సంక్షేమ పథకాలు అనగానేమి? అధికారం సంక్షేమంగా వుండడం కోసం ప్రవేశపెట్టేవి అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు. జనాలు ఏమయిపోతేనేం, రాష్ట్రం ఏం అయిపోతేనేం, అప్పులు కుప్పలుగా ఇచ్చే సంస్థలు వున్నాయి. తీర్చాల్సిన బాధ్యత ఏమీలేదుగా. చెన్నారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు ఎందరు ఎన్ని అప్పులు చేయలేదు. అవిఅలా పేరుకుంటున్నాయి కానీ వాళ్లేమైనా జవాబు దారీనా? ఇప్పుడు కేసిఆర్, చంద్రబాబు ఏమన్నా జవాబుదారీనా? యథాశక్తి అప్పులు చేసుకోవచ్చు.
వేలం పాట మాదిరిగా ఈ పార్టీ అయిదు వందలు ఫింఛన్ అంటే మరో పార్టీ వెయ్యి, ఆపై ఎన్నికల్లో రెండువేలు. ఆ తరువాత ఎన్నికల్లో నాలుగు వేలు. పన్నుగట్టేవాళ్ల ముక్కు పిండి వసూలు చేస్తూనే వుంటారు. మందు, పెట్రోలు మీద బాధుడు బాదుతూనే వుంటారు. ఇలా పప్పు బెల్లాల్లా పంచిపెడుతూనే వుంటారు.
కరెంటు ఫ్రీ, పండగ పండగకు సరుకులు ఫ్రీ, వైద్యం ఫ్రీ. ఇల్లు ఇస్తాం, చదువులు, రీ ఎంబర్స్ మెంట్ ఫీజులు. అప్పులు మాఫీ, ఆఖరికి లేటెస్ట్ గా ఏడాదికి యాభైవేలు అద్దె కూడా ఇస్తామంటున్నారు. సూపర్. ఇంకేం కావాలి. కూలీ నాలీ చేసిన డబ్బులు అన్నీ మిగుల్తాయి అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదు. ఆ డబ్బులు తెచ్చి మందుకు పెట్టేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నీ ఇస్తాయి కానీ మందు ఫ్రీగా ఇవ్వవు కదా. అక్కడ అంతకు అంతా లాగేస్తారు. అది వేరే సంగతి.
ఏ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది. అయిదేళ్లు అధికారం చాలు. అందినంతా సంపాదించేసుకోవచ్చు. అలా అయిదేళ్ల కోసం అలవి కాని హామీలు అన్నీ ఇచ్చేద్దాం. అప్పలు చేసి హామీలు తీర్చేయడం, తాము దోచుకున్నంత దోచుకుని దిగిపోవడం, ఆ అప్పులు మళ్లీ కారీ ఫార్వార్డ్.
అందుకే హామీలు ఇవ్వడం అన్నది తేలిక అయిపోయింది. ఈ ధర్మ సూక్ష్మం అర్థం అయిపోయింది. అందుకే వాళ్లు రూపాయి అంటే వీళ్లు రెండు. వీళ్లు రెండుఅంటే వాళ్లు నాలుగు. బహుశా 2024 నాటికి ఫింఛన్లు పదివేలు, ఇంటి అద్దె కింద లక్ష, ఇళ్లు కట్టుకోవడానికి పదిలక్షలు.
ఇలాంటి రేంజ్ లో వుంటాయేమో హామీలు. ఇప్పటికి జోక్ గా వుండొచ్చేమో? కానీ భవిష్యత్ లో జరిగేది ఇదే. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన హామీలకు లక్షకోట్లు కావాలని జాతీయ మీడియా అంచనా వేసింది. భవిష్యత్ లో ఎంత కావాల్సి వుంటుందో?