పవన్ కు అంత ధైర్యం వుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ఫిక్స్ అయిపోయింది. గట్టిగా పది వేల మంది కూడా అవసరం లేకుండానే నిండిపోయే మైదానం ఒకటి ఎంపికైపోయింది. సరే. ఇంతకీ ఈ సమావేశం దేని కోసం?…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ఫిక్స్ అయిపోయింది. గట్టిగా పది వేల మంది కూడా అవసరం లేకుండానే నిండిపోయే మైదానం ఒకటి ఎంపికైపోయింది. సరే. ఇంతకీ ఈ సమావేశం దేని కోసం? పవన్ ఏం చెబుతారు? ఈ సంగతి పై ప్రస్తుతానికి పవన్ కే ఓ క్లారిటీ లేదని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన తిరుపతి దైవ సన్నిధానంలోని అతిథి గృహంలోనే తన అభిమానులతోనూ, జనసేన జనాలతోనూ కూర్చుని రాజకీయ మంతనాలు చేస్తున్నారు. జగన్ కాదు కదా, దైవ సన్నిధానంలోని అతిధి గృహంలో కూర్చుని రాజకీయాలు డిస్కస్ చేస్తే మన మీడియా పట్టి పీకడానికి. అయినా ఇది వేరే సంగతి.

ఇంతకీ పవన్ ఈ మీటింగ్ లో ఏం చెబుతారు? అభిమాని హత్య విషయం అయితే కాదని పక్కాగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ హత్య వెనుక వేరే కోణాలు కూడా వున్నట్లు ఇప్పుడిప్పుడే వార్తలు వినిపిస్తున్నాయి. కాపుల రిజర్వేషన్, బిసి రిజర్వేషన్ వంటి అంశాలపై పవన్ మాట్లాడరు. మిగిలిన ఏకైక అంశం ఒక్కటే ప్రత్యేక హోదా. ఈ హోదా గురించి రెండు విధాలుగా పవన్ మాట్లాడాల్సి వుంటుంది.

ఒకటి బాబుగారిని నొప్పించకుండా. రెండవది బాబుకు, మోడీకి కూడా ఝలక్ ఇచ్చేలా? ఈ రెండవ విధంగా మాట్లాడేంత ధైర్యం ఇప్పటికిప్పుడు పవన్ చేస్తారా అన్నది గట్టి అనుమానం. పవన్ కు తెలిసిన విషయమే అయి వుంటుంది. అదేమిటంటే, బాబును వ్యతిరేకించనంత వరకే మన మీడియాలో పవన్ కు దక్కే గౌరవం. ఒకసారి కనుక తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబుకో ఎదురుగా నిల్చోవడం ప్రారంభిస్తే, అప్పుడు తెలుస్తుంది మన మీడియా అసలు స్వరూపం. అందువల్ల పవన్ మళ్లీ మరోసారి ఎప్పటి మాదిరిగానే జనాలకు అర్థమయ్యీ, అర్థం కానట్లు, గోడమీద ఒంటికాలి చిటికెన వేలు ఆధారంగా నిల్చుని ఊగిసలాడుతున్నట్లు, ముందు తిట్టి, తరువాత పొగడి, ఇలా తనకు అలవాటైన స్పీచ్ నే మళ్లీ ఇస్తారనేదే అనుమానంగా వుంది.

కానీ ఇలా మళ్లీ మరోసారి పవన్ ఇలాగే మాట్లాడితే, ఇప్పటికే చాలా  వరకు ప్రజల్లో పవన్ ప్రసంగాల ప్రభావం తగ్గిపోయింది. నమ్మకం చాలా వరకు సడలిపోయింది. దీంతో పూర్తిగా పడిపోతుంది. అది పవన్ కు తెలియకుండా వుండదు. ఆయన నిజంగా 2019 లో ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటే మాత్రం, తెగించి గోదాలో దిగక తప్పదు. మీడియాతోనైనా, తెలుగుదేశం తోనైనా ఢీకొనక తప్పదు. కానీ పవన్ ఆ ధైర్యం చేస్తారా చేయరా అన్నదే అనుమానం. ధైర్యం చేస్తే, ప్రజల్లో కొంతయినా పవన్ పై నమ్మకం వుంటుంది. లేదూ ఎప్పటి మాదిరి స్పీచ్ ఇచ్చేసి, చక్కాపోతే, మరోసారి మరింత పలుచన కావడం మినహా ఫలితం ఏమీ వుండదు.