తాను నడవడు, పక్కవాళ్లని నడవనివ్వడు టైపు అన్నట్లుగా మారింది నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమా సంగతి. రేపే విడుదల అని పర్మనెంట్ పోస్టర్ వేసుకున్నట్లు కనుచూపు మేరలో అలా కనిపిస్తూ వుండిపోయింది. జరుపుకోవాల్సిన ఫంక్షన్ లు అన్నీ జరిపేసుకున్నాయి. ఇక ఆ సినిమాపై హీరో నాగ చైతన్య కూడా ఆశలు వదిలేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ కూడా ఇలాగే నాన్చి, నాన్చి, ఆఖరికి నానిపోయింది. పాపం ఓ కొత్త తెలుగు నిర్మాత ఈ ప్రాజెక్టుకు దొరికిపోయి 20 కోట్లు సమర్పించుకుని, ఎప్పుడు ఫస్ట్ కాపీ వస్తుందా అని ఎదురు చూపులు చూడడమే మిగిలిపోయింది. గౌతమ్ మీనన్ వ్యవహారాలు తెలిసిన నిర్మాతలు ఎవరూ ఈ ప్రాజెక్టులో దూరడానికి ముందుకు రాలేదు. కానీ ఈ కొత్త నిర్మాత దొరికిపోయారు.
సరే, ఆ సినిమాతో మనకేంటీ అని ప్రేమమ్ సినిమా డేట్ ను నిన్న ప్రకటించేసారు. ఇలా ప్రేమమ్ డేట్ ప్రకటించిన కాస్సేపటికీ సాహసం శ్వాసగా…డేట్ కూడా ప్రకటించేసారు. అది కూడా అదే డేట్ కే. టాలీవుడ్ జనాలకు భలే ఆశ్చర్యం. ఒకే హీరో సినిమాలు రెండు ఒకేసారా అని? ఇలా జరిగిన సంఘటనలు లేకపోలేదు కానీ, అవాయిడ్ చేస్తే బెటర్ కదా అని. అయినా సాహసం శ్వాసగా వచ్చినపుడు చూద్దాం అని మరి కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఆ సినిమాకు సవాలక్ష సమస్యలు వున్నాయని, అవన్నీ దాటుకుని విడుదలయినపుడు చూడవచ్చన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, ఆర్థిక సమస్యల కారణంగా సంగీత దర్శకుడురెహమాన్ కు ఇంకా రెమ్యూనిరేషన్ సెటిల్ చేయలేదని వినికిడి.
ఏమైనా సరే, బయ్యర్లలో కన్ఫ్యూజన్ లేకుండా సాహసం శ్వాసగా మరో డేట్ ప్రకటించుకుంటే మంచిదన్న సలహాలూ వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇరవై కోట్లు అంటే, వడ్డీలు కలుపుకుని ఇప్పటికి తడిసి మోపెడయి వుంటుంది. పైగా ఇప్పుడు పబ్లిసిటీకి మరో ఒకటి రెండయినా ఖర్చుచేయకుంటే ఆ సినిమా జనానికి చేరువకాదు. అంటే ఏలా లేదన్నా పాతిక కోట్లు. నాగ్ చైతన్య సినిమాకు అంత మార్కెట్ వుందా? పాపం..కొత్త నిర్మాత? ఎవరి మాటలు నమ్మి అమాయకంగా ఈ ప్రాజెక్టులో ఇరుక్కున్నారో?