పేరు సినిమా.. వ్యవహారం రాజకీయం

ఎఫ్ ఎన్ సి సి. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్..విన్నవారు ఎవరైనా అబ్బో..సినిమా వాళ్ల క్లబ్ అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేసినట్లు? ఎందుకంటే అది ఫిల్మ్ నగర్ లో ఏర్పాటైన కల్చరల్ క్లబ్. అందుకే…

ఎఫ్ ఎన్ సి సి. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్..విన్నవారు ఎవరైనా అబ్బో..సినిమా వాళ్ల క్లబ్ అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేసినట్లు? ఎందుకంటే అది ఫిల్మ్ నగర్ లో ఏర్పాటైన కల్చరల్ క్లబ్. అందుకే ఆ పేరు. నేతి బీరకాయలో నెయ్యి చందం. అయితే ఫిల్మ్ నగర్ లో సినిమా జనాలు వున్నారు కాబట్టి సహజంగా వారు ఎక్కువగా సభ్యులుగా వుంటారు. వారితో పాటు రియల్ ఎస్టేట్ చేసేవాళ్లు, డబ్బు చేసిన వాళ్లు, రాజకీయ నాయకులు కూడా సభ్యులే. అంటే ఒక విధంగా జూబ్లీ క్లబ్, డెక్కన్ క్లబ్, సికిందరాబాద్, విశాఖ వాల్తేర్ క్లబ్ లాంటిదన్నమాట ఇది కూడా. 

నిన్నటికి నిన్ననే ఈ క్లబ్ లో తెరాస నాయకుడు, నిన్నటి కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ కు ఫ్రీ సభ్యత్వం ఇచ్చారు. సభ్యత్వం ఫ్రీ అంటే ఏమిటి? ఏడాదికి లక్షలు కట్టకనవసరం లేదన్నమాట. జనాలు ఏమనుకుంటారు, ఫిల్మ్ నగర్ కబ్ అంటే సినిమా వాళ్లే వుంటారేమో..సినిమా వాళ్ల కోసమే ఏమో?..అని. కానీ ఇందులో హరీష్ రావు, రేవంత్ రెడ్డి లాంటి పొలిటికల్ జనాలు కూడా సభ్యులే. డబ్బు వుంటే ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు.

15 ఎకరాల మతలబు

ఇప్పుడు ఈ క్లబ్ కే విశాఖలో 15 ఎకరాలు ఇచ్చేసి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి పునాదులు వేస్తున్నాం అని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఓ రిక్రియేషన్ క్లబ్..ఇంకా పామరుల భాషలో చెప్పాలనుకుంటే, ఓ పేకాట క్లబ్ ఏ విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందో తెలియాల్సి వుంది. ఈ క్లబ్ మీద ఇటీవల చాలా విమర్శలు వినవచ్చాయి. ఇటీవల ఎన్నికలు జరిగాయి..ఆ సందర్భంగా ఇప్పుడు అధికారం వరించిన వారి ప్రత్యర్తులు ఎన్నో విమర్శలు చేసారు. కె ఎల్ నారాయణ, కె ఎస్ రామారావు, సురేష్ బాబు లాంటి వాళ్ల గుప్పిట్లో ఎఫ్ ఎన్ సి సి ఇరుక్కుపోయిందని ఆరోపించారు. చిత్రంగా అదే కేఎల్ నారాయణ, సురేష్ బాబుల మల్టీ ఫ్లెక్స్ (విజయవాడ) ఓపెనింగ్ కు వెళ్లి ఆ వెంటనే, విశాఖలో 15 ఎకరాలు కేటాయించేసారు.  

ఒక కల్చరల్ క్లబ్ మల్టీ ఫ్లెక్స్ లు, కన్వేన్షన్ సెంటర్లు కట్టడం ఏమిటో? దానికి ప్రభుత్వం 15 ఎకరాలు ధారా దత్తం చేయడం ఏమిటో? దీంతో మొత్తం సినిమా పరిశ్రమే విశాఖలో అభివృధ్ధి చెందిపోతుందన్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఓ కల్చరల్ క్లబ్ వ్యాపారం ఎలా చేస్తుంది..ఆ క్లబ్ నియమావళి ఏమిటి? ఆ లాభ నష్టాల ఎవరి పరం అవుతాయి? ఇలాంటి సవాలక్ష సందేహాలు వుండనే వున్నాయి.

ఇక్కడ ఇంకో చిత్రం ఏమటంటే, ఆ 15 ఎకరాలు ఎక్కడివి? గతంలో వైఎస్ ముఖ్యమంత్రి గా వుండగా, విశాఖలో సినిమా పరిశ్రమ కోసం కోన్ని వందల ఎకరాలు మార్క్ చేసి వుంచారు. వాటిలోంచే 15 ఎకరాలు ఇప్పుడు ఎఫ్ఎన్ సి సి కి ఇచ్చారు. 

రాజకీయనాయకుల జోరు

ఎఫ్ఎన్ సి సిలో ఆంధ్ర నటులు వుంటే వుండొచ్చు కానీ, రాజకీయ నాయకులు ఎక్కువ తెలంగాణ వారే. పైగా లేటేస్ట్ గా డి .శ్రీనివాస్ కి సభ్యత్వం అందించారు. అదే కాస్త డబ్బుకట్టలేని తెలుగు సినీ నటులు ఎవరికైనా సభ్యత్వం అలా ఉచితంగా ఇచ్చారా? అంటే అబ్బే..ముక్కు పిండి లక్షలు వసూలు చేయడమే.నాగ్ లాంటి ఒకరిద్దిరికి మాత్రమే ఫ్రీ సభ్యత్వం వుంది. మరి సినిమా నటులకే లక్షలు ఇస్తే కానీ సభ్యత్వం ఇవ్వలేని ఎఫ్ ఎన్ సి సి, సినిమా పరిశ్రమ అభివృధ్ధికి ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు పలువురు సినిమా జనాలు. అదీ కాక, రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని, ఎక్కువగా పేకాటకు ఉపయోగపడే క్లబ్ కు 15 ఎకరాలు ఏమీ ఆలోచించకుండా బాబు ఇచ్చేయడమేమిటి అంటున్నారు? 

వడ్డించేవాడు మనవాడైతే,,ఏ క్లబ్ అయితే నేమిటి? అన్నీ అలా వచ్చేస్తాయి అంతే.