ఆర్థికంగా ఉజ్జ్వల భవిష్యత్తు వున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. గత దశాబ్దంగా ఎదుగుతూ వచ్చి అమెరికా ఖండంలో అమెరికా దేశంతో పాటు తనకూ సముచితమైన స్థానం సంపాదించుకుంది. ఈ అక్టోబరు నెలలో ఒబామా, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రూసెఫ్ సమావేశమై అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు పెట్టాలని అనుకున్నారు. 4 బిలియన్ డాలర్ల ఎఫ్-18 జెట్ ఫైటర్ విమానాలను అమెరికా నుండి బ్రెజిల్ కొనుగోలు చేయడం వాటిలో ఒకటి. అయితే యీ సమావేశం జరుగుతుందో లేదో అన్న సందేహం పుట్టుకుని వచ్చింది యిప్పుడు. ఎందుకంటే అమెరికన్ గూఢచారి సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (ఎన్‌ఎస్‌ఏ) బ్రెజిల్ అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు మధ్య జరిగే సంభాషణలపై నిఘా పెట్టి వింటోన్న విషయం బయటపడిరది. మెక్సికో కూడా అమెరికాకు శత్రుదేశం కాదు. వాళ్లిద్దరి మధ్య గాఢమైన వాణిజ్యబంధంతో బాటు, టెర్రరిజంపై రహస్యసమాచారాన్ని యిచ్చిపుచ్చుకునే అనుబంధం కూడా వుంది. మత్తుమందు వ్యాపారాన్ని కట్టడి చేయడానికి మెక్సికోకు అమెరికా సహాయపడుతోంది కూడా. మరి తమలాటి స్నేహదేశాధినేతల మధ్య సంభాషణ సైతం అమెరికా రహస్యంగా వింటోందని తెలియగానే మెక్సికో, బ్రెజిల్ భగ్గుమన్నాయి.
జులై నెలలో దీని గురించి తొలి వార్తలు వచ్చాయి. అమెరికా తన పొరుగున వున్న లాటిన్ అమెరికా ప్రభుత్వాధినేతల సంభాషణలను పదేళ్లగా వింటోందని, వారి ఈ మెయిళ్లలోకి తొంగిచూస్తోందని, ఆ విధంగా గూఢచర్యానికి గురైన వాటిలో అమెరికాతో స్నేహం నెరపుతున్న కొలంబియా కూడా వుందని తెలిసింది. ఆ తర్వాత సెప్టెంబరు మొదటివారంలో బ్రెజిల్‌లో ప్రచురించే ‘‘ఓ గ్లోబో’’ అనే పత్రికలో యీ విషయాన్ని బయటపెడుతూ వ్యాసం వచ్చింది. రచయితల్లో ఒకరు -‘‘గార్డియన్’’ పత్రికలో పనిచేసే గ్లెన్ గ్రీన్‌వార్డ్. ఎన్‌ఎస్‌ఏ అకృత్యాలను బయటపెట్టడంలో యితను విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు సహకరించాడు. ఈ వ్యాసం వెలువడగానే బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఆంటోనియో అమెరికా నుండి లిఖితపూర్వకమైన సంజాయిషీ కోరాడు. రోజులు గడిచేకొద్దీ ఇంకా కొన్ని వివరాలు బయటకు రావడంతో బ్రెజిల్ యంత్రాంగం వైట్ హౌస్‌కు తమ అభ్యంతరాలు తెలుపుతూ వారి నుండి క్షమాపణ కోరింది. అటు మెక్సికో అధ్యక్షుడు నియటో కూడా అమెరికాకు అభ్యంతరాలు తెలిపారు. జి-20 సమావేశంలో కలిసినపుడు ఒబామా వీరిద్దరితో విడివిడిగా మాట్లాడి సముదాయించబోయాడు. ఇదంతా టెర్రరిజంపై పోరాటంలో భాగంగానే చేస్తున్నామని అమెరికా చెప్పుకుంటోంది. కానీ బ్రెజిల్, మెక్సికోలలో టెర్రరిజమూ లేదు, రసాయనిక లేదా అణు ఆయుధాలూ లేవు.
అమెరికా టర్కీ, ఇండియా వంటి మిత్రదేశాలపై కూడా యిదే గూఢచర్యం నెరపుతూ యిదే సంజాయిషీ యిచ్చింది. ఆ రెండు దేశాలూ అమెరికా చెప్పినదాన్ని విశ్వసించి నోరెత్తటం లేదు. ఎన్‌ఎస్‌ఏ ఏ మేరకు చెలరేగిపోతోందో సెప్టెంబరులో ‘‘గార్డియన్’’, ‘‘ద న్యూయార్క్ టైమ్స్’’ వంటి పత్రికలు బయటపెట్టాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను రక్షించే ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ రహస్యాన్ని కూడా అది ఛేదించిందట!
– ఎమ్బీయస్ ప్రసాద్