తమిళనాట రెండు తోలు బొమ్మలు ముందుకు వచ్చాయి – పన్నీరు సెల్వం, పళనిస్వామి! గవర్నరు ఏ బొమ్మకు అవకాశం యిస్తారో, యిచ్చినా ఆ బొమ్మ ఫైనల్‌గా గెలుస్తుందా అనేది ఆసక్తి కలిగించే అంశం. ఇప్పుడే ఓ వాట్సప్ మెసేజి. గవర్నరుగారు ఎవర్ని పిలవాలో ప్రజాభిప్రాయం కోరుతున్నారట. గవర్నరుగారి ఈమెయిల్‌కు మనం మన అభిప్రాయం పంపాలట. అంతేకాదు, ఈ మెయిల్ సబ్జక్టు – 'ఓపిఎస్ సిఎం' అని రాయాలట. అంటే మన అభిప్రాయం ఎలా వుండాలో కూడా వాళ్లే చెప్పేస్తున్నారన్నమాట. మార్పు కోరే వాళ్లందరూ కొంత సమయం దీనికి వెచ్చించాలట. పన్నీరుకి మద్దతుగా నెటిజన్లు చేస్తున్న హడావుడి యింతా అంతా కాదని చెప్పడానికి యిది ఒక ఉదాహరణ మాత్రమే. గవర్నరు అలా ఏమీ అడగలేదని, యిది ఒక బోగస్ మెసేజ్ అనీ వేరే చెప్పనక్కరలేదు. పరిస్థితుల్లో మార్పు తప్పకుండా రావాలి. కానీ యిలాటి అబద్ధాలతో కాదు. ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో శశికళ ముఖ్యమంత్రి కాలేదన్న విషయంలో స్పష్టత వచ్చింది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరాని చర్చించేందుకు ముందు, సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానించవలసిన అవసరం వుంది.
అక్రమాస్తుల కేసులో 20 ఏళ్ల పాటు విచారణ జరిపి ట్రయల్ కోర్టు తీర్పు యిస్తే కర్ణాటక హైకోర్టు దాన్ని ఉఫ్‌న వూది పారేసింది. 2015 జూన్‌లో నేను రాసిన వాక్యాలివి – 'జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు చాలా వింతగా వుంది. జయలలిత కున్న అప్పులు రూ.10.67 కోట్లు అని ట్రయల్ కోర్టు అంటే, కాదు, కాదు రూ.24.17 కోట్లు అనేశారు, హై కోర్టు జడ్జి! మొదటి అంకె కరక్టయితే ఆమె అక్రమాస్తులు వుండవలసిన దాని కంటె 76.76% ఎక్కువ వున్నట్టు తేలుతుంది, రెండోది తీసుకుంటే 8.12% మాత్రమే అవుతుంది. హైకోర్టు జడ్జి రెండోది లెక్కలోకి తీసుకుని, ఓస్ యింతేగా అని వదిలేశాడు. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు ఆదాయం వచ్చే మార్గాలేమీ లేవు కాబట్టి, అవన్నీ మొదటి ముద్దాయి జయలలితవే అంటూ ట్రయల్ కోర్టు జడ్జి లెక్కేస్తే, అబ్బే వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుని కొన్న స్థిరాస్తులు అన్నారు హైకోర్టు జడ్జి. సుధాకరన్ పెళ్లి ఖఱ్చు రూ. 6.45 కోట్లు అని ప్రాసిక్యూషన్ అంది. రూ.98 లక్షలు అని జయలలిత యిన్‌కమ్‌టాక్స్ వారికి చెప్పింది. అబ్బే మేమే భరించాం, దాని కోసం రూ.92 లక్షలు బ్యాంకులో వేశాం అంటూ పెళ్లికూతురు అన్నగారు బ్యాంకు పాస్‌బుక్ పట్టుకుని వచ్చాడు. దానిపై బ్రాంచ్ పేరు, స్టాంపు లేవు. పెళ్లి ఖర్చుల కోసం సేవింగ్స్ ఖాతా తెరవడం విడ్డూరంగా వుంది, పైగా జయలలిత సప్లయిర్సకు తన చెక్కులు యిచ్చింది. 'పెళ్లికి రూ. 3 కోట్లు ఖఱ్చయిందని నా అంచనా' అన్నారు ట్రయల్ కోర్టు జడ్జి. 'అబ్బే 29 లక్షల రూ.ల లోపే ఖఱ్చయింది' అని తేల్చేశాడు హైకోర్టు జడ్జి. జయలలిత కొత్తగా కట్టించిన బిల్డింగులపై రూ.21 కోట్లు ఖర్చయిందని ట్రయల్ జడ్జి అంటే అబ్బే రూ.5 కోట్లే అన్నారు హైకోర్టు జడ్జి. 900 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ రూ.7.50 కోట్లకు కొనడం, పంట భూములను ఎకరా 10 వేలకు కొనడం నమ్మశక్యంగా లేవు అని ట్రయల్ జడ్జి అంటే వాటి విలువ రూ.6.24 కోట్ల కంటె ఎక్కువ వుండదు అన్నారు హైకోర్టు జడ్జి…' !
ఇలాటి తిక్కతిక్క వాదనలతో జయలలితను విడుదల చేసి, ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేట్లు చేసింది కర్ణాటక హైకోర్టు తీర్పు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఆ తప్పును సవరించింది. కానీ చాలా లేటు చేసింది. జయలలిత బతికి వుండగానే యీ తీర్పు వచ్చి వుంటే ఎంతో బాగుండేది. చచ్చి ఆమె బతికిపోయింది. బతికి వున్నారు కాబట్టి శశికళ, ఆమె బంధువులు అనుభవిస్తున్నారు. సరిగ్గా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన వేళ తీర్పు వచ్చి శశికళ ఒక్క పూట కూడా గద్దె మీద కూర్చోలేకపోయింది. ఇప్పుడు తీర్పు రావడంతో డిఎంకె ఆఫీసులో మాత్రమే కాదు, పన్నీరు శిబిరంలోనూ హర్షం వెల్లివిరిసింది. శశికళ మాట సరే, తను నిత్యం నామస్మరణ చేసే జయలలిత కూడా దోషే అని కోర్టు చెప్పిన విషయం మర్చిపోతున్నారు వీళ్లు. గతం వారం రోజులుగా శశికళ అక్రమార్జనపై వచ్చినన్ని ఫార్వార్డులు మరెవ్వరిపై చూడలేదు. జయలలితకు తెలిసే, ఆమె ఏలుబడిలోనే, ఆమె భాగస్వామిగా, బహుశా ఆమెకు బినామీగా యీ ఆస్తులు పోగుపడ్డాయన్న విషయం ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. తన పార్టీలో ఎవరినైనా సరే, కంటిచూపుతో కాళ్ల మీద పడేసుకోగల జయలలిత శశికళ తనకు చెప్పకుండా లంచాలు పడుతూ వుంటే చూస్తూ వూరుకుంటుందా? జయలలితకు శశికళ స్లోపాయిజనింగ్ చేసిందని మీడియాలో రాయవచ్చు, ఎంతమందైనా నమ్మవచ్చు. జయలలిత నమ్మలేదు. అందుకే రక్తబంధువుల్ని, క్లాస్‌మేట్స్‌ను, సినిమా సహచరులను, అనుచరులను – ఎవర్నీ నమ్మని జయలలిత ఆమెను నమ్మింది. శశికళ నమ్మకద్రోహం చేస్తూ వుంటే తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు జయలలిత.
జయలలిత మేధస్సు గురించి ఆమెను తెలిసున్నవాళ్లందరూ, ఆమెతో పనిచేసిన వాళ్లందరూ చెప్తారు. పైగా ఆమెకు యింటెలిజెన్సు వర్గాలు వుండనే వుంటాయి. శశికళ అంటే పడనివాళ్లు ఎలాగూ పుకార్లు మోస్తారు. జయలలిత బతికి వుండగా శశికళ ఏ దుష్కార్యం చేసినా, అది జయలలితకు తెలిసే జరిగిందని కచ్చితంగా చెప్పవచ్చు. ఏ జాతీయ పార్టీ ఐనా సరే ముఖ్యమంత్రి అవినీతిపరుడు అంటే దాని అర్థం అతను సంపాదించిన దాంట్లో 90% హై కమాండ్‌కు పంపిస్తున్నాడు అనే! అలా పంపనినాడు అతన్ని తీసి పక్కన పారేస్తారు. ఎడిఎంకె ఎన్నో ఎన్నికల్లో పోరాడింది. డబ్బు ఎక్కణ్నుంచి వచ్చింది? ఇదిగో యిలాటి వాళ్లని అడ్డుపెట్టుకునే జయలలిత సంపాదించింది. మళ్లీ వాళ్ల ద్వారానే అభ్యర్థులకు పంపిణీ చేస్తుంది. డిఎంకె ఐనా యింతే!
ఎడిఎంకె పార్టీ అధినేత అవినీతిపరురాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ పార్టీలో ఎన్నో ఏళ్లగా భాగమై, ఆ అధినేత కూర్చోమన్నపుడు కూర్చుని, లేవమన్నపుడు లేచి, ఆమె చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టిన పన్నీరును పునీతుడిగా భావించడానికి లేదు. సొంత వ్యక్తిత్వం లేనివాడని, మంచీచెడూ తను ఏం చెప్పినా తన మాటకు ఎదురాడడని, గ్రూపులు కట్టలేని అసమర్థుడని లెక్కవేసి జయలలిత తన స్థానంలో కూర్చోబెట్టింది. అతనికి వున్న పదవీలాలసతో బాటు రాజకీయ అసమర్థత కూడా యీ వారంలో బయటపడింది. జయలలిత ఆసుపత్రిలో వుండగా తనను చూడనివ్వలేదని, ఆమెకు వైద్యం సరిగ్గా జరిగిందో లేదో అనుమానాలున్నాయని.. వంటి విషయాలు ముఖ్యమంత్రిగా దిగిపోమన్న తర్వాత అతనికి హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి. శశికళ తనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనిచ్చినంత కాలం జయలలిత గతి ఏమైనా పట్టించుకోలేదు. దాని గురించి నోరు విప్పలేదు. రాజీనామా చేసిన తర్వాత 'మై హూఁ న' అంటూ ఎవరో హామీ యివ్వడంతో యిక రెచ్చిపోయాడు. నెటిజన్లు, మీడియా అండగా నిలిచారు. శశికళ నిర్వహించిన ఎమ్మెల్యే క్యాంప్‌ను భగ్నం చేయడానికి శతథా ప్రయత్నించాడు. ఎంత తంటాలు పడినా సగటున రోజుకి ఒక ఎమ్మెల్యేను కూడా తన వైపు గుంజుకో లేకపోయాడు. ఇప్పటికీ రెండంకెలకు చేరలేదు. అటు శశికళకు బలం మూడంకెల్లో వుంది.
ఎమ్మేల్యేలతో క్యాంపులు నిర్వహించడాలు 1984 నుంచి చూస్తూనే వున్నాం. ఎన్టీయార్ తనవైపు ఎమ్మెల్యేలతో రామకృష్ణ స్టూడియోలో క్యాంపు నిర్వహించినపుడు దాన్ని భగ్నం చేయడానికి నాదెండ్ల ప్రయత్నించడం, పోలీసులను పంపడం కూడా చూశాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలను బెంగుళూరు తీసుకెళ్లడమూ చూశాం. ఎన్నో రాష్ట్రాలలో యిలాటి క్యాంపులు నడిచాయి. కానీ శశికళ నడపడం మాత్రం అత్యంత ఘోరమైన విషయంగా హడావుడి జరిగింది. ఇలా క్యాంపుల్లో వున్న ఎమ్మెల్యేలపై నానారకాల వలలు విసురుతూంటారు. డబ్బు యివ్వచూపడం ప్రాథమికమైనది. ఫైళ్లు వెతికి, కేసులు బయటకు తవ్వి బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం రెండో స్టెప్పు. ప్రభుత్వంలో వున్నవాళ్లు అతి తేలిగ్గా చేయగల పనులివి. వీటికి తోడు యీ సందర్భంలో పన్నీరు అనుచరులు ఎమ్మెల్యేల సెల్ నెంబర్లు బయటపెట్టి ప్రజల చేత ఫోన్లు చేసి ఒత్తిడి చేయించే ప్రయత్నం జరిగింది. పన్నీరు డర్టీ ట్రిక్స్‌లో ఒకటి – జయలలిత యింటిని మ్యూజియంగా మారుస్తామనేది! ఈ ఐడియా జయలలిత చచ్చిపోగానే రాలేదు. ఇప్పుడు శశికళ అక్కడ మకాం పెట్టింది కాబట్టి వచ్చింది. ప్రభుత్వం ఏదైనా ప్రయివేటు ఆస్తిని తీసుకునేటప్పుడు వాళ్లకు లేదా వారి వారసులకు నష్టపరిహారం యివ్వాలి. పన్నీరు ప్రకటనలో పరిహారం వూసే లేదు. మ్యూజియం పెట్టాలి, ఖాళీ చేయండి అంటూ శశికళ ముఠాను తరిమివేయడమే లక్ష్యం. ఏం చేసినా చివరి వరకు శశికళ ధైర్యంగా చెన్నయ్‌లోనే క్యాంప్ నడిపింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న పన్నీరు అధికారులను మార్చి ఒకరి తర్వాత మరొకర్ని పంపి, ఎన్ని తంటాలు పడినా క్యాంపు దృఢంగానే నిలబడింది. చివరకు 119 మంది ఎమ్మెల్యేలు ఆమె పక్షాన వున్నారని ప్రభుత్వం తరఫున కాంచీపురం పోలీసులు కోర్టుకి నివేదించవలసి వచ్చింది.
గడకర్రలేసి పన్నీరును ఎంత నిలబెట్టినా ఎమ్మెల్యేలను లాక్కు రాలేడని గవర్నరుతో సహా అతనికి దన్నుగా నిలబడినవారికి అర్థమై వుంటుంది. ఎందుకు తాత్సారం చేశాడో చెప్పకుండా గవర్నరు రోజుల తరబడి వేచి చూసి ఫిరాయింపులకు దోహదపడ్డాడు. ఎంత గింజుకున్నా, పన్నీరు వైపు కొందరు ఎంపీలు వచ్చారు తప్ప పెద్దగా ఎమ్మెల్యేలు రాలేదు. ఎంపీలు వచ్చినా ఏం ప్రయోజనం? ఇప్పుడు కావలసినది ఎమ్మెల్యేలు. టీవీ వాళ్లు పన్నీరు సెల్వం యింటి ముందు వున్న జనం వద్దకు వెళ్లి వాళ్ల అభిప్రాయాలు ప్రసారం చేస్తూ తమిళ ప్రజలందరూ శశికళకు వ్యతిరేకంగా వున్నారని ప్రచారం చేశారు. ప్రజల మనసుల్లో ఏముందో ఎవరికీ సులభంగా తెలియదు. తెలిసే మాటయితే ఎన్నికల ఫలితాలపై యిన్ని వూహాగానాలుండవు. గత ఎన్నికల్లో ఎడిఎంకెకు ఓటేసిన ఓటర్లు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం. పార్టీ ఎమ్మెల్యేలలో 85% మంది శశికళతో వుండగా, పదిలోపు ఎమ్మెల్యేలతో పన్నీరు ముఖ్యమంత్రి కాలేడని, డిఎంకె పార్టీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని సగటు తమిళుడికి తెలుసు. పన్నీరుకి మద్దతు ప్రకటించి స్టాలిన్ దాన్ని ధృవపరచాడు కూడా. అంటే గతంలో జయలలిత ముందు సాగిలబడినట్లే పన్నీరు యిప్పుడు స్టాలిన్ ముందు సాగిలబడతాడన్నమాట. స్టాలిన్ ప్రకటనను శశికళ బాగా వాడుకుంది – జయలలిత చీర లాగిన డిఎంకెతో పన్నీరు కుమ్మక్కయ్యాడు అని. దాంతో స్టాలిన్ నాలిక కరుచుకుని, ఎడిఎంకెలోని రెండు వర్గాలకు తాము దూరం అని ప్రకటించాడు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం అని చేర్చాడు. అలా అన్నా పన్నీరు అతని మద్దతుపైనే ఆధారపడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
పన్నీరు స్టాలిన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తెచ్చుకున్నాడు. చరణ్ సింగ్ విషయంలో యిలాగే జరిగింది. ఇందిరా గాంధీ అతని ద్వారా జనతా పార్టీ చీల్చి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాక అతనికి మద్దతు ఉపసంహరించింది. రాజీవ్ గాంధీ చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు యిచ్చి పడగొట్టాడు. స్టాలినూ అదే చేస్తాడు. వెంటనే రాష్ట్రపతి పాలన, ఎన్నికలు. ఎన్నికలలో స్టాలిన్‌ను ఎదిరించగల స్టేచర్ వున్న నాయకుడు ఎడిఎంకెలో ఎవరూ లేరు. జయలలిత పేరు చెప్దామన్నా యిప్పుడీ సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఆమె యిమేజికి మకిలి పట్టింది. ఎన్నికల కోసం తహతహలాడే డిఎంకె పన్నీరును నాలుగేళ్ల పాటు కాదు కదా నాలుగు నెలలైనా వుండనివ్వదు. ఇది పన్నీరుకి తెలుసు. కానీ అప్పటిదాకా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత తను చేరబోయే పార్టీ (డిఎంకె/బిజెపి)లో మంత్రిగా వుండవచ్చు. అదీ ఆశ! ఎడిఎంకె పార్టీ అభిమానులకు యిదంతా రుచించే వ్యవహారం కాదు. డిఎంకెకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన తాము యికపై డిఎంకె అడుగులకు మడుగులు ఒత్తడమనేది సహించలేని వ్యవహారం. అందుకే ఎడిఎంకె నాయకులు వాళ్ల ఎమ్మెల్యేలకు దన్నుగా నిలబడ్డారు. అందుకే ఎమ్మెల్యేలలో 85% మంది చెదరకుండా నిలిచారు. శశికళ పరమ దుర్మార్గురాలని మీడియా, నెటిజన్లు కోడై కూసినా వాళ్లపై ప్రభావం పడలేదా అని ఆశ్చర్యం వేస్తుంది కదూ.
నీతులు వేరు, రాజకీయాలు వేరు. డిఎంకె పార్టీలో కరుణానిధి, ఎమ్జీయార్‌ల మధ్య గొడవలు వచ్చినపుడు కరుణానిధి పార్టీ నిధులు స్వాహా చేశాడని ఎమ్జీయార్ ఆరోపించాడు. 'నువ్వే పార్టీ కోశాధికారివి, నువ్వే లెక్కలు చెప్పాలి' అని కరుణానిధి తిప్పికొట్టాడు. 'నేను సినిమా హీరోగా బిజీగా వున్నాను. నా పేరు మీదే నువ్వే అంతా నిర్వహించావు.' అని ఎమ్జీయార్ జవాబిచ్చాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో పార్టీలో సద్దు మణిగింది. ఇది పేపర్లలో వచ్చిన సమాచారం. సద్దు ఎలా మణిగిందో డివి నరసరాజుగారు తన కాలమ్‌లో రాశారు. కరుణానిధి డిఎంకె పార్టీ నాయకులందర్నీ పిలిచి ఓ సమావేశం ఏర్పరచాడుట. 'ఇదిగో ఫలానా పారిశ్రామికవేత్త నుంచి యింత తీసుకున్నాను. దానిలో నీకు యింత యిచ్చాను, యిదిగో నీకింత యిచ్చాను. అవునా? కాదా?' అంటూ లెక్కలు చెప్పాడట. డబ్బు ముట్టినవారందరూ తలలూపారు. మొత్తం మీద చూస్తే కరుణానిధి నిధుల నిర్వహణ బాగానే వుందని అందరూ సంతృప్తి పడ్డారు. అందుకే ఎమ్జీయార్‌ను డిఎంకె లోంచి బహిష్కరిస్తే ఎవరూ అతని వెంట వెళ్లలేదు. కొత్త పార్టీ పెట్టి చాలాకాలం తంటాలు పడ్డాక కానీ ఎమ్జీయార్ పార్టీపై వాళ్లకు నమ్మకం చిక్కలేదు. ఇప్పుడు శశికళ అవినీతిపరురాలు అనే మనం చీదరించుకుంటున్నాం. కానీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వాళ్లే కావాలి. తాను తినాలి, పదిమందికి పెట్టాలి, వాళ్లనూ తిననివ్వాలి. లంచాలు పట్టే ఆఫీసుల్లో కూడా యిదే రివాజు. శశికళ కూడా కరుణానిధి మోడల్లో లెక్కలు చెప్పి అందర్నీ సంతృప్తి పరిచిందేమో, అందుకే అందరూ ఆమెతోనే కట్టగట్టుకుని వూరేగుతున్నారు. ఇప్పుడామె అవినీతిపరురాలని కోర్టు తేల్చేసింది. జైలు శిక్ష వేసింది. ఛీఛీ అంటూ ఎవరైనా ఆమెను విడిచి వెళుతున్నారా?
ఎలా సంపాదిస్తానేం ఆమె దగ్గర డబ్బుంది. 10 కోట్లు కోర్టుకి కట్టినా యింకా బోల్డు మిగిలి వుంటుంది. నాలుగేళ్లు జైలుశిక్షలో ఆర్నెల్లు అంతకు ముందే గడిపింది. మిగిలినది మూడున్నరేళ్లు. ఇలాటివాళ్లకు సత్ప్రవర్తన కింద ఆర్నెల్లు ముందు విడిచేసినా అబ్బురపడవద్దు. ఈ పళనిస్వామి 2021దాకా లాగించగలిగితే తదుపరి ఎన్నికల టైముకి శశికళ డబ్బు సంచులతో సిద్ధంగా వుంటుంది. ఆమె జైలుకి వెళ్లినా అసలు సూత్రధారి ఆమె భర్త నటరాజన్ బయటే వుంటాడు. జైలు నుంచే ఆమె ఆదేశాలు యివ్వగలదు. రేపు ఆమె కీలుబొమ్మ ముఖ్యమంత్రి అయితే జైల్లోనే దర్బార్లు నిర్వహించగలదు. పదేళ్ల దాకా ఆమె ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ వెనక నుంచి చక్రం తిప్పకుండా ఆమెను ఎవరూ ఆపలేరు. ఇవన్నీ తెలిసే లాగుంది, ఆమె ఎమ్మెల్యేలు ఆమెను అంటిపెట్టుకునే వున్నారు. తీర్పు ఆమెకి వ్యతిరేకంగా వస్తే ఆమె స్థానంలో ఎవరు రావాలన్న విషయంపై కొట్టుకుని విడిపోతారని వేసిన అంచనాలు తప్పాయి. తంబిదురైకి ఆశ వుందని, మరొకరికి వుందని మధ్యేమార్గంగా జయలలిత మేనల్లుడు దీపక్‌ను తెస్తారని పుకార్లు వచ్చాయి కానీ తీర్పు వచ్చిన గంటలోనే పళనిస్వామి పేరు ఖరారై పోయింది. ఇప్పటిదాకా ఎవరూ తిరగబడలేదు. అసెంబ్లీలో బలపరీక్షలో పళనిస్వామి నెగ్గి కాబినెట్ ఏర్పాటు చేసేటప్పుడు మంత్రి పదవులు దక్కనివారు తిరుగుబాటు చేస్తారని, ప్రభుత్వం కుప్పకూలుతుందని మరో విడత ఊహాగానాలు చేస్తున్నారు. అది అప్పటిమాట. ప్రస్తుతానికి పళనిస్వామి శశికళ ఆడించే తోలుబొమ్మ, అటు వున్న పన్నీరు డిఎంకె ఆడించే తోలుబొమ్మ. ఆ బొమ్మకు కేంద్రం మద్దతు వున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గవర్నరు యిప్పట్లో నిర్ణయం తీసుకోకపోయినా ఫర్వాలేదు అనే అర్థంలో 'తమిళనాడు ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదు' అంటూ వెంకయ్య నాయుడు అనడం గమనార్హం. ఈ బొమ్మలాటలో బొమ్మ తొట్రుపడి ప్రభుత్వం కుప్పకూలితే, రాబోయే ఎన్నికలలో కొన్నయినా సీట్లు గెలుచుకోవాలని బిజెపి చూడడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం సీట్లేవీ లేవు, ఎవరితోనో పొత్తు పెట్టుకుని కనీసం పది తెచ్చుకున్నా కాలూనుకున్నట్లే. చెప్పవచ్చేదేమిటంటే శశికళ జైలుకి వెళ్లినా ఆమె పలుకుబడి యిప్పట్లో నశించదు. ఈనాడు నిలబెట్టిన పళనిస్వామి తోక ఝాడిస్తే అప్పుడు కొత్త డ్రామా ప్రారంభమవుతుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2017)