సాధారణంగా సినిమాలకు స్పెషల్ షోలు అలవాటే. కానీ మరీ రెండు రోజులు ముందుగా వేయడం అరుదు. పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాను ఈ విధంగా చాలా ముందుగానే లిమిటెడ్ అండ్ టార్గెటెడ్ సర్కిళ్ల కోసం షోలు వేసుకుంటూ వచ్చారు. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. కానీ ఘాజీ లాంటి భారీ సినిమాకు ఇలాంటి ప్రయత్నం చేయడం అంటే కాస్త రిస్క్ చేయడమే అవుతుంది.
రిజల్ట్ పాజిటివ్ గా వుంటే ఓకె. అది కొంత వరకు ఓపెనింగ్స్ కు పనికి వస్తుంది. కానీ తేడా వుంటే మాత్రం, పెద్ద సినిమాను కాస్త పెద్ద దెబ్బే తీస్తుంది. నిర్మాత పివిపి ఇప్పుడు ఇలాంటి సాహసమే చేస్తున్నారు. తన సినిమా ఘాజీని రెండు రోజులు ముందుగానే మీడియాకు చూపించాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఘాజీ కమర్షియల్ సినిమా కాదు.అయితే ఓ డిఫరెంట్ సినిమా.
హాలీవుడ్ సినిమాలు కూడా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అయ్యే క్వాలిటీ ఫుష్కలంగా వున్న సినిమానే. అయితే ముందుగానే దీన్ని చూపించడం అంటే ప్రేక్షకులకు సరైన రిపోర్టు పంపించడానికి వీలవుతుందా? లోకో భిన్నరుచి అని చూసిన వారి నుంచి ఎలాంటి టాక్ వెళ్తుందో? సాధారణంగా ఇలా మరీ ముందుగా షోలు వేస్తే, అవి ఓవర్ సీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి.
ఈ సంగతి పివిపి లాంటి నిర్మాతకు తెలియంది కాదు. తెలిసీ ధైర్యం చేస్తున్నారు అంటే, ఘాజీ సినిమా మీద పివిపికి గట్టి నమ్మకమే వున్నట్లుంది. ఘాజీ సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్ల వరకు విడుదలవుతుంటే, హిందీలో మాత్రం వెయ్య థియేటర్ల వరకు విడుదల ప్లాన్ చేయడం విశేషం.