అమెజాన్ ప్రయిమ్ పుణ్యమా అని లూసిఫర్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయిపోయింది. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్లు వున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను తెలుగులోకి తేవాలని హారిక హాసిన సంస్థ కూడా ముందుగా భావించింది. కానీ సినిమా చూసిన తరువాత తెలుగుకు అంతగా సరిపోతుందా? అని సందేహపడి ఆగిపోయింది.
ఎందుకంటే ఆ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ వుండదు. హ్యూమన్ ఎమోషన్లు, సీరియస్ ఫిక్చరైజేషన్ మాత్రమే వుంటుంది. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించడానికి స్కోప్ అయితే వుంది. కానీ మోహన్ లాల్ సినిమా మొత్తం సీరియస్ గా, సింగిల్ డ్రెస్ తో, స్ట్రయిట్ టుది నెరేషన్ అన్నట్లు వుంటాడు. అందుకే ఈ సినిమాను ఎవ్వరూ టచ్ చేయలేదు.
ఇప్పుడు మెగానిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా హక్కులు తీసుకున్నారు అన్న వార్తలు బయటకు వచ్చాక ఎవరికోసం అయి వుంటుంది? అన్న గ్యాసిప్ లు వినిపించచడం ప్రారంభమైంది. లూసిఫర్ సినిమా కాస్త పొలిటికల్ టచ్ తో వుంటుంది. పాటలు లేకున్నా ఫైట్లకు బోలెడు చాన్స్ వుంది. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన రామ్ చరణ్ కు వున్నట్లు బోగట్టా.
ఇటు మెగాస్టార్ కు అయినా, అటు పవర్ స్టార్ కు అయినా పనికి వస్తుందనే ఆలోచనతోనే లూసిఫర్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ టచ్ వుండడం, సీరియస్ క్యారెక్టర్ కావడంతో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా బాగుంటుందనే ఆలోచన వుందని బోగట్టా.
అదే మెగాస్టార్ కు అయితే మళ్లీ పాటలు, కమర్షియల్ అంశాలు చొప్పించాల్సి వుంటుంది. అమెజాన్ ప్రయిమ్ లో సినిమాను చూసినవారు ఇలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రమాదం వుంది. అదే పవన్ కు అయితే పాటలు లేకుండా మాంచి ఎమోషనల్ ఫిల్మ్ గా చేసి, పొలిటికల్ డైలాగులు జోడించి, క్లిక్ చేసుకునే అవకాశం వుంటుంది. ఏమైనా మొత్తంమీద లూసిఫర్ తెలుగులోకి రాబోతోంది.