ప్రతి పాత్రకీ మనోభావాలుంటాయి.!

సినిమా అంటేనే వివాదం అన్న చందాన తయారైంది పరిస్థితి. ఏదన్నా సినిమా వస్తోందంటే, టైటిల్‌ దగ్గర్నుంచే వివాదాలు మొదలవుతున్నాయి. సినిమాల్లోని పాత్రల స్వభావాలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా వున్నాయంటూ పోలీసులను ఆశ్రయించడం, కోర్టకెక్కడం ఇటీవలికాలంలో…

సినిమా అంటేనే వివాదం అన్న చందాన తయారైంది పరిస్థితి. ఏదన్నా సినిమా వస్తోందంటే, టైటిల్‌ దగ్గర్నుంచే వివాదాలు మొదలవుతున్నాయి. సినిమాల్లోని పాత్రల స్వభావాలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా వున్నాయంటూ పోలీసులను ఆశ్రయించడం, కోర్టకెక్కడం ఇటీవలికాలంలో సర్వసాధారణమైపోయింది.

మొన్నీమధ్యనే వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమాలో తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ తెలంగాణలోని లాయర్లు, మంత్రిగారిని కలిసి ఫిర్యాదు చేశారు. అదే సినిమా తమ మనోభావాల్ని దెబ్బతీసిందంటూ ఓ వర్గం పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. తాజాగా శంకర్‌ ‘ఐ’ సినిమాపై మరో ఆసక్తికరమైన వివాదం తెరపైకొచ్చింది. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ శంకర్‌పై మండిపడింది హిజ్రాల సంఘం.

మనోభావాలు అనేది చాలా సున్నితమైన అంశం. అసలు మనోభావాలు ఎవరికి వుండవు.? అన్న ప్రశ్న గురించి తొలుత ఆలోచించాలి. స్త్రీ పాత్ర, పురుష పాత్ర, డాక్టర్‌, పోలీస్‌, లాయర్‌, కులాలు, మతాలు.. ఇలా ఏ కోణంలో చూసినా అన్నిటికీ, అందరికీ మనోభావాలుంటాయి. అలాగని, సినిమాలో అందరి మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని పాత్రల్ని రూపొందించడం కుదురుతుందా.? ఛాన్సే లేదు.

ఈ తరహా వివాదాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందోగానీ, రోజురోజుకీ సినిమా తెరకెక్కించడం అనేది ఓ ప్రహసనంలా మిరిపోతోంది. సినిమా నిర్మాణం అంటేనే సవాలక్ష పురిటినొప్పులతో సమానమంటారు సినీ రంగంలోనివారు. అన్ని కష్టాల నడుమ ఈ మనోభావాల వ్యవహారం నిర్మాతకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడ్తోంది. ఇలాగైతే ఇక సినిమాలు తీయలేం.. అని సీనియర్‌ నిర్మాతలు ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు.