చిన్న తప్పటడుగు, చిన్న మాట జారుడు, శ్రీరెడ్డిని డిఫెన్స్ లోకి తోసేసింది. దాదాపు ఒంటరిని చేసేసింది. నిన్నటి వరకు శ్రీరెడ్డి పక్కన వున్నవారంతా, ఇప్పుడు ఆమెకు ఎదురుగా నిల్చుంటున్నారు. నిన్నటి వరకు ఛానెళ్లలో నిప్పులు కక్కుతూనో, హుషారుగా నవ్వులు రువ్వుతూనే కూర్చున్న శ్రీరెడ్డి ఇప్పుడు నిలువునా నీరసంగా, బేల చూపులు చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది.
మొన్నటి దాకా శ్రీరెడ్డి గెటప్ లు ఏమిటన్నది అందరికీ తెలుసు. ఫేస్ బుక్ లో ఎలాంటి లైవ్ షో లు చేసేదన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు సడెన్ గా చీర కట్టుకుని, బుద్ధిగా ఒద్దికగా ఓ మంచి లుక్ లోకి మారిన వైనమూ తెలుసు. అయితే అన్నీ తెలిసినా, ఓ మంచి కాజ్ కోసం శ్రీ రెడ్డి ముందుకు వచ్చిందని, మా సంస్థ ఆమెను అన్యాయంగా బ్యాన్ చేసిందని చాలా మంది ఆమెకు దన్నుగా నిలిచారు. చానెళ్లు కూడా టీఆర్పీలు బాగున్నాయని ఈ సబ్జెక్ట్ ను మరింత ఎంకరేజ్ చేసాయి.
కానీ ఎప్పుడయితే శ్రీరెడ్డి స్టూడియోల నుంచి పబ్లిక్ ప్లేసెస్ కు వెళ్లడం, పబ్లిక్ స్పీచ్ లు ఇవ్వడం ప్రారభించిందో చానెళ్ల ఆసక్తి తగ్గింది. ఎందుకంటే వాటిని అన్ని చానెళ్లు ప్రసారం చేస్తాయి. చానెళ్లకు ఎక్స్ క్లూజివ్ డిస్కషన్లు, కంటెంట్ లు కావాలి. ఇలాంటి టైమ్ లో పవన్ పై శ్రీరెడ్డి మాట తూలడం అన్నది ఆమె చేసుకున్న స్వయంకృతాపరాధం. అది దారుణంగా రివర్స్ అయింది. అన్ని వైపుల నుంచి దానిమీద వ్యతిరేకత వ్యక్తం అయింది. మరో పక్క ఇదే అదను అని పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీరెడ్డిని ఇరుకున పెట్టాలంటే ఇవి చాలు.
మరోపక్క జీవిత రాజశేఖర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దానితో పాటు క్రిమినల్ కేసు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు బయటకు వద్దాం అనుకునే చోటా మోటా వాళ్ల కాళ్లకు బ్రేక్ వేస్తాయి. చానెళ్ల పట్ల కూడా కాస్త వ్యతిరేకత ప్రారంభమైంది. న్యూస్ చానెళ్లు పోర్నో చానెళ్ల మాదిరిగా తయారవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల చానెళ్లకు గౌరవప్రదమైన రెప్యూటేషన్ కు బదులు, చీప్ రెప్యూటేషన్ వచ్చే ప్రమాదం వుంది. అందుకే చానెళ్లు ఇప్పుడు బాబు గోగినేని లాంటి కాస్త మంచి పేరున్న వారిని తీసుకురావడానికి చూస్తున్నాయి. ఇలాంటి వాళ్ల దగ్గర శ్రీరెడ్డి కప్పదాట్లు కుదరవు.
ఇలా అన్ని విదాలా ఇక శ్రీరెడ్డి అధ్యాయానికి ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. ఇంకా మొండిగా సంచలనం కోరుకుంటే, ఆమె తన దగ్గరున్న సాక్ష్యాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం మినహా మరో మార్గం లేదు. కానీ ఇప్పటి వరకు ఆమె బయట పెట్టిన సాక్ష్యాలు ఏవీ పోలీసు విచారణకు, కోర్టుకు నిలబడేంత బలమైనవి కావు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆ మార్గంలో వెళ్లడం లేదు. ఇకపై వెళ్లడం కూడా కష్టమే. అందుకే చానెల్ సాక్షిగా నేను ఓడిపోయాను అని ఘోల్లు మంది శ్రీరెడ్డి.
అందువల్ల మరే సరైన తురుపు ముక్క దొరక్కపోతే, శ్రీరెడ్డి హడావుడి ముగిసినట్లే. చానెళ్లు మరో టాపిక్ ను వెదుక్కోవాలి టీఆర్పీ కోసం.