తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత మాదే అని కెసియార్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రజలు కూడా ఆయనపైనే ఆ భారాన్ని పెట్టవచ్చు. ఇక ఆంౖధ్రసీమ సమస్య పునర్-నిర్మాణం కాదు, అసలు నిర్మాణమే. 'సీమాంధ్రులు కష్టజీవులు. వారికి చొరవ వుంది. ఎలాగైనా పైకి వస్తారు. ఇప్పుడు ఏడుస్తూ కూర్చోనక్కరలేదు.' అంటూ జయరాం రమేష్‌తో సహా అందరూ సుద్దులు చెప్తున్నారు. 'ఇన్ని లక్షణాలున్నా యిన్నాళ్లూ పైకి రాలేదేం మరి? అక్కణ్నుంచి కడుపు చేత్తో పట్టుకుని హైదరాబాదు రావడం దేనికి? హైదరాబాదు ప్రజలే అటు వెళ్లి వుండాలి కదా' – అని ఎవరైనా ఆలోచించారా? ఇప్పటిదాకా అక్కడ జరిగిన అభివృద్ధి చాలా తక్కువ. అక్కడి నాయకులకు దక్షత, ముందుచూపు లోపించి అక్కడ ఏదీ సరిగ్గా అభివృద్ధి చేయకపోవడం చేతనే విద్యావంతులే కాదు, కార్మికులు సైతం వేలాది మైళ్లు దాటి వచ్చి రాజధానిలో పని చేయవలసి వస్తోంది. అంత అధ్వాన్నంగా ఏలిన నాయకులు యిప్పుడు హఠాత్తుగా మేం సీమాంధ్రను సింగపూర్‌ని చేస్తాం, హాంగ్‌కాంగ్ చేస్తాం అని కాన్వాస్ చేసుకుంటూ ప్రజలను ఆకర్షిద్దామని చూస్తున్నారు. సీమాంధ్ర నిజంగా సింగపూర్ అవుతుందా? అలా చేయాలంటే ఏం కావాలి? ఎవరు పూనుకోవాలి?
తెలుగువారు విడిపోయినా స్నేహవాతావరణం కొనసాగాలని అందరి ఆకాంక్ష. అయితే యిరుప్రాంతాలవారూ సమానస్థాయిలో వున్నపుడే యిది సాధ్యమౌతుంది. అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాదు కలిగి వుండడం చేత, ఐటిఐఆర్ శాంక్షన్ కావడం వలన తెలంగాణ యిప్పుడు మెరుగైన స్థాయిలో వుంది. ఈ యినీషియల్ ఎడ్వాంటేజి ఆంధ్రసీమకు లేదు. ఆంధ్రప్రాంతానికి హామీలే తప్ప నిధులు లేవు. స్పెషల్ స్టేటస్, టాక్స్ హాలిడే – యివన్నీ ఎంతవరకు నిజాలో, ఎంత అబద్ధాలో కొన్నాళ్లకు తేలుతుంది. వాటిని నమ్ముకుని ఏ పెట్టుబడిదారుడు గోదాలోకి దిగుతాడు? సామాజికంగా, రాజకీయంగా సుస్థిరత ఏర్పడే అవకాశాలు కూడా కనబడటం లేదు. రాజధాని గురించి, హైకోర్టు గురించి ప్రాంతాల మధ్య కొట్లాటలు జరగక మానవు. రాయల తెలంగాణ యిస్తాం అనే ఫీలర్ వదలగానే అప్పటిదాకా సమైక్యం పాట పాడిన కర్నూలు, అనంతపురం నాయకులు హైదరాబాదు చేజారి పోకుండా వుండాలనే ఆతృతతో 'మేం కోస్తా వాళ్లతో కలిసి వుండలేం' అంటూ కోస్తావాళ్లను తిట్టేశారు. రేపు రాజధాని గురించి క్లెయిమ్స్ ప్రారంభం కాగానే 13 జిల్లాల వాళ్లు పక్కజిల్లా వాళ్లను కూడా అనుమానిస్తారు, తిట్టిపోస్తారు.
రాజకీయంగా కనీసం మూడు పార్టీలు సమానస్థాయిలో పోటీపడతాయి. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గెలవాలి. ఎవరూ యింకొకరికి మద్దతు యిచ్చే సావకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో, దాని పాలన ఎలా వుంటుందో తెలియదు. ఇక ప్రజల్లో కూడా అశాంతి తప్పదు. తెలంగాణ ఏర్పడ్డాక పదవులు దక్కిన నాయకులు గతం మర్చిపోదాం, అందరం కలిసి వుందాం వంటి ప్రకటనలు యిస్తారు కానీ వాళ్ల పాతప్రసంగాలకు ప్రభావితులైన సామాన్యుడు అంత వుదారంగా వుండలేడు. 'ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోతేనే కదా, మాకు, మా పిల్లలకు ఉద్యోగాలు దక్కేది' అనుకుంటారు, పోరాడుతారు. లక్షలాది ప్రభుత్వోద్యోగుల అక్రమంగా వున్నారంటూ ఉద్యమంలో చాలా అసత్యాలు ప్రచారం చేశారు. ఈ రోజు యిరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయవలసిన ఉద్యోగుల సంఖ్య 50 వేల లోపేట! వీళ్లల్లో ఎంతమంది వెళతారో, వాళ్లు వెళ్లాక ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయో, ఆ ఖాళీల్లో ఎందరు తెలంగాణవారికి ప్రమోషన్లు, ఎపాయింట్మెంట్స్ వస్తాయో వేచి చూడాలి. రాష్ట్రం విడిపోతే రాజధానిలో ఉద్యోగాలు ఎన్ని మిగులుతాయి? 60% జనాభాకు సంబంధించిన ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఇవేమీ సామాన్యులకు విడమరిచి చెప్పలేదు. అయిదారు వేలకు మించి ప్రభుత్వోద్యోగాలు చూపించలేని పక్షంలో 'అయితే ప్రయివేటు ఉద్యోగాలు యిప్పించు' అని తెలంగాణ సామాన్యజనం నాయకులపై ఒత్తిడి తెస్తారు. ప్రయివేటు ఉద్యోగాలలో 80% మంది స్థానికులండాలన్న రూలు అధికారికంగానో, అనధికారికంగానో అమలు చేసే ప్రమాదం వుంది. స్థానికులు ఎవరు అన్నదానిపై యిప్పటివరకు స్పష్టత లేదు. ఇక్కడే చదివినా, థాబ్దాలుగా స్థిరపడి వున్నా, తలిదండ్రులో, తాతముత్తాతలో ఆంధ్రనుండి వచ్చి వుంటే 'నువ్వు తెలంగాణవాడివి కాదు ఫో' అనవచ్చు. ముల్కీ రూలంటూ వుంటే ఒక కొలబద్ద వుంటుంది. అది లేనప్పుడు ఏ విస్సన్న ఏం చెప్పినా అది వేదం అయిపోతుంది. యాజమాన్యంపై, ఉద్యోగులపై ఒత్తిళ్లు పెరిగితే సీమాంధ్రులు ఉద్యోగులు విడిచి ఆంధ్రకు మరలవచ్చు. గతంలో బెంగాలీలకు యిలా జరిగింది.
23 జిల్లాల రాజధానిగా హైదరాబాదు పొటెన్షియల్‌ను లెక్కలోకి తీసుకుని పెట్టిన బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు నేడు హైదరాబాదు 10 జిల్లాలకు మాత్రమే రాజధాని కావడంతో వయబిలిటీ సమస్య వస్తుంది. దాంతో అవి విస్తరణ ఆపవచ్చు, కొన్ని యూనిట్స్ మూసివేయవచ్చు, యితర రాష్ట్రాలకు తరలించవచ్చు. ఆ విధంగా ఉద్యోగాలు పోగొట్టుకునే వారిలో సీమాంధ్రులు గణనీయంగానే వుండవచ్చు. వారు సీమాంధ్రకు వచ్చి పడి అప్పటికే అక్కడ ఉద్యోగార్థులుగా వున్నవారికి తోడు కావచ్చు. ఇన్నాళ్లూ చదువు పూర్తి కాగానే హైదరాబాదు రైలెక్కేవారు. ఇకపై ద్వారాలు మూసుకుపోయాయని తెలిసి హతాశులయ్యారు. వారూ, వీరూ కలిసి ఏ మార్గం పడతారో వూహించండి. ఉపాధి అవకాశాలు లేకపోవచ్చు కానీ ఆకలి లేకుండా పోదు కదా, అది వారిని అడ్డదారులు పట్టిస్తుంది. హింసాయుత మార్గంలో కడుపు నింపుకోవడానికి పురికొల్పుతుంది. విభజన వలన జరిగే అతి పెద్ద నష్టం – యీ సామాజిక అశాంతే! ఇది ఆంధ్రసీమతో ఆగదు, పక్కరాష్ట్రాలకు – ముఖ్యంగా తెలంగాణకు – పాకుతుంది.
దీన్ని నివారించాలంటే లేబర్ యిన్టెన్సివ్ పరిశ్రమలు, సంస్థలు కావాలి. వైజాగ్‌లో ఓ బుల్లి ఐటిఐఆర్ శాంక్షన్ చేశాం అంటే కుదరదు. కంప్యూటర్ల వలన ఉద్యోగాలు రావు, పోతాయి. పైగా ఐటీ కంపెనీలు ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు ఆరిపోతాయో ఎవరికీ తెలియదు. ఐబిఎమ్ ఇటీవలే 50 వేల మంది ఉద్యోగాలు పీకేసిందట. ఇంకో 50 వేల మంది లిస్టు రాసి పెట్టుకుందట. మనకు సేవా, ఉత్పాదక రంగాలలోనే మానవవనరులు అధికంగా అవసరపడతాయి. వాటిని పెంచాలి. రాజధాని ఎక్కడుంటే అక్కడే పెట్టకూడదు. ప్రగతిని అన్ని ప్రాంతాలకూ పంచాలి. హైదరాబాదు, హైటెక్ మోజులో పడి పట్టణాలను నిర్లక్ష్యం చేశారు, పల్లెలను పాడుబెట్టారు. ఆంధ్రసీమకు ప్రకృతి యిచ్చిన వరం సముద్రతీరం, సారవంతమైన భూమి. రాయలసీమలో అయితే ఖనిజాలు. ఎక్కడ ఏ పరిశ్రమ పెడితే మంచిదో చూసి, అక్కడ దాన్ని వెలిసేట్లు చూడాలి. పరిశ్రమ అనగానే ఘటోత్కచుడు శశిరేఖ మంచాన్ని ఎత్తుకుని వెళ్లి దింపినట్లు ఎక్కణ్నుంచో పట్టుకుని వచ్చి పెట్టలేం. అక్కడ రోడ్డు వుండాలి, విద్యుత్ సరఫరా వుండాలి, మౌలిక సదుపాయాలు వుండాలి, పనిచేసే వాళ్లకు విద్య వుండాలి, తర్ఫీదు యివ్వాలి.
అంటే ఎంతో పని వుందన్నమాట. ఈ పని ఎవరో రాజకీయనాయకుడు చేస్తాడనుకోవడం బుద్ధితక్కువ. వాళ్లు చేసేది ఫలానా చోట పరిశ్రమ పెట్టబోతున్నాం అని ప్రకటించడం, ఆ పరిసరాల్లో అనుచరుల చేత భూమి కొనిపించి రియల్ ఎస్టేటు వ్యాపారం చేయించడం! అస్పష్టంగా వున్న కేంద్రప్రభుత్వపు రాయితీలను మనకు అనువుగా ఎలా మలచుకోవాలో, దేని కోసం పోరాడాలో కూడా వాళ్లకు తెలియదు. ఎవరైనా పారిశ్రామిక వేత్త 'మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నాకు వచ్చే ప్రత్యేకలాభం ఏమిటి?' అని అడిగితే వీళ్లు తెల్లమొహం వేస్తారు. ఎందుకంటే టి-బిల్లులో ఏమీ లేదు. విడిగా చేసిన రాజకీయప్రకటనలను రాబోయే ప్రభుత్వం మన్నిస్తుందన్న గ్యారంటీ లేదు. తెలిసీతెలియక నాయకులు ఏదో చెపితే అది నమ్మి పెట్టుబడి పెట్టబోయిన పారిశ్రామికవేత్త, తర్వాత వెనక్కి మరలితే అది మరింత అశాంతికి దారి తీస్తుంది. ఇటువంటి నాయకులను నమ్ముకుంటే ఆంధ్రది అధోగతే. మరి ఏం చేయాలి?
ఆంధ్రసీమకు యిప్పుడు కావలసినది విశ్వకర్మలు. ధృతరాష్ట్రుడు పాండవుల శక్తి తెలిసినవాడు. హస్తినాపురంలో వుంటే కౌరవులతో పోటీ పడి పేరు తెచ్చుకుంటారని భయపడ్డాడు. అందుకే దుర్యోధనుడు లక్కయింటిలో వాళ్లను చంపిస్తానని అన్నపుడు ఆమోదించాడు. తీరా చూస్తే వాళ్లు బతికి బట్టకట్టారు. కొంతకాలం మారువేషంలో ముష్టెత్తుకుని బతికినా చివరకు ద్రౌపదీ స్వయంవరంలో బయటపడి, తమ పరాక్రమం చూపారు. వాళ్లు బతికున్నారని వెల్లడి కావడంతో ఆహ్వానించక తప్పలేదు ధృతరాష్ట్రుడికి. హస్తినకు రప్పించాడు. అక్కడ వుంచితే కౌరవులను డామినేట్ చేస్తారన్న భయం. అందుకే అర్ధరాజ్యం యిస్తున్నా వెళ్లి ఏలుకోండి అని ఖాండవప్రస్థానికి తోలేశాడు. అది ఒకప్పుడు పౌరవుల రాజధాని. బుధపుత్రుని కారణంగా ఋషులు నాశనం చేశారు. అలాటిదానికి 'నువ్వు యువరాజువు, ఎంజాయ్' అని చెప్పి పంపాడు. అది భయంకర వనం. ఏ సౌకర్యాలు లేవు. పాలించడం మాట అలా వుంచి అసలు నివసించడమే కష్టం. అప్పుడు పాండవులకు మార్గదర్శిగా వున్న కృష్ణుడు ఇంద్రుణ్ని మనసులో తలచుకున్నాడు. అది గుర్తించిన ఇంద్రుడు దేవశిల్పి ఐన విశ్వకర్మను పిలిచి ఖాండవప్రస్థంలో మహా నగరం నిర్మించమని ఆదేశించాడు. ఇంద్రుడి చేసిన ఉపకారానికి సంతోషించిన కృష్ణుడు ఆ కొత్తనగరానికి యింద్రుడి పేర ఇంద్రప్రస్థమని పేరు పెట్టాడు. అది ఎంతబాగా వృద్ధి చెందిందంటే దాన్ని చూసి దుర్యోధనుడు కుళ్లుకున్నాడు. ద్యూతక్రీడకు ధర్మరాజును పిలిచి దాన్ని అపహరించేదాకా నిద్రపోలేదు.
ఆనాటి ఇంద్రప్రస్థాన్ని బ్రహ్మాండంగా వృద్ధి చెందేలా రూపొందించినవాడు విశ్వకర్మ. ఆంధ్రసీమ వృద్ధి చెందాలంటే అటువంటి విశ్వకర్మలు కావాలి. సాంకేతిక నిపుణులు, ప్రభుత్వపాలనా వ్యవహారాలు తెలిసిన అనుభవజ్ఞులు ఒక సలహాసమితిగా ఏర్పడి పాలకులకు, పారిశ్రామికవేత్తలకు, సామాజిక కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. సామాజిక కార్యకర్తల మాట ఎందుకు చెప్పానంటే నేడు సీమాంధ్ర యువతకు కావలసినది కష్టాలు ఎదుర్కోగలమన్న ధైర్యం. వారికి సరైన కౌన్సిలింగ్ చేసి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడవచ్చు. అన్యాయమార్గాలను వెతకవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో జవహర్లాల్ నెహ్రూకు యిటువంటి సలహాదారులు వుండటం చేతనే మనకు ఐఐటిలు వచ్చాయి, అణువిజ్ఞాన సంస్థలు వచ్చాయి. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించాం. ఎన్టీయార్ వచ్చినపుడు కూడా ఆయనకు నార్ల తాతారావు, కాకర్ల సుబ్బారావు వంటి ఎందరో మహానుభావులు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి యిచ్చారు, అమలు చేసి చూపారు. తెలంగాణ పునర్నిర్మాణం పట్ల పట్టుదలగా వున్న తెరాస యిప్పటికే రమణాచారి వంటి మాజీ ఐయేయస్ అధికారులతో ఒక సలహాసమితి ఏర్పాటు చేసిందని పేపర్లో వచ్చింది. సీమాంధ్ర పార్టీలేవీ అటువంటి పనుల్లో వున్నట్టు తెలియదు. మాకు కాంట్రాక్టు యివ్వండి, మేం కట్టేస్తాం, సింగపూర్ తెచ్చేస్తాం అనే ప్రకటనలే తప్ప చేస్తున్నది ఏమీ లేదు. వీళ్లంతా వినైల్ ఫ్లెక్సీ వీరులే!
వీరిలో అగ్రస్థానం చంద్రబాబుది. ఆయన దాదాపు పదేళ్లపాటు పాలించారు. హైదరాబాదు, పరిసరాలలోనే సమస్తం పట్టుకొచ్చి పెట్టారు. తక్కిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. కాబట్టే 2004లో అక్కడ ఓడిపోయారు. అక్కడే కాదు, హైదరాబాదులోనూ ఓడిపోయారు. ముఖ్యమైన వ్యవసాయరంగాన్ని పాడుపెట్టారు. కోస్తా ప్రాంతమంతా వ్యవసాయంపై ఆధారపడినదే. ఆగ్రో యిండస్ట్రీస్ పెట్టి వుంటే పల్లెలు పాడుపడేవి కాదు. తన ప్లానింగ్‌లో పొరబాటు జరిగిందని యిప్పటికీ ఆయన ఒప్పుకోడు. తనకు రాష్ట్రం అప్పగిస్తే అన్నీ ఫ్రీగా యిస్తానని వాగ్దానాలు చేస్తారు. అన్ని సంక్షేమపథకాలు అమలు చేస్తూ ప్రగతి సాధించడం సాధ్యమా? ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక సింగపూరు చేస్తాను, శ్రీలంక చేస్తానంటే నమ్మడం ఎలా? బాబుకు అనుకూల మీడియా ఆయనను నవ్యాంధ్ర నిర్మాతగా ఆకాశానికి ఎత్తడం ఎలాగూ ఖాయం. అది ఓటర్లను ఆకర్షిస్తోందని గమనించాక తక్కినవాళ్లూ అదే పాట అందుకుంటారు. ఎవరి దగ్గరా ఏ బ్లూప్రింటూ వుండదు. చివరకు ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు కదా, వాళ్లు నిజంగా ఏమైనా చేద్దానుకుంటే 'ఇదిగో యిదీ మార్గం' అని యీ సమితి దారి చూపిస్తే వాళ్లకు శతకోటి వందనాలు. తెలుగువాళ్లు విడిపోయినందుకు మనకు ఖేదపడుతోందని రోదిస్తూ కూర్చునేకంటే సత్తా వున్నవాళ్లు, ప్రతిభ వున్నవాళ్లు యిలాటి సమితి ఏర్పడేట్లా చేస్తే వాళ్లకు సహస్రకోటి వందనాలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)