రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాయి భారీ వర్షాలు. వరుణుడు కాస్త శాంతించినప్పటికీ, చాలా జిల్లాలు ఇంకా నీటి ముంపులోనే వున్నాయి. ప్రధానంగా, కోస్తా జిల్లాలు వరదలతో చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోన్న వరద ముంపు బాధితుల నెత్తిన ‘పరామర్శల పిడుగు’ పడ్తోంది.
వివిధ రాజకీయ పార్టీలు వరద ముంపు బాధితుల వద్దకు వెళ్ళి వారిని ఓదార్చే పనిలో బిజీగా వున్నారు. నాయకులంటా ఊరకే రారు కదా, వరద బురదలోనూ ఓట్లు వెతుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడా రాజకీయమా.? అని వరద బాధితులు నాయకుల్ని నిలదీస్తున్నా, వారు మాత్రం తమ రాజకీయం చేసుకుంటూ పోతున్నారు.
మందీ మార్బలంతో నాయకులు వస్తోంటే, సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు చాటుమాటుగా వాపోవాల్సిన పరిస్థితి. ఎప్పుడు వరదలొచ్చినా ఇదే దుస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామనీ, నాయకులు రావడం, పరామర్శించడం, వెళ్ళడం తప్ప ఏ నాయకుడూ తమను ఆదుకోవడంలేదన్నది వరద బాధితుల ఆవేదన.
‘మా ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకుంటుంది..’ అని అధికార పార్టీ నేతలు చెబుతోంటే, ప్రభుత్వాల ముక్కు పిండి మరీ బాధితులకు న్యాయం చేస్తామని విపక్షాలు అంటాయి. ఇవన్నీ వరద రాజకీయాలే. వరదలు వెలిసిపోయాక, జనం కోలుకున్నాక.. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చరు.. పూడ్చేందుకు ఎవరూ ప్రయత్నించరు.
‘మీరేం చేస్తున్నారు.. అంటే మీ హయాంలో మీరేం చేశారు..’ అంటూ పాలక, ప్రతిపక్షాల మధ్య రగడ తప్ప, బాధితులకు సహాయం సరిగ్గా అందిన దాఖలాలు కన్పించడంలేదు. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఇతర విపక్షాలకు చెందిన నేతలూ.. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనల జోరు పెంచిన దరిమిలా, తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఈసారెలా కోలుకుంటుందో వేచి చూడాల్సిందే.