పుత్ర ప్రేమ అంటే జాగ్వారే

పిల్లల్ని కనడం గొప్ప కాదు. అడ్డగానో, నిలువుగానో, కష్టపడో డబ్బులు సంపాదించడం వరకు ఓకె. కానీ పిల్లల ప్రేమతో వారిని ఓ రేంజ్ కు చేర్చాలని అనుకుని, అందుకోసం ఎడం చేయి, కుడి చేయి…

పిల్లల్ని కనడం గొప్ప కాదు. అడ్డగానో, నిలువుగానో, కష్టపడో డబ్బులు సంపాదించడం వరకు ఓకె. కానీ పిల్లల ప్రేమతో వారిని ఓ రేంజ్ కు చేర్చాలని అనుకుని, అందుకోసం ఎడం చేయి, కుడి చేయి చూడకుండా ఖర్చు చేయడం, అది కూడా ఓ లెవెల్ లో శభాష్ అనిపించేలా ఖర్చు చేయడం అంటే కాస్త మెచ్చుకోదగ్గదే. 

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ గౌడ సినిమా రంగ  ప్రవేశం చేస్తున్నాడు. ఓ కన్నడ కుర్రాడు తెలుగు నాట హీరోగా రావాలనుకోవడమే ఆశ్చర్యం. అలా లాంచింగ్ కోసం చేస్తున్న ఖర్చు చూస్తే మరీ ఆశ్చర్యం. సినిమా కోసం ఎన్ని పదుల కోట్లు ఖర్చుచేసారన్న సంగతి అలా వుంచితే, ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఆడియో ఫంక్షన్ కు కూడా భయంకరంగా ఖర్చు చేసారు.  కర్ణాటక నుంచి పదుల సంఖ్యలో జనం వచ్చేసారు. 

హైటెక్స్ లాంటి భారీ ఆడిటోరియం జనాలతో కిటకిట లాడిపోయింది. దెవెగౌడ, కుమారస్వామి, కేటిఆర్ లాంటి అతిరధమహారథులతో పాటు తెలుగు సినిమా రంగ సెలబ్రిటీలు వచ్చారు. ఫంక్షన్ ను అల్లరి చిల్లరిగా కాకుండా చాలా పద్దతిగా మంచి కార్యక్రమాలతో నిర్వహించడం విశేషం. ప్రతి కార్యక్రమం ఓ రేంజ్ లో వుండి, ఎంత ఖర్చుచేసారు అన్నది క్లియర్ గా తెలిసేలా వుండడం విశేషం. 

కేవలం తాము తమ కుటుంబ సోత్కర్ష కాకుండా, దక్షిణాది నటులందరి గురించి పదే పదే..పదేపదే గుర్తు చేస్తూ కార్యక్రమం సాగడం మరీ విశేషం. సినిమా ఎలా వుంటుందన్నది తరువాత సంగతి. కానీ ఓ కార్యక్రమాన్ని కేవలం భారీగానే కాకుండా, నీట్ గా, పద్దతిగా రన్ చేయడం అన్నది కూడా మెచ్చుకోదగ్గ విషయం.మన హీరోలు పిల్లల్ని లాంచ్ చేసారు. వేరే వాళ్ల డబ్బులు ఖర్చు పెట్టించి మరీ.