సంక్రాంతికి వస్తాయనుకున్న సినిమాలన్నీ సమ్మర్ కు షిఫ్ట్ అవుతున్నాయి. సమ్మర్ నే టార్గెట్ చేసిన సాహో లాంటి బడా సినిమాలకు ఇప్పుడు దారి కరువైంది. ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది.
సంక్రాంతికే వస్తుందనుకున్న భరత్ అనే నేను సినిమాను సమ్మర్ కు వాయిదావేశారు. ఏప్రిల్ 27న మూవీని విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఎనౌన్స్ చేశారు. సంక్రాంతికి వస్తామని ప్రకటించిన మరో సినిమా రంగస్థలం కూడా వాయిదాపడింది. ఏప్రిల్ రెండో వారంలో (కుదిరితే ఏప్రిల్ 13) మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.
క్రమం తప్పకుండా వేసవికి వచ్చే బన్నీ కూడా ఈసారి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఏప్రిల్ 27 నుంచి తప్పుకున్న ఈ హీరో.. తన అప్ కమింగ్ మూవీ 'నా పేరు సూర్య'ను మే 10 లేదా 18న విడుదల చేసే ప్లాన్స్ లో ఉన్నాడు.
సో.. ఏప్రిల్ రెండో వారం నుంచి మే రెండో వారం వరకు దాదాపు అన్ని రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. అదే నెలలో వస్తుందనుకున్న సాహో సినిమా ఇప్పుడు దాదాపు సమ్మర్ నుంచి తప్పుకున్నట్టే. దీనికి ప్రధానంగా సమ్మర్ బాక్సాఫీస్ రద్దీ ఓ కారణమైతే.. సాహో సినిమా షూటింగ్ లో జాప్యం కూడా మరో కారణం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు.