశనం అయిన శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని పునర్నిర్మించిన సందర్భాలు చరిత్ర లో మనముందు ఉన్నాయి. ఇంక మన దేశం లో ఉత్తరాంచల్లో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కేదార్నాథ్లోని ఆదిశంకరాచార్యుల సమాధి కూడా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది కాబట్టి దానిని పునర్నిర్మించాలి అంటున్నారు అందులో న్యాయం ఉంది.
ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే నాశనం అయినదాన్ని తిరిగి నిర్మించడమే సహజం గా పునర్నిర్మాణం అవుతుంది. ఈ దృష్ట్యా పునర్నిర్మాణం అనే పదాన్ని తెలంగాణా కంటే సీమాంధ్ర రాష్ట్రానికే అన్వయించడం సబబు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వం లోక్ సభ లో ప్రజాస్వామ్యం తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించి అడ్డగోలుగా ఏర్పాటు చేసింది 29 వ రాష్ట్రం తెలంగాణా అయినా, వాస్తవానికి ఏర్పడింది “రాజధాని లేకుండా సీమాంధ్ర రాష్ట్రం” అన్న విషయం అందరికీ విదితమే. పునర్నిర్మాణం చేయవలసింది హైదరాబాద్ తో సహా 15 వేల కోట్ల రూపాయల పైచిలుకు మిగులు తో వడ్డించిన విస్తరి గా సిద్ధం ఉన్న తెలంగాణా నా? లేదా ఉన్న రాజధానికి పోగొట్టుకొని చేతి లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన చిప్ప పట్టుకొని దొనకొండ లేదా మాచర్ల వద్దనున్న అడవుల్లో కి పోవాల్నా అని దిక్కులు చూస్తున్న సీమాంధ్ర రాష్ట్రాన్నా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
శ్రీకృష్ణ కమీషన్ రిపోర్టు దృష్ట్యా 1956 నుండి కొన్ని అభివృద్ధి సూచికలలో సీమాంధ్ర ప్రాంతం తో పోలిస్తే వేలరెట్లు అభివృద్ధి సాధించిన తెలంగాణా రాష్ట్రాన్ని, అది కూడా హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్రాన్ని ఇంకా పునర్నిర్మాణం చెయ్యాలి అని వేర్పాటు వాదులు చెప్పడం కేవలం దివాలకోరుతనం కాదా? అయితే ఏ ప్రాంతం లో నైనా ఉన్నదాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు లోపాలు ఉంటే సరిదిద్దుకోవచ్చు, దానిలో తప్పు లేదు, కానీ దానికి పునర్నిర్మాణం అనే పదాన్ని వాడడం సరి కాదు అన్నది నా అభిప్రాయం. కరీంనగర్ జిల్లా పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 2011 లో 91 శాతం తో రాష్ట్రం లోనే ప్రధమస్థానం సాధించి, అలాగే రబీ సీజన్ లో 12 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరి పండించి మిగతా జిల్లాలకు ఆదర్శప్రాయం అయిన తదితర విషయాలను వేర్పాటు వాదులు గుర్తించి, ప్రజలలో విద్వేషాలు సృష్టించడం మాని అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని, కనీసం తెలంగాణా జిల్లాల మధ్య అభివృద్ధి లో ఆరొగ్యపూర్వక పోటీని ప్రోత్సహించాలి అని ప్రజలు కోరుకొంటున్నారు.
ఇంకా ఎవరినా తెలంగాణా పునర్నిర్మాణాన్ని సమర్దిస్తుంటే దయచేసి వారు సీమాంధ్ర రాష్ట్ర రాజధానిగా ప్రచారం లో ఉన్న దొనకొండ లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి శిధిల ఎయిర్ పోర్ట్, పాత రైల్వే స్టేషన్ ను హైదరాబాద్ తో పోల్చిచూడండి, పునర్నిర్మాణాన్ని చేయవలసినది ఏ ప్రాంతాన్నో వారికే అర్థం అవుతుంది. కేంద్రం డబ్బులు ఇస్తుంది కదా కట్టుకోవడానికి మీకేం బాధ అనే వారికి తెలంగాణా రాజధాని ని ఏ పాలమూరో లేదా వరంగల్లో ఒకవేళ తరలిస్తే తెలంగాణా సోదరులకు ఎంత బాధ ఉంటుందో మాకు అంత బాధ ఇప్పుడు ఉంది అని సీమాంధ్ర ప్రజలు అనడం లో తర్కం ఉంది కదా?
తెలంగాణా సాధకులు గా విజయం సాధించింది మేమంటే మేమని ఢంకా బజాయించి చెప్పుకుంటున్న వేర్పాటు వాదులు, రాష్ట్రం వచ్చిన తరువాత కూడా ఇంకా సీమాంధ్ర పెట్టుబడి దారుల పైనా పడి ఏడవడం చూస్తుంటే ఇదేదో ఇంకా వోట్లు సీట్లు వ్యవహారంలాగా ఉంది, ఇక తెలంగాణా ప్రజలకు వారు పోటీలు పడి ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు ఎవరు నెరవేరుస్తారు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పనిలో పనిగా కొద్దిమంది పని లేని ప్రొఫెసర్లు సమైక్యవాదం పేరిట సీమాంధ్ర లో జరిగింది విద్వేష పూరిత ఉద్యమం అని, తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా కాక పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాత్రమే జరిగిందని చరిత్ర వక్రీకరణ మొదలు పెట్టారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా సామెత చందాన సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణా ను దోచుకున్నారు అని వేర్పాటు వాదులు చేస్తున్న ప్రచారం ఒక వేళ నిజమే అయితే పిడికెడు పెట్టుబడి దారులను నియంత్రించలేని మొనగాళ్ళు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత మమ్మల్ని ఏమి ఉద్దరిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట వెనకటికి ఒకాయన, రాజకీయ నాయకులు వోట్లు సీట్ల వేటలో చేసే పస లేని ఆరోపణలను కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ రాజకీయ నాయకుల గుంపు లో తెలంగాణా మేధావులు కూడా చేరి కేవలం ఆరోపణలకు పరిమితం అవడం ఆందోళన కలిగించే విషయం అనడం లో సందేహం లేదు. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం రాజ్యధికారమే కాబట్టి రాజకీయ నాయకులు ప్రజలకు చేసిన లెక్కలేనన్ని వాగ్దానాలల్లో ప్రజలకు ఉపయోగపడే వాటిని తెలంగాణా మేధావులు బయటకు తీసి వాటి అమలు కోసం ప్రభుత్వం మీద, పార్టీల మీద ఒత్తిడి తీసుకు రావలసిన బాధ్యత తీసుకొంటే బాగుంటుంది. తివారీ పిత్రుత్వ కేసు లో సుదీర్ఘ పోరాటం లో రోహిత్ శేఖర్ కు చివరికి న్యాయం జరిగిన విషయం, అలాగే లక్ష లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో నాలుగు ఏండ్లు జైలు శిక్ష పడిన ప్రముఖ రాజకీయ నాయకుడి సందర్భాలు మనముందు ఉన్నాయి. కోర్టులు ఇంత క్రియాశీలకం గా ఉన్న ఈ రోజుల్లో సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణా ను దోచుకున్న విషయం వేర్పాటు వాదులు కోర్టులకు తీసుకువెళ్లి వాళ్ళను శిక్షించకుండా, ఆరోపణలతో ప్రజల ముందుకు రావడం కేవలం వోట్లు సీట్ల కోసం ఆడుతున్న రాజకీయ డ్రామా గా ప్రజలు భావించే రోజు తప్పక వస్తుంది. అపుడు ఈ డ్రామా రాయుళ్ళ పార్టీలకు తెలుగు ప్రజలే బుద్ధి చెప్పి ప్రాంతాలకు అతీతం గా తమను ఉద్దరించే వారినే చివరకు గద్దెను ఎక్కిస్తారన్న మాట వాస్తవం.
వ్యాసకర్త: నాగం వెంకటేశ్వరరావు (కాలిఫోర్నియా)