సమస్య సెగ తగిలిందా బాబూ?

తెలుగదేశం పార్టీ మీడియా విభాగం ఇటీవల నిత్యం తెలుగుదేశం అనే పేరిట ఈ పేపర్ తయారుచేయడం ప్రారంభించింది. పార్టీ వార్తలు, చిత్రాలు, వాఖ్యానాలు అందులో ప్రచురిస్తోంది. దాన్ని తెలుగుదేశం డాట్ ఓఆర్జీ సైట్ లో…

తెలుగదేశం పార్టీ మీడియా విభాగం ఇటీవల నిత్యం తెలుగుదేశం అనే పేరిట ఈ పేపర్ తయారుచేయడం ప్రారంభించింది. పార్టీ వార్తలు, చిత్రాలు, వాఖ్యానాలు అందులో ప్రచురిస్తోంది. దాన్ని తెలుగుదేశం డాట్ ఓఆర్జీ సైట్ లో వుంచుతోంది కూడా. కాణీ ఖర్చులేని పని, పైగా ప్రింట్ మీడియాగా మారిస్తే, పార్టీకి సహకరిస్తున్న రెండు దినపత్రికలకు ఆగ్రహం కలుగుతుంది. సరే అదంతా వేరే సంగతి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే  ఏ పత్రికలోనూ వరుసగా రెండురోజుల పాటు ఒకే సంపాదకీయాన్ని ప్రచురించరు. అది పార్టీ పత్రిక అయినా,పైగా పార్టీ పత్రికల సంపాదకీయాలకు విశేష ప్రాధాన్యత వుంటుంది. అది ఆరెస్సెస్ పాంచజన్య అయినా, శివసేన సామ్నాఅయినా. 

తెలుగుదేశం పార్టీ పత్రిక నిన్న, ఈ రోజు అంటే రెండు రోజుల పాటు ఒకటే సంపాదకీయాన్ని పొందుపరిచింది. 'తెలుగుదేశం రాజకీయంలో కార్యకర్తల పాత్ర' అన్నది ఆ సంపాదకీయం మకుటం. అసలు ఈ మకుటమే అసంబద్దం. ఎందుకంటే తెలుగుదేశం రాజకీయంలో కార్యకర్తలకు ఎప్పుడూ పాత్ర లేదు. అలా వుంటే పొత్తులు తమ చిత్తానికి పెట్టకుని వుండేవారు కాదు. సీమాంధ్ర కార్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండా రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చివుండేది కాదు. ఇప్పుడు తాజాగా గడచిన పదేళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి పదవులు లేకుండా పార్టీని భుజాన పెట్టకుని మోస్తున్న కార్యకర్తలనుకాదని,బయట నుంచి నాయకులను దిగుమతి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టదు. 

ఇలా నాయకులను దిగుమతి చేసుకుని తెలుగదేశాన్ని,తెలుగు కాంగ్రెస్ గా మార్చడంపై ఇప్పటికే కార్యకర్తల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి ప్రారంభమైంది. ఇది గమనించి ఓ సుదీర్ఘ వివరణను ఆ సంపాదకీయం రూపంలో అందించారు. రాజకీయ పార్టీ అంటే సజీవనది లాంటిదని, దాని ప్రవాహంలో నిత్య నూతనం సంతరించుకోవడం అవసరమని, ఇప్పుడు చేరుతున్న వారంతా, నదిలో కలిసే పాయల లాంటి వారి వని ఆ సంపాదకీయంలో వివరణ ఇచ్చుకున్నారు. నదిలో మురికినీరు కలిస్తే ప్రమాదం కానీ, మంచి నీరు కలిస్తే పరవాలేదని అంటూనే, ఒక వేళ పొరపాటున మురికి నీరు కలిసినా, దాన్ని సరిదిద్దడానికి నాయకుడు వున్నాడని ముక్తాయింపు ఇచ్చారు. నిజాయితీ వున్నవారు ఎక్కడ వున్నా కలుపుకోవాల్సిన అవసరం వుందని, అలా కలుపుకునేటపుడు అలజడి వుండకూడదని, అన్యాపదేశంగా నాయకులను, కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు. అలజడి వుండకూడదంటే, ఆందోళన చేయడం, ప్రకటనలు ఇవ్వడం వద్దనేగా?

ఇలా డిటైల్డ్ సంపాదకీయం రాసిన తెలుగదేశం పత్రిక, నిన్న కానీ, ఈ రోజు కానీ పార్టీ ముఖ్యుడు కోడెల శివప్రసాదరావు గుంటూరులో మాట్లాడిన పిల్ల కాంగ్రెస్ లా తయారవుతోందన్న కామెంట్లను మాత్రం పత్రికలో ఎక్కడా ప్రచురించలేదు. పార్టీ నాయకుల ప్రకటనలు, ప్రసంగాలు పెద్ద అక్షరాలతో వేసే పార్టీ మీడియా విభాగం కోడెల కామెంట్లను మాత్రం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. పైగా బాబు అనుకూల మీడియా కూడా ఇప్పుడు వలసల వ్యవహారాలను భారీగా ఫోకస్ చేయకపోవడం గమనార్హం.

ఇదిలా వుంటే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కోటా సీట్ ను కూడా పార్టీలోని కీలక పాత్రవహించే కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, మోత్కుపల్లి నర్సింహలు వంటి ఫక్తు తెలంగాణ నాయకుడిని విస్మరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంగతి మరిచి ఎన్నికల్లో అధికారం వస్తే (వస్తుందా?) తెలంగాణలో కీలక పదవులు అన్నీ బిసీ లకే ఇస్తామనడం కూడా పార్టీలో విమర్శలకు దారితీస్తోంది. నర్సింహులు ఎస్ సి వర్గానికి చెందినవారు. అప్పుడు విసర్మించడమే కాక, ఇప్పడు పదవులన్నీ బిసి లకు ఇస్తామని మాటవరసకైనా అనడం తెలంగాణ ప్రాంత ఎస్సీల్లో అసంతృప్తికి దారితీస్తోంది. పైగా బాబు అనుకూల మీడియా ఇదేదో అద్భుత వరంలా మొదటి పేజీలో పెద్దగా ప్రచురించింది. ఆ మీడియా కూడా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కోటాలో సీమాంధ్ర అగ్రకులానికి స్థానం కల్పించిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించినట్లు కనిపిస్తోంది. చేతిలో వున్న అవకాశాన్ని ఇవ్వకుండా, వస్తుందో,రాదో తెలియని దాన్ని ప్రకటించడం, అందునా ఎస్సీలను వదిలేయడం వంటివి కూడా కార్యకర్తల్లో అలజడికి దారి తీస్తున్నాయి. బహుశా దీనిపై కూడా మరో సంపాదీకీయం రాస్తారేమో? 

చాణక్య

[email protected]