పెద్దపెద్ద మర్డర్ ఎటెంప్ట్ కేసులు, కబ్జాల నుంచే తప్పించుకున్న ఘనత టాలీవుడ్ ప్రముఖులకుంది. అలాంటిది చిన్న అరెస్ట్ ను తప్పించలేరా. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంలో పూరిజగన్నాథ్ అరెస్ట్ ను సక్సెస్ ఫుల్ గా తప్పించేశారట కొందరు ‘పెద్ద’ మనుషులు. తెరవెనక సాఫీగా వ్యవహారం మొత్తం సెటిల్ అయిన తర్వాతే పూరి జగన్నాథ్ సిట్ ఆఫీస్ మెట్లు ఎక్కారనేది ఇన్ సైడ్ సోర్స్.
దాదాపు 11గంటల పాటు పూరిని ప్రశ్నించిన సిట్ అధికారులు అరెస్ట్ చేయకుండా నిన్న రాత్రి అతడ్ని విడిచిపెట్టారు. పూరిని అరెస్ట్ చేస్తే కొన్ని సినిమాలు ఇబ్బందులు పడతాయి. అందుకే కొంతమంది కలిసి పూరి అరెస్ట్ కాకుండా ‘ముందుజాగ్రత్త’ చర్యలు తీసుకున్నారట.
ఇక పూరి అరెస్ట్ కాకుండా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి మ్యాగ్జిమమ్ తనవంతు ప్రయత్నం చేశాడని వినికిడి. పరిశ్రమ మూలస్తంభాల్లో ఒకడిగా పేరుతెచ్చుకున్న అతడి ‘గట్టి’ ప్రయత్నాల వల్లనే పూరి అరెస్ట్ ఆఖరి నిమిషంలో ఆగిపోయిందంటున్నారు. నిజానికి పూరిని కాపాడాల్సిన అవసరం ఆ వ్యక్తికి లేదు. కాకపోతే తనతో పాటు తనకు సంబంధించిన పలువురి పేర్లు బయటకొస్తాయనే భయంతోనే సదరు ప్రముఖుడు అరెస్ట్ ను ఆపేశాడని ఇన్ సైడ్ సోర్స్.
అయితే ఇది ప్రారంభం మాత్రమే. ఈ కేసులో ఎంతమందిని ఇలా ఆపగలరు. ఏ ఒక్కరు నోరు తెరిచినా డొంక కదులుతుంది. పబ్లిక్ సీక్రెట్ కాస్తా పెద్ద హెడ్ లైన్ గా మారుతుంది. పెద్దమనుషులుగా తిరుగుతున్న ప్రముఖుల బండారం బయటపడుతుంది. ఇకనైనా తమకు తాముగా ఇలాంటి నీచమైన పనులు ఆపితే అది వాళ్లతో పాటు పరిశ్రమకు కూడా మంచిది. లేదంటే పాపం పండక మానదు.. డ్రగ్స్ డొంక తగలబడక తప్పదు.