ఇటీవల విడుదలైన మళయాళ చిత్రం 'ప్రేమమ్' అక్కడ తాజా బ్లాక్‌బస్టర్. మళయాళీలను వెర్రెత్తించేస్తోంది. నిజానికి ఇది చాలా హృద్యమైన ప్రేమకథ. కాకపోతే.. ఇది అచ్చంగా సుమారు పదేళ్ల కిందట వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ను పోలిన కథతోనే ఉంటుంది. అయితే మళయాళ 'ప్రేమమ్' ను మాత్రం చాలా అద్భుతంగా రూపొందించారు. అందులో నటీనటుల పెర్ఫార్మెన్స్, హృద్యంగా సాగే చిత్రీకరణ, చాలా ఫ్రెష్‌గా కనిపించే ముగ్గురు నాయికలు.. ఇలా కథ సాగుతూ.. తిరుగులేకుండా అలరిస్తుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం రీమేక్‌లో నటించాలని హీరో రామ్‌ను సంప్రదిస్తే నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రీమేక్‌లు సమస్యే లేదని ఆయన అన్నట్లు సమాచారం. కాకపోతే.. తెలుగులో , తమిళంలో కూడా వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌కు ఇంచుమించు రీమేక్‌లాగా ఉన్న ఈ మంచి చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయడానికి హక్కులు కొన్నదెవరనే విషయంలో పుకార్లున్నాయి.
దగ్గుబాటి సురేష్‌బాబు కొన్నట్లుగా ప్రచారం ఉంది. ఈ జోనర్ చిత్రాలకు తెలుగులో ఆదరణ సందేహాస్పదం అయిన నేపథ్యంలో సురేష్ కొని ఉంటారా? అనేది కొందరి సందేహం. అయితే.. మళయాళ రీమేక్‌లు కొనడానికి చాలా వేగంగా స్పందిస్తూ ఉండే నిర్మాత స్రవంతి రవికిషోర్, తాను ప్రేరణ ఇచ్చి సురేష్ బాబు తో కొనిపించినట్లుగా చెప్పుకుంటున్నారు.
తీరా వాళ్లు అనుకున్న హీరో రామ్ హ్యాండ్ ఇచ్చాడు. అదే నిజమైతే.. 'ప్రేమమ్' స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయగల హీరోను వెదకి పట్టుకోవడం తెలుగు నిర్మాతలకు చాలా పెద్ద పని. మరి ఇలాంటి చిక్కుముళ్ల మధ్య ఈ 'ప్రేమమ్' కు తెలుగు వెర్షన్ వస్తుందో లేదో సందేహంగానే ఉంది.