బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎంత భారీగా వుంటాయో, ఫ్యామిలీలు, వాటి మధ్య ఎమోషన్లు కూడా అంత భారీగానూ వుంటాయి. స్క్రీన్ నిండా జనం వుండాలి. కలర్ ఫుల్ గా వుండాలి. పైగా తెలుగుదనం ఉట్టిపడాలి. ఇవన్నీ చూసుకుని తయారుచేసిన పాటను వినయ విధేయ రామ సినిమాలో తొలిపాటగా విడుదల చేసారు.
ఓ అనాధ, అన్నదమ్ములు, ఆప్యాయతల నేఫథ్యంలో తయారైన కథ కాబట్టి, అందుకు తగినట్లే సాహిత్యం సాగింది. పాట చిత్రీకరణ, అర్థం, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ బాగున్నాయి. ట్యూన్ కూడా క్యాచీగానే వుంది. వినగా వినగా పట్టేస్తుంది కూడా.
కానీ దేవీశ్రీ ప్రసాద్ కు వున్న సమస్య ఒకటే. అది ఆది నుంచీ వుంది. తన ట్యూన్ లనే కాస్త ఇటు చేసి, కొత్త ఇనుస్ట్రుమెంటేషన్ జోడించి, సరి కొత్తగా వినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే భారీ సినిమాలకు పెద్ద సినిమాలకు ఇలా చేయడం తక్కువ. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలకు కాస్త మనసుపెట్టి పనిచేస్తాడు.
అదీకాక బోయపాటి, కొరటాల శివ లాంటి వాళ్లకు మంచి ట్యూన్ లు ఇస్తాడు దేవీ శ్రీప్రసాద్. అయితే ఇప్పుడు మాత్రం ఈ పాటను కాస్త పాత రిథమ్స్ అన్నీ గుర్తుకువచ్చేలా చేసాడు. అదొక్కటే కాస్త మైనస్. సినిమాలో చిత్రీకరణ భారీగా వుంటే ఈ మైనస్ కవర్ అయిపోతుందేమో?