పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్.. ఒకప్పుడు సహజీవనం చేశారు.. ఆ తర్వాత అధికారికంగా పెళ్ళి చేసుకున్నారు.. కొన్నాళ్ళ తర్వాత అధికారికంగా విడిపోయారు. అసలెందుకు విడిపోయారు.? అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అసలు పవన్, రేణుదేశాయ్ సహజీవనం చేస్తున్నారన్నదే ఒకప్పుడు గాసిప్.. ఆ తర్వాత అది కన్‌ఫర్మ్ అయ్యింది. పెళ్ళి విషయం మాత్రం, రాజకీయ ఒత్తిళ్ళకు లోబడి జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక, రాజకీయ విమర్శలు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకోసమే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ఏదిఏమైనా పెళ్ళి, విడిపోవడం అనేవి జరిగాయి. రేణు, పవన్ ఇద్దరు అఖీరా, ఆద్యకు తల్లిదండ్రులయ్యారు. కొన్ని కారణాలతో విడిపోయినా, ఆ కారణాలేంటనేవి చెప్పేందుకు అటు పవన్, ఇటు రేణు.. ఎప్పుడూ సుముఖత వ్యక్తం చేయలేదు. ‘మనసు విప్పి మాట్లాడతా.. పర్సనల్ ఇంటర్వ్యూ..’ అని రేణుదేశాయ్ ఊరించింది. నేడు రేణు పుట్టినరోజు.
కానీ, సస్పెన్స్ షరా మామూలే. ‘మేమిద్దరం ఎందుకు విడిపోయామనేది మా ఇద్దరికే తెలుసు..’ అని రేణుదేశాయ్ సెలవిచ్చింది. అయితే, విడిపోయే సమయంలో 40 కోట్లు పవన్ నుంచి తీసుకున్నానన్న ఆరోపణల్ని మాత్రం ఆమె ఖండించింది. పవన్‌ని ఇప్పటికీ, ఎప్పటికీ అభిమానిస్తుంటాననీ.. జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుందనీ.. అది పవన్ విషయంలోనే తనకు జరిగిందని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.
‘ఇద్దరం గొడవపడి విడిపోలేదు.. ఫ్రెండ్లీగానే విడిపోయాం.. ఒకరి అభిప్రాయాలకు ఒకరం గౌరవం ఇచ్చుకున్నాం..’ అని రేణు చెప్పినా, భార్యా భర్తలు విడిపోవడం వెనుక పెద్ద కారణమే వుండి వుండాలి. అదేంటి? అన్నది వారిద్దరికే తెలియాలి. అది ఎప్పటికీ బయటకు రాదా.? అంటే ఏమో చెప్పలేం.