ప్రభుదేవా, తమన్నా ఒక్కటవుతున్నారట.. ఆగండాగండీ, ఇదేమీ లవ్ ఎఫైర్ కాదు. మేటర్ వేరే వుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి సినిమా వ్యవహారాల్ని తెలుగులో చక్కబెడుతున్న విషయం విదితమే. ఛార్మి నిర్మాతగా మారేందుకు పూరి సహకరించడం, ఈ క్రమంలోనే ఛార్మితో 'జ్యోతిలక్ష్మి' సినిమాని తెరకెక్కించడం, ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగుతుండడం, ఇద్దరూ సినిమా నిర్మాణంలో చురుగ్గా వుంటున్నారనే ప్రచారం జరుగుతుండడం తెల్సిన విషయాలే.
ఇప్పుడు అదే రిలేషన్ ప్రభుదేవా, తమన్నా మధ్య బిల్డప్ అవుతోందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. త్వరలో తమన్నాతో కలిసి ప్రభుదేవా, 'జాయింట్ వెంచర్' ప్రారంభం కాబోతోందట. ఓ కొత్త నిర్మాణ సంస్థని ఇద్దరూ ప్లాన్ చేస్తున్నారట. ప్రభుదేవాకీ, తమన్నాకీ బాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, టాలీవుడ్‌లలోనూ మంచి గుర్తింపు వుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'అభినేత్రి' సినిమా మూడు భాషల్లో తెరకెక్కిన విషయం విదితమే.
ఈ సినిమా సమయంలోనే, సొంతంగా ఇద్దరం కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన రావడం, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టేందుకు సన్నద్ధమవడం చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే, త్వరలోనే ఈ కాంబినేషన్‌లో ఓ నిర్మాణ సంస్థ తెరపైకొచ్చే అవకాశముంది. నటిగా, డాన్సర్‌గా తమన్నాకి మార్కులేయడం సంగతి అటుంచి, వ్యక్తిగా తమన్నా క్యారెక్టర్ చాలా గొప్పదని ప్రభుదేవా పదే పదే చెబుతుండడం ఈ గాసిప్స్‌కి మరింత బలాన్నిస్తోంది.