మెగాస్టార్ రాజకీయాల్ని చూశాం. పవర్‌స్టార్ రాజకీయాల్ని చూడాల్సి వస్తుందా.? ఏమో మరి.. మీడియా మాత్రం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తోంది పవర్‌స్టార్ రాజకీయాలు చేస్తే ఎలా వుంటుందోనని. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే, అన్నయ్యకు అండగా తమ్ముడు పవన్‌కళ్యాణ్ ఆ పార్టీ యూత్ వింగ్ ‘యువరాజ్యం’ బాధ్యతలు స్వీకరించాడు. కానీ, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. తమ్ముడు పంచెలూడగొడ్తానన్న కాంగ్రెస్ నేతల గ్యాంగ్‌లోకి అన్నయ్య చేరిపోయారు. దాంతో తమ్ముడికి కోపమొచ్చింది రాజకీయాలపై. అప్పటినుంచీ పవన్‌కళ్యాణ్ రాజకీయాల ఊసెత్తలేదు ఎక్కడా.
కానీ, ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడంటూ గాసిప్స్ జోరందుకున్నాయి. పవన్‌కళ్యాణ్ చుట్టూ ఇలాంటి గాసిప్స్ ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచీ వస్తున్నవే. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా పవన్ ఏనాడూ వాటి పట్ల స్పందించలేదు. ఇప్పుడు రాజకీయాల గురించిన వార్తల విషయంలోనూ పవన్ స్పందిస్తాడా.? అంటే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
మొన్నామధ్య పవన్ టీడీపీలో చేరబోతున్నాడనీ, ఈ మేరకు చిరంజీవి ఇంకో తమ్ముడు నాగబాబు, పవన్‌ని ఒప్పించాడని ప్రచారం జరిగింది. టీడీపీ నేతలు కొందరు తొందరపడి, పవన్ తమ పార్టీలోకి వస్తే మంచిదేనన్నారు. కానీ, నాగబాబు – పవన్ టీడీపీలోకి వెళ్తాడన్న వార్తల్ని ఖండించాడు. పవన్ మాత్రం షరామామూలుగానే తన ‘మౌనవ్రతాన్ని’ కొనసాగించాడు గాసిప్స్ విషయంలో. ఇప్పుడు వస్తున్న గాసిప్స్ కూడా అంత విశ్వసించదగ్గవిగా అన్పించడంలేదు.
ఎందుకంటే పవన్ నైజమే అంత. ఏదన్నా సమస్య తన దృష్టికి వస్తే తీవ్రంగా స్పందించడం, తగిన సహాయం చేయడమో.. లేదంటే తన ఆవేశాన్ని అప్పటికప్పుడు బయటపెట్టి, ఆ తర్వాత తనదారిలో తాను వెళ్ళిపోవడమో చేస్తుంటాడు పవన్. హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో (హృదయస్పందన అవేర్నెస్) పాల్గొన్న పవన్, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి ఖాళీ లేదు.. ప్రజలను పట్టించుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నందుకు ఆనందంగా వుంది.. అని అనడంతో పవన్, రాజకీయాలపై దృష్టిసారించాడన్న గాసిప్స్ షురూ అయ్యాయి.
పైగా, పవన్ – నాగబాబు కుమారుడి సినిమా ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు, అదే వేడుకలో పాల్గొన్న చిరంజీవితో సఖ్యతగా వ్యవహరించకపోవడంతో.. అన్నయ్యకు పోటీగా పవన్ రాజకీయాల్లోకొస్తాడన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. అఫ్కోర్స్.. అన్నయ్యతో విభేదాలున్నాయన్న గాసిప్స్‌ని పవన్ ఎప్పుడూ పట్టించుకోడు. ఒక్కోసారి మాత్రం, అన్నయ్యతో తన అనుబంధం గురించి గొప్పగా చెబుతాడు పవన్. ‘పవన్, చిరంజీవిని అన్నయ్యలా కాదు.. తండ్రిలా భావిస్తాడు.. కాబట్టి ఎప్పుడూ పవన్, చిరంజీవి పట్ల వ్యతిరేక భావంతో వుండే అవకాశమే లేదు..’ అని పవన్‌కి అత్యంత సన్నిహితులైనవారు చెబుతారు.
ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే పవన్ రాజకీయాల్లోకి రావడం కేవలం హంబక్ అని భావించాల్సి వుంటుంది. అలాగని, పవన్ రాజకీయాల్లోకి రాడు.. అని ఖచ్చితంగా చెప్పేయలేం. ఏమో.. రోజులెలాగైనా మారొచ్చు. కొన్ని విషయాల్లో చాలా సీరియస్‌గా స్పందించే పవన్, ఏ సందర్భంలో అయినా రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయితే.. దాన్ని ఆపేందుకు బహుశా అన్నయ్య చిరంజీవి కూడా సాహసించలేరేమో.
మొత్తమ్మీద, పవన్ రాజకీయ మంతనాలు జరుపుతున్నారు.. అన్న వార్త అందరిలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. అయితే, అన్నయ్య కాంగ్రెస్‌లో కీలకంగా వున్నప్పుడు, తమ్ముడు పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి పవన్ వస్తాడా.? వస్తే అన్నయ్యను విమర్శించగలడా.? అన్నయ్య, తమ్ముడిని విమర్శించగలడా.? అన్న ప్రశ్నలకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.