సర్వేలు తేల్చినోడే ‘కాషాయం’ సారథి…!

ప్రతి రంగంలో కొత్త ట్రెండ్స్‌, ప్యూహాలు పుట్టకొస్తున్నట్లే రాజకీయాల్లోనూ జరుగుతోంది. ఒక వ్యూహం కారణంగా విజయం సాధించినప్పుడు అదొక సెంటిమెంటుగా, సక్సెస్‌ మంత్రంగా మారుతుంది. అది పాతబడేదాకా దాన్నే అనుసరిస్తుంటారు. ఈమధ్య రాజకీయాల్లో ఎక్కువగా…

ప్రతి రంగంలో కొత్త ట్రెండ్స్‌, ప్యూహాలు పుట్టకొస్తున్నట్లే రాజకీయాల్లోనూ జరుగుతోంది. ఒక వ్యూహం కారణంగా విజయం సాధించినప్పుడు అదొక సెంటిమెంటుగా, సక్సెస్‌ మంత్రంగా మారుతుంది. అది పాతబడేదాకా దాన్నే అనుసరిస్తుంటారు. ఈమధ్య రాజకీయాల్లో ఎక్కువగా కనబడుతున్న వ్యూహం ప్రధానంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో 'ముఖ్యమంత్రి అభ్యర్థి'ని ముందుగా ప్రకటించడం. ఈ వ్యూహం ప్రాంతీయ పార్టీలు అనుసరించవు. ఆ పార్టీల్లో పార్టీ అధినేతే ముఖ్యమంత్రి అభ్యర్థి. మరొకరికి అవకాశముండదు.

 ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించే వ్యూహాన్ని జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బీజేపీ అనుసరిస్తున్నాయి. ఈ వ్యూహం అసోంలో బీజేపీకి అధికారం తెచ్చిపెట్టింది. ఓ కేంద్ర మంత్రిని ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, దానికి తగినట్లు అతనికి కూడా మంచి చరిత్ర ఉండటంతో ప్రజలు కాషాయం పార్టీకి విజయం కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అమలు చేయబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న యూపీలో విజయ పతాకం ఎగరేయాలని అన్ని పార్టీలు చాలా ముందుగానే కసరత్తు చేస్తున్నాయి. 

ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఖరారైపోయారు. ఒక్క బీజేపీయే మిగిలిపోయింది. అధికార పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రస్తుత సీఎం అఖిలేష్‌ యాదవే. బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం మాయావతే. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం లేని కాంగ్రెసు పార్టీ ఢిల్లీ మాజీ సీఎం, యూపీ కోడలైన షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి తెచ్చింది. ఈ పని జరిగి కూడా చాలా కాలమైంది. ఆ పార్టీ ప్రచారం కూడా మొదలైంది. 

సీఎం అభ్యర్థి ప్రకటన విషయంలో బీజేపీయే వెనకబడింది. ఇందుకు ప్రధాన కారణం…అతి జాగ్రత్త.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే చోదక శక్తిగా ఉపయోగపడుతుంది. అందుకే పరాజయం సంభవించకూడదనే ఉద్దేశంతో బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల పట్ల బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా సీరియస్‌గా ఉంది. ఈ రెండూ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీయే నిర్ణయించాలనుకుంటే ఇంతకాలం పట్టదు. కాని అలా చేయాలనుకోలేదు. సర్వేల ద్వారా పార్టీ కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలు సేకరించి అభ్యర్థిని నిర్ణయించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్లాన్‌ చేశాయి. 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండూ సర్వేలు చేయాలని, రెండు సర్వేలను విశ్లేషించి, మదింపు చేసి అభ్యర్థిని నిర్ణయించాలని డిసైడయ్యాయి. రాబోయే కొన్ని వారాల్లో ఈ సర్వేలు జరుగుతాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోయే అదృష్టవంతుడెవరో చూడాలి. పాలక పార్టీ ఎస్‌పీకి యాదవుల ప్లస్‌ ముస్లింల మద్దతుంది. బీఎస్పీకి ప్రధాన మద్దతుదారులు దళితులు, కాంగ్రెసు ప్రధానంగా బ్రాహ్మణుల మీద ఆశలు పెట్టుకుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తే దాని మద్దతుదారులెవరో స్పష్టమవుతుంది. ఉన్నత వర్గాలు ప్లస్‌ అట్టడుగు సామాజిక వర్గాల మద్దతు పొందేవిధంగా తమ అభ్యర్థి ఉండాలని బీజేపీ భావిస్తోంది. 

2014 పార్లమెంటు ఎన్నికల్లో దళితులు, ఇతర వెనకబడిన సామాజికవర్గాలవారు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే గత రెండున్నరేళ్ల మోదీ పాలనలో దళితులపై అనేక దాడులు జరగడంతో పరిస్థితిలో తేడా వచ్చింది. ఆమధ్య అసోం మినహా మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో చేదు అనుభవాలే మిగలడంతో కాషాయ దళం ఆందోళన చెందుతోంది. ప్రధాని మోదీ డాక్టర్‌ అంబేద్కర్‌ను ఎంతగనం ఆకాశానికెత్తుతున్నా గత ఎన్నికల్లో లభించిన మద్దతు ఇప్పుడు లభిస్తుందా? అనేది అనుమానమే. యూపీ జనాభాలో దళితులు 21 శాతం ఉన్నారు. ఇంత కీలకమైన వారి ఓట్లను రాబట్టుకోకుంటే పరాజయం తప్పదు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.