ఎన్నికలకు ముందు.. గబ్బర్ సింగ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించి ఆసక్తికరమైన రూమర్ వచ్చింది. ఆ స్టార్ హీరోకు అప్పులు ఉన్నాయని ఆ రూమర్ సారాంశం. మెయింటెయినెన్స్ కష్టం అయ్యిందని.. విడాకులు.. పరిహారాలు.. వంటి వ్యవహారాలతో పవన్ ఆర్థికంగా దెబ్బతిన్నాడని.. సినిమాలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పవన్ ఆర్థికంగా నష్టపోయాడని.. దీంతో అప్పులు చేసుకొని బండిలాగించాల్సి వచ్చిందని అప్పట్లో సినీ ఇండస్ట్రీలోనే చెవులు కొరుక్కొన్నారు. మరి పవన్ కు ఆనాడు ఎదురైన కష్టాలే ఇటీవలే ఒక దర్శకుడికి ఎదురయ్యాయట. పవన్ ను నమ్ముకోవడమే ఆయనకు ఆ కష్టాలు ఎదురవ్వడానికి కారణమని తెలుస్తోంది.
తన తొలి సినిమాతోనే హిట్ ను కొట్టన ఆ దర్శకుడికి మెగా ఫ్యామిలీ అండదండలు లభించాయి. ఆ అవకాశాన్ని కూడా అతడు సద్వినియోగం చేసుకోవడంతో.. అతడికి ఏకంగా పవన్ కల్యాణ్ ఆదరణ లభించింది. సినిమా ఖాయం అనుకున్నారు. అయితే ఆ దర్శకుడికి పవన్ ఎంతకూ అవకాశం ఇవ్వలేదు. తన షెడ్యూల్ ప్రకారం. .తనకు తోచినట్టుగా పవన్ ముందుకు వెళ్లాడు. దీంతో పవన్ నే నమ్ముకున్న ఆ దర్శకుడికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాను చేస్తానని.. అనకుండా.. చేయను అనకుండా.. పవన్ కాలం గడిపాడు. ఇదే సమయంలో ఆ దర్శకుడు నిర్మాతగా మారి ఒక చిన్న సినిమాను చేశాడు. అయితే అది కాస్తా నష్టాలను మిగిల్చింది. చేతులు కాలాయి. తొలి రెండు సినిమాల సక్సెస్ తో ఆర్థికంగా కలిగిన లాభం.. నిర్మాతగా చేసిన ప్రయత్నంతో నష్టంగా మారింది.
అప్పుడే ఆ దర్శకుడి కష్టాలు పైకి ఎగశాయని తెలుస్తోంది. ఎంతగా అంటే… తన ఆఫీసును మెయింటెయిన్ చేసుకోవడం కూడా కష్టమైంది. చేతిలో పవన్ కల్యాణ్ ఉన్నాడనే పేరే కానీ.. ఆయన సినిమా ఎప్పటికి తెరకెక్కుతుందో అర్థం కాని పరిస్థితి. తన ఘోస్ట్ లకు జీతాలు ఇచ్చుకోవడం.. పంజాగుట్ట ఏరియాలోని ఆఫీసును మెయింటెయిన్ చేసుకోవడం… చాలాకష్టమయ్యింది అతడికి. పవన్ చూస్తే ఎంతకూ క్లారిటీ ఇవ్వడు. ఇలాంటి నేపథ్యంలో ఇక పవన్ కోసం వేచి ఉండలేక.. ఆయనకు ఒక మాటచెప్పేసి తన దారి తనుచూసుకున్నాడు ఆ దర్శకుడు. తీరా విషయం తెలిసిన తర్వాత పవన్ కూడా మాట్లాడటానికి ఏమీ లేకపోయింది.
పవన్ కల్యాణ్ ను నమ్ముకొంటే నమ్ముకోవచ్చు.. ఆయన దేవుడయితే కావొచ్చు.. కానీ.. అంత మాత్రానికే కడుపు నిండదు కదా.. అనే తత్వం ఆ దర్శకుడికి అలా బోధపడింది. సినిమాలు చేస్తే తప్ప.. బతకడం కష్టం కాబట్టి.. ఆ దర్శకుడు సినమాలపై పడిపోయాడు. పవన్ తో సినిమా చేజారడం పెద్దగా బాధ కలిగించలేదని కూడా ఇప్పుడు తేల్చి చెబుతున్నాడు. అదీ జీవన సత్యం!