ఆ రోజు పార్లమెంటులో ఏం జరిగింది.?

నెత్తీ నోరూ బాదుకున్నా ఉపయోగం లేదు. పార్లమెంటులో ఏదో జరిగిపోయింది. ఎలా జరిగింది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అయ్యింది.. రాజ్యసభలోనూ ఆ బిల్లుకి ఆమోదం…

నెత్తీ నోరూ బాదుకున్నా ఉపయోగం లేదు. పార్లమెంటులో ఏదో జరిగిపోయింది. ఎలా జరిగింది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అయ్యింది.. రాజ్యసభలోనూ ఆ బిల్లుకి ఆమోదం లభించింది. దాంతో, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇదొక్కటీ వాస్తవం. 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, పార్లమెంటులో ఆనాటి సంఘటనల గురించి ఇప్పటికే చాలా వ్యాసాల్ని రాశారు. మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు. తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అసలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అవలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్ని వేదికలపైనా కుండబద్దలు గొట్టేస్తున్నారు. మామూలుగా అయితే, ఇది జస్ట్‌ ఓ పొలిటికల్‌ లీడర్‌ చేసిన ఆరోపణగానే తీసుకోవాలి. కానీ, అత్యంత కీలకమైన విషయమిది. చట్ట సభల విశ్వసనీయతకు సవాల్‌ విసురుతున్నారు.. ఆ చట్ట సభల్లో ఒకప్పుడు ఎంపీగా వ్యవహరించిన వ్యక్తి. పైగా, ఆనాటి సంఘటనలకు తానే ప్రత్యక్ష సాక్షినని చెబుతుండడంతో, దీన్ని అంత తేలిగ్గా ఎలా కొట్టి పారేయగలం.? 

కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? పార్లమెంటులో ఆ రోజు ఏం జరిగిందో ఎవరు చెబుతారు.? న్యాయస్థానం, పార్లమెంటుని ప్రశ్నిస్తుందా.? ఛాన్సే లేదు. చట్ట సభల్లో ఏం జరిగినా, అది ఆ చట్ట సభలకు సంబంధించిన విషయం మాత్రమే. 'బిల్లు పాస్‌ అయ్యిందా.? లేదా.?' అన్న విషయం తేల్చాల్సింది లోక్‌సభ స్పీకర్‌ మాత్రమే. న్యాయస్థానం ప్రశ్నిస్తే, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజా సస్పెన్షన్‌ వ్యవహారం ఏమయ్యింది.? అక్కడా అదే జరుగుతుంది. 

మరి, దేశ ప్రజలకు సమాధానం దొరికేదెలా.? అసలు విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా.? అన్న ప్రశ్నకే సమాధానం లేదాయె. జస్టిస్‌ చలమేశ్వర్‌ మదిలోనే ఈ ప్రశ్న మెదిలిందంటే, చట్ట సభల నిర్వాకం ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 'చట్ట సభల్లో ఏమైనా చేస్తాం.. అధికారంలో వుంటే, చట్ట సభ మా ఆస్తి..' అని అదికారంలో వున్నవారు చట్ట సభల్లో అనైతిక చర్యలకు పాల్పడుతుండడంతోనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోవడం నైతికమా.? అనైతికమా.? అన్నది కాదిక్కడ ప్రశ్న. చట్ట సభల తీరుని ఇంకా సమర్థించుకుంటూ పోతే.. భవిష్యత్తులో ఎలాంటి వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో ఏమోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారంటే, వారి ఆందోళన, ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.