పవన్ కు కత్తిమీద సామే

జనంలోకి రావడం వేరు. జనం ముందు మాట్లాడడం వేరు. ఆలోచనలు వుండడం వేరు. నిర్ణయాలు ప్రకటించడం వేరు. ఈ విషయంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ మైనస్ మార్కులే. ఆయన పాటలే కాదు,…

జనంలోకి రావడం వేరు. జనం ముందు మాట్లాడడం వేరు. ఆలోచనలు వుండడం వేరు. నిర్ణయాలు ప్రకటించడం వేరు. ఈ విషయంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ మైనస్ మార్కులే. ఆయన పాటలే కాదు, ఆయన మాటలు కూడా అర్థంకావు అనే టైపు. పవన్ కళ్యాణ్ మాటలు విని ఫ్యాన్స్ కిందామీదా అయిపోవచ్చు కానీ, కాస్త రాజకీయ పరిజ్ఞానం వున్నవాళ్లు, లేదా కాస్తయినా రాజకీయాల మీద, సమస్యలు మీద, వర్తమాన వ్యవహారాల మీద పరిజ్ఞానం వున్నవారు, ఇతగాడు ఏం మాట్లాడుతున్నాడబ్బా? అని కిందా మీదా అవుతారు.

తనకు ఫలానా ఆయనంటే ఇష్టమే అంటాడు, కానీ ఆ మాటకు మళ్లీ ఇంకో లింకేదో పెడతాడు. అంతలో అక్కడి నుంచి జంప్ చేసి ఇంకో మాట అందుకుంటాడు. అది పూర్తి చేయకుండానే, చిన్న గెంతువేసి ఇంకో విషయం మాట్లాడతాడు. ఇలా వుంటుంది పవన్ ప్రసంగ శైలి, ఇప్పుడు తను తెలంగాణ, ఆంధ్ర నిరంతర పర్యటన ప్రారంభించబోతున్నారు. మరి ఇప్పుడెలా వుంటుంది?

ఏమీ మారదు. పవన్ ప్రసంగ శైలి ఏదైనా మారిపోతుందని, నేరుగా కేసిఆర్ మీదనో, చంద్రబాబు మీదనో ఘాటు విమర్శలు చేస్తారనో అనుకుంటే అపోహే. ఆయన ఇప్పుడు కూడా కర్ర విరగదు.. పాము చావదు టైపులోనే మాట్లాడతారు. అందులో సందేహం లేదు. మళ్లీ షరా మామూలుగానే ఎంపీలను, తిడతారు. వాళ్లేం చేయడం లేదంటారు. లోకేష్, కేటీఆర్ ల గురించి ప్రస్తావించకుండానే జగన్ కు అనుభవం లేదు, వారసత్వం కోరుకోకూడదు అంటారు.

సమస్య అది కాదు

అయితే పవన్ తన జనసేన పార్టీ అభిప్రాయాలు వెల్లడించడం గురించో, ఆయన ప్రసంగ చాకచక్యమో సమస్య కాదు. జనాలు రావడం గురించి అసలే సమస్య కాదు. ఇవ్వాళ, రేపు జబర్దస్త్ ఏక్టర్ బయటకు వచ్చినా జనం కమ్మేస్తారు. సినిమా పిచ్చి అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో. అందుకే సినిమా జనాలను ఇట్టే గెలిపించేస్తారు. కానీ అయిదేళ్లలో వాళ్ల పస తెలిసిపోయి, దింపి పక్కన పెడతారు.

పవన్ తెలంగాణ పర్యటన ప్రకటించిన తరువాత నిన్నటికి నిన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తొలి విమర్శ చేసారు. అర్థవంతమైన పాయింట్లు వున్నాయి. ఆంధ్రజనాల సంగతి పక్కన పెడితే, తెలంగాణ జనాలు ఆలోచించే పాయింట్లు లేవనెత్తారు. తెలంగాణకు చెందిన లీడర్లు ఎవరైనా జనంలోకి వస్తుంటే, అరెస్టు చేసి, ఏదో వంకతో లోపలే వుంచుతున్నారు.

పవన్ ను ఎలా అనుమతించబోతున్నారు? ఇది తొలి సూటి ప్రశ్న. ప్రభాకర్ విమర్శను మీడియా తెలివిగా దాచేయచ్చు. లేదా లొపలి పేజీల్లోకి తొసేయచ్చు. కానీ తెలంగాణ జనం ఆలోచించకుండా చేయలేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరామ్ ను కట్టడి చేసి, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన పవన్ ను ఎలా అనుమతిస్తారు? ఇలా పాయింట్ టు పాయింట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు జనంలోకి వెళ్లకుండా వుండవు.

ఇదంతా పవన్ ఇంకా నోరు విప్పక ముందు. ఇప్పుడు నోరు విప్పి అమ్మకు చిక్కిన మేక లాంటి కాంగ్రెస్ నో, తెరాసతో అంతంత మాత్రంగా వున్న భాజపానో గట్టిగా నాలుగు మాటలు అనొచ్చు. కానీ తెలంగాణ భాజపా నేతలు ఊరుకోరు. ఆంధ్ర భాజపా నేతల్లా తెలుగుదేశంలో బలమైన లోపాయికారీ వ్యవహారాలు వున్న టైపు కాదు. 

అందువల్ల పవన్ మీద గట్టిగానే విమర్శల జడివాన కురిసే అవకాశం వుంది. అంతేకాదు, కత్తి మహేష్ బహిరంగంగా అడిగిన అనేకానేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాజీపడిపోయి, చానెళ్లలో అతగాడికి నీ ఫ్యాన్స్ చేతనే సన్మానాలు చేయించారు. మాకు చెప్పొచ్చావా? అని అడిగినా అడగొచ్చు. కడిగినా కడగొచ్చు.  రాజకీయాల ప్రసంగం అంటే అజ్ఞాతవాసి లాంటి సినిమా కాదు అని సెటైర్లు వేసినా వేయచ్చు.

ఖర్చు ఎవరిది?

నిరంతర పర్యటన అంటే చిన్న విషయం కాదు. జగన్ యాత్రకు రోజుకు పది నుంచి ఇరవై లక్షలు ఖర్చవుతొందని అనధికార వార్తల అంచనా. మరి అది జగన్ ఏ మేరకు భరిస్తున్నారు. పార్టీ నాయకులు ఏ మేరకు భరిస్తున్నారు అన్నది తెలియదు. కానీ పవన్ ఖర్చు ఎవరు భరిస్తారు? జనసేన టికెట్ కోసం చాలామంది ఆశతో, ఆసక్తితో వుండి వుండొచ్చు. ప్రజారాజ్యం టైమ్ లో ఇలాగే జరిగింది.

ఎవ్వరూ అడగకుండానే బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఏర్పాట్లు, హడావుడి ఇలాంటివి అన్నీ ముందుకు వచ్చి చేసారు. కానీ తీరా టికెట్ లు ఇవ్వకపోయేసరికి, అమ్ముకున్నారు, మోసం చేసారు లాంటి విమర్శల జడివాన కురిసింది. మరి ఈసారి పవన్ వాటిని దృష్టిలో పెట్టుకుని ఎలా కట్టడి చేస్తారు? అన్నది చూడాలి. లేదా అంతఖర్చు ఆయనే భరిస్తారా? అది మాత్రమే అనుమానమే?

ఇకనైనా కమిటీలు?

ఇప్పటికి అయితే పవన్ ప్రకటించిన కార్యక్రమాలు కేవలం కార్యకర్తల సమావేశాలు మాత్రమే. బహిరంగ సభలు లేవు. బహిరంగ సభలు అంటే అనుమతులు ఇతరత్రా వ్యవహారాల తలకాయనొప్పి వుంటుంది. ఇప్పటి వరకు జనసేన కార్యక్రమాలన్నీ చాపకింద నీరులా సాగుతూ వస్తున్నాయి. పైకి పార్టీ బాధ్యులు అంటూ ఎవరూ లేకపోయినా, ప్రతిచొటా కాంటాక్ట్ పర్సన్ లు వుంటూనే వస్తున్నారు.

వాళ్లే జనసేన పార్టీ నుంచి వచ్చిన సూచనల మేరకు పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమావేశాలు కూడా వాళ్లే ఏర్పాటు చేస్తారు. మరి ఇకనైనా కార్యవర్గ నిర్మాణం అంటూ వుంటుందా? వుండదా? వుంటే మాత్రం మళ్లీ సమస్యే. చోటు దక్కని వారు విమర్శలు స్టార్ట్ చేస్తారు. ఇన్నాళ్లు పైకి చెప్పకుండా లోలోపల ఎలా వాడుకున్నారో ఏకరవు పెడతారు. దానివల్ల తాము అంత నష్టపోయాం, ఇంత నష్టపోయాం అంటూ గళం విప్పుతారు. అప్పుడు వస్తాయి అసలు సమస్యలు.

ఓటు బ్యాంక్ చీలుస్తారా?

పవన్ తన స్పీచ్ ల ద్వారా అధికారంలో వున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో దోస్తానాతోనే వుంటారా? వుండరా? అన్నది తెలియాలి. దోస్తానా వుంటే ఆయన ప్రసంగాలు చప్పగానే సాగుతాయి. భాజపా మీద మాత్రమే ఒంటికాలితో లేస్తే వ్యవహారం వేరుగా వుంటుంది.

కేవలం ప్రభుత్య ఓటు బ్యాంక్ చీల్చడం కోసమే పవన్ ను వాడుకుంటున్నారని, ఫ్యాకేజ్ లు అని ఇలా రకరకాల మాటలు వినిపిస్తాయి. ఆ అపప్రధ తప్పించుకోవాలి అంటే పవన్ కాస్త నిర్మొహమాటంగా ముందుకు వెళ్లాల్సి వుంటుంది. కానీ ఇది కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే టైపు సర్కస్ ఫీట్. దీనిని చేయడం అన్నది పవన్ కు సాధ్యమవుతుందా? అన్నది చూడాలి.

ఇంతకీ జనాలకు ఇప్పటికీ తీరని అనుమానం ఏమిటంటే, పవన్ వరుస ఫరాజయాలతో ఇక సినిమాల్లో ఎంతకాలం ఈ గజనీ దండయాత్రలు అని, తగ్గిపోతున్న చరిష్మాను పెంచుకోవడానికి జనాల్లోకి వస్తున్నారా? నిజంగా సీరియస్ పాలిటిక్స్ చేస్తరా? అన్నది. ఇవ్వాళ రేపు ఆయన చేసే ప్రసంగాలతో ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుందేమో?

-ఆర్వీ