రాను రాను కాలం మారుతోంది. దాంతో పాటు అభిరుచులు మారుతున్నాయి. లేదా మార్చేస్తున్నారు. నిజాన్ని చెప్పడానికి కూడా నగ్నత్వాన్ని తోడు చేసుకోవలసి వస్తోంది. అప్పుడు కానీ జనం ఆసక్తిగా చూడరు. మొక్కలు నాటండి బాబూ. అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. పచ్చదనాన్ని ప్రేమించండి రా బాబూ, పది కాలాలు మానవ జీవనం పచ్చగా వుంటుంది అన్నది చెప్పాలనుకున్నారు దర్శకుడు పూరిజగన్నాధ్. అందుకోసం ఆయన తన క్రియేటివిటీ అంతా చూపించారు.
దట్టమైన ఆకుపచ్చని అడవులు చూపించడం బాగుంది. కళ్లకు ఎంత హాయిగా వుందో? కానీ చిట్టి పొట్టి బట్టలేసి చెట్లను కౌగిలించుకోవాలా? నిండుగా బట్టలేసుకుని కౌగిలించుకుంటే క్రియేటివిటీ అనిపించుకోదా? నగ్నంగా చెట్టును కౌగిలించుకోవాలా? అప్పుడు కానీ, సూపర్.. సూపరంతే అని ప్రశంసలు దక్కవా?
ఇలాంటి చౌకబారు జిమ్మిక్కులు లేకుండానే బలంగా మెసేజ్ పంపాలి, షార్ట్ ఫిలింతో శభాష్ అనిపించుకోవాలంటే, ఈ పాటి క్రియేటివిటీ సరిపోదు. దీనికి పదింతలు కావాలి. అందుకే అలాంటి ప్రయత్నం జోలికి పోకుండా అందమైన అమ్మాయిలు, చిట్టి పొట్టి డ్రెస్ లు, సుతారంగా కౌగిలించుకోవడాలు, ఆఖరికి నగ్నంగా నిల్చోవడాలు. జనం అహో.. అద్భుతం.. పరమాద్భుతం అనడం.
ఎక్కడికి వెళ్తున్నాం? ఒక మంచి విషయం చెప్పడానికి ఇదేనా మార్గం. రేపు మన అమ్మ ఫొటో ఒకటికి పదిసార్లు చూసుకోవడానికి కూడా ఫొటోషాప్ హంగులు అద్ది, డిజిటిల్ కలర్ కరెక్షన్ చేయాల్సిందేనా? అయ్యో.. ఖర్మ.