మెగా కాంపౌండ్ లో హిట్ అత్యవసరం అంటే అది ఒక్క వరుణ్ తేజ్ కు మాత్రమే. చివరికి అల్లు శిరీష్ కు కూడా సక్సెస్ ఉంది. లోఫర్ తో బాగా దెబ్బతిన్న వరుణ్ తేజ తిరిగి లైమ్ లైట్లోకి రావాలంటే మిస్టర్ మూవీ కచ్చితంగా హిట్ అవ్వాలి. అలాఅని అదేదో గ్రేట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాదు. ఆగడు, బ్రూస్ లీ లాంటి ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్ల తీసిన మూవీ. అందుకే ఈ మూవీని మెగా కాంపౌండ్ హీరోలంతా తమ భుజానికెత్తుకున్నారు. సినిమాను ఎలాగైనా సక్సెస్ చేసి, వరుణ్ తేజకు ఓ హిట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు.
మిస్టర్ సినిమాకు ప్రచారం కల్పించేందుకు చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు అంతా సిద్ధమౌతున్నారు. ఈనెల 6వ తేదీన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఆ వేడుకకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు, సినిమా ట్రయిలర్ లో కూడా చిరంజీవి క్లిప్పింగ్స్ వాడుకునే ప్లాన్ ఉందట. రామ్ చరణ్ కూడా మిస్టర్ సినిమాకు ప్రమోషన్ ఇస్తాడట. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైనా కాకున్నా.. సినిమాకు తనవంతుగా ప్రచారం చేసిపెట్టాలని ఫిక్స్ అయ్యాడట.
వీళ్లతోపాటు పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగితే మిస్టర్ సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం నాగబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా మిస్టర్ సినిమా ప్రమోషన్ కు పవన్ ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు నాగబాబు. తాజా సమాచారం ప్రకారం.. సినిమాకు సంబంధించి వరుణ్ తేజ, పవన్ కల్యాణ్ తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఎంటైర్ ప్రమోషన్ కు బన్నీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.