జయలలిత శిక్షని ఎవరు అనుభవిస్తారు.?

సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చింది. అక్రమాస్తుల కేసులో జయలలిత సహా మొత్తం నలుగురు దోషులుగా తేలారు. ఇందులో శశికళ, ఇళవరసన్‌, సుధాకరన్‌ మిగిలినవారు. ముగ్గురికీ నాలుగేళ్ళ జైలు శిక్ష,…

సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చింది. అక్రమాస్తుల కేసులో జయలలిత సహా మొత్తం నలుగురు దోషులుగా తేలారు. ఇందులో శశికళ, ఇళవరసన్‌, సుధాకరన్‌ మిగిలినవారు. ముగ్గురికీ నాలుగేళ్ళ జైలు శిక్ష, 10 కోట్ల జరీమానా విధించింది గతంలోనే ప్రత్యేక న్యాయస్థానం. కానీ, హైకోర్టుకి వెళ్ళి జయలలిత ఈ కేసులోంచి ఊరట పొందారు. క్లీన్‌ చిట్‌ దక్కించేసుకున్నారు కూడా. 

ఓ వ్యక్తి దోషిగా తేలాడంటే నేరం చేసినట్లే. కానీ, కోర్టు కోర్టుకీ తీర్పు మారిపోతుంటుంది. ఎందుకంటే, వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్లేదు, ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు.. ఇదీ భారతదేశంలో న్యాయవ్యవస్థ తీరు. నిర్దోషికి శిక్ష పడకూడదన్నది బాగానే వుంది, దోషి తప్పించుకుంటే ఫర్లేదు.. అనడమే దారుణం కదా.! కారణాలేవైతేనేం, పది రోజుల్లోనో, నెల రోజుల్లోనో, ఏడాదిలోనో తేలాల్సిన కేసులు, ఏళ్ళ తరబడి నలుగుతూ వుంటాయి. జయలలిత కేసు కూడా అంతే. 'నేను నిర్దోషిని..' అని ఆమె కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత ఆమెకు ఊరట లభించడం, అంతకు ముందు దోషిగా తేలినా, తాజాగా లభించిన క్లీన్‌ చిట్‌తో ఆమె పండగ చేసుకోవడం.. ఇలా జరుగుతూ వచ్చింది. 

ప్రస్తుతానికి జయలలిత దోషి. ఆమె ఇంకా మూడున్నరేళ్ళపాటు జైలు శిక్ష అనుభవించాలి. కానీ, ఆమె జీవించి లేరు కదా.? మరెలా శిక్ష అనుభవిస్తారు.! న్యాయం ఆలస్యమయ్యేకొద్దీ, న్యాయం జరగకుండా పోతుందనడానికి ఇదే నిదర్శనం. 'పోన్లే, దేవుడు శిక్షించాడు..' అని సరిపెట్టుకోవాలేమో, ఆమె మరణించారు గనుక. అలాగంటే, మళ్ళీ జయలలిత మద్దతుదారులకి కోపం రావొచ్చుగాక.! 

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి కేసులు నమోదవుతుంటాయి. ఆయా వ్యక్తుల కులాలకు సంబంధించిన కేసుల్నీ చూస్తూనే వున్నాం. వారి టెర్మ్‌ పూర్తయ్యాక, ఆయా కేసుల్లో తీర్పులు రావడం చూస్తున్నాం. అంత లేటుగా తీర్పు వచ్చి ఉపయోగమేంటట.? అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నట్లే న్యాయవ్యవస్థలోనూ లోటుపాట్లున్నాయి. న్యాయస్థానాల్లో నియామకాలకు సంబంధించి పాలకుల అలసత్వం, న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిడి లాంటి  చాలా అంశాలు మొత్తం న్యాయవ్యవస్థను అభాసుపాల్జేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. 

మొన్నటికి మొన్న తప్ప తాగి వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ఖాన్‌కి క్లీన్‌ చిట్‌ లభించింది. కృష్ణ జింకని వేటాడిన కేసులోనూ అంతే. రెండు సందర్భాల్లోనూ 'బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌' సల్మాన్‌ఖాన్‌కి వరంగా మారింది. దీనర్థమేంటి.? చెప్పకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా కన్పిస్తాయి ఇలాంటి లూప్ హోల్స్. ఇలాగైతే, ఈ వ్యవస్థలో న్యాయం జరుగుతుందని సామాన్యుడికి నమ్మకమెలా కలుగుతుంది.? 

న్యాయదేవత కళ్ళకు గంతలు ఎప్పుడో కట్టేశాం. అందుకే, న్యాయం గురించి మాట్లాడటమే అన్యాయమిప్పుడు.!