మెగా కాంపౌండ్ లో స్టోరీ డిస్కషన్లు ఎలా ఉంటాయో.. కథ ఓకే అవ్వడానికి ఎన్నిదశలు దాటాల్సి ఉంటుందో.. ఎంతమందిని మెప్పించాలో ఇక్కడ కొత్తగా/ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడీ బాధితుల జాబితాలోకి దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా చేరిపోయాడు. చేతిలో 4 అడ్వాన్సులు ఉన్నప్పటికీ బన్నీతో సినిమా కోసం ఏడాదిన్నరగా నిరీక్షించిన విక్రమ్ కుమార్ కు ఇప్పుడు మొండిచేయి దక్కింది.
రాసుకున్న స్టోరీలైన్ మంచిదే. విక్రమ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. కానీ మెగా కాంపౌండ్ ను మెప్పించడానికి ఆ టాలెంట్ సరిపోలేదు. ఇంకేదో కావాలి. అది విక్రమ్ వద్ద లేదు. దీనికితోడు 'నా పేరు సూర్య' ఎఫెక్ట్ ఒకటి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బన్నీ మరింత అభద్రతాభావంలో పడిపోయాడు. దీంతో ఆ ప్రభావం విక్రమ్ కుమార్ పై గట్టిగా పడింది.
ఇలా కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు, విక్రమ్ కుమార్ కాంపౌండ్ నుంచి బయటకు రావడానికి సవాలక్ష రీజన్లు. చివరాఖరికి తేల్చింది ఏంటంటే.. విక్రమ్ కుమార్ సబ్జెక్టు బాగున్నప్పటికీ నా పేరు సూర్య లాంటి ఫ్లాప్ తర్వాత ఈ రిస్కీ కథ చేయడం మరింత రిస్క్ అవుతుందని. అందుకే విక్రమ్ కు సింపుల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
అప్పటికే మానసికంగా సిద్ధంగా ఉన్నాడేమో, విక్రమ్ కూడా పెద్దగా గ్యాప్ ఇవ్వలేదు, కాంపౌండ్ నుంచి బయటకొచ్చిన వెంటనే నానితో సినిమా ఫిక్స్ చేసుకోవడం, వెంటనే అధికారక ప్రకటన రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ ఇక్కడ మేటర్ ఏంటంటే.. మళ్లీ విక్రమ్ కుమార్ మెగా కాంపౌండ్ లో అడుగుపెడతాడా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఆ కాంపౌండ్ లోకి వెళ్లినా బన్నీతో సినిమా చేస్తాడా అనేది డౌట్.
ఎందుకంటే, ఏ మనిషికైనా ఇగో సహజం. విక్రమ్ కుమార్ లాంటి క్రియేటర్ కైతే అది ఇంకొంచెం ఎక్కువంటారు తెలిసినవాళ్లు. ఓ ప్రెస్ మీట్ లో స్వయంగా నాగార్జునే పరోక్షంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. కాబట్టి, భవిష్యత్తులో బన్నీతో విక్రమ్ కుమార్ సినిమా చేయడం దాదాపు కష్టం.
తన వ్యవహారశైలితో ఇప్పటికే లింగుస్వామి లాంటి దర్శకుడ్ని దూరం చేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు విక్రమ్ కుమార్. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బన్నీకి దూరమౌతారో!