మళ్ళీ మళ్ళీ అదే మాట.. 'మా దగ్గర అణ్వాయుధాలున్నాయ్.. భారతదేశం గనుక యుద్ధానికి ముందుకొస్తే, ఏం చేయడానికైనా వెనుకాడబోం..' అంటూ పాకిస్తాన్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దూసుకొస్తూనే వున్నాయి. పాకిస్తాన్ ప్రధాని నుంచి ఈ మాటలు రావడంలేదు, అక్కడి మంత్రులు, సైనికాధికారులు, మాజీ అధ్యక్షుడు.. ఇలా పలువురి నోట మాత్రమే ఈ 'యుద్ధం' మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
నిజమేనా.? పాకిస్తాన్ నిజంగానే భారత్‌పై అణ్వాయుధాల్ని ప్రయోగించగలదా.? అంత నీఛానికి పాకిస్తాన్ ఒడిగడుతుంఉదా.? అంటే, ఏమో.. పాపాల పాకిస్తాన్ అన్నంత పనీ చేయొచ్చు. కానీ, అంతకన్నా ముందు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది.! అసలు, పాకిస్తాన్ బలమెంత.? భారత్ బలమెంత.? భారత్ వైపు నుంచి యుద్ధం అనే మాట రాకపోయినా, పాకిస్తాన్ పదే పదే యుద్ధానికి ఎందుకు పురిగొల్పుతోంది.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సగటు భారతీయుడి ముందున్నాయి.
వాస్తవానికి పాకిస్తాన్ అణ్వాయుధాల పేరుతో బెదిరించడం అంటేనే పెద్ద కామెడీ. ఎందుకంటే, పాకిస్తాన్ అణ్వస్త్రాల్ని మోహరించేలోపు, పాకిస్తాన్ సర్వనాశనమైపోవడం ఖాయమని, భారత్ వద్ద వున్న క్షిపణి వ్యవస్థ భరోసా ఇస్తోంది. ఇండియా దగ్గర వున్న అస్త్రాలన్నీ 'ఫైర్ అండ్ ఫర్గెట్' కాన్సెప్ట్‌తో రూపొందినవే. ఎయిమ్ చేస్తే గురి తప్పకుండా లక్ష్యాల్ని ఛేదించగలగడం భారత ఆయుధ సంపత్తి గొప్పతనం. ఈ విషయం పాకిస్తాన్‌కి బాగా తెలుసు. అందుకే, చైనా నుంచి 'సాంకేతిక అరువు తెచ్చుకుని' మరీ ఆయుధాల్ని తయారుచేసుకుంది.
పాకిస్తాన్‌తో పోల్చితే భారత్ ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ.. అన్నీ పటిష్టమైనవే. అత్యాధునిక యుద్ధ విమానాలైనా, జలాంతర్గాములైనా, యుద్ధ ట్యాంకులైనా.. ఎక్కడా పాకిస్తాన్, భారత్‌కి పోటీ కానే కాదు. పైగా ఇప్పటికే జరిగిన పలు యుద్ధాల్లో పాకిస్తాన్ చావు దెబ్బ తినేసి వుంది. అయినా, ఎగిరెగిరి పడ్తోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, భారత్‌ని రెచ్చగొట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్‌ని దోషిగా చూపాలన్నది పాకిస్తాన్ ప్రయత్నం. తాను బురదలో కూరుకుపోయి, ఆ బురదలోకి భారత్‌ని లాగేందుకు పాకిస్తాన్ విశ్వప్రయత్నాలూ చేస్తోంది. కానీ, పాక్ వ్యూహాలు ప్రతి సందర్భంలోనూ బెడిసికొడుతూనే వున్నాయి. మొరిగే కుక్క కరవదు.. అన్న సామెత అచ్చంగా పాకిస్తాన్‌కి సరిపోతుంది. అందుకే పాక్ రెచ్చగొడ్తున్నా, భారత్ సంయమనం పాటిస్తోంది.