రాజకీయాల్లో నటిస్తున్నావా పవన్?

తెలంగాణను మనం కాపాడుకోవాలి.. అందుకోసం రక్తం ధారపోస్తా.. Advertisement తెలంగాణ ఉనికిని చాటడానికే ఆంధ్రకవుల్ని, రచయితల్ని తెలుగు మహాసభలకు పిలవలేదు. తెలంగాణ నినాదంతో నా అణువు అణువు పులకరిస్తుంది. నాకు పునర్జన్మనిచ్చిన తల్లి తెలంగాణ.…

తెలంగాణను మనం కాపాడుకోవాలి.. అందుకోసం రక్తం ధారపోస్తా..

తెలంగాణ ఉనికిని చాటడానికే ఆంధ్రకవుల్ని, రచయితల్ని తెలుగు మహాసభలకు పిలవలేదు.

తెలంగాణ నినాదంతో నా అణువు అణువు పులకరిస్తుంది. నాకు పునర్జన్మనిచ్చిన తల్లి తెలంగాణ.

కేసీఆర్ అంటే ఆది నుంచీ ఇష్టం. తెలంగాణ యాసని, భాషని గౌరవించలేదు. ఇది బాధకలిగించే విషయం. ఆ భాష, యాస మీద నాకున్న గౌరవం, నా సినిమాలు చూస్తే తెలుస్తుంది.

ఇవన్నీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగంలో దొర్లిన ఆణిముత్యాలు. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. రెండూ తెలుగు రాష్ట్రాలే. కానీ రెండు ప్రాంతాలు. అక్కడి ప్రజల మనోభావాలు వేరు వేరు కావచ్చు. రాజకీయ నాయకులు ఈ వేరు వేరు మనోభిప్రాయాలు గమనించే, చాలాకాలం డ్రామాలు ఆడేసారు. ఆఖరికి తెలంగాణ వచ్చింది. అదంతా వేరే సంగతి.

కానీ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడ పొయ్యి అక్కడ వెలిగించేందుకు, ఎక్కడ డప్పు అక్కడ కొట్టి, ఎక్కడ ఓట్లు అక్కడ కొల్లగొట్టేందుకు ఇంకా అదే డ్రామా రాజకీయాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇప్పుడు రాజకీయంగా కొత్తగా మీసాలు మొలుచుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అడుగు ముందుకు వేసారు. ఏదైనా అతే అన్నట్లు, తెలంగాణ ప్రాంతంలో తన పర్యటన విజయవంతం కావాలని, అక్కడి జనాలు తనను ఇంద్రుడు, చంద్రడు అనుకోవాలని, అందుకు అడ్డదారి, ఇలా మాట్లాడడం తప్ప వేరుకాదని అనుకుంటూ ప్రసంగించినట్లుంది.

కానీ ఇదే ప్రసంగాన్ని అక్షరం.. అక్షరం మార్చకుండా, సమయం, సందర్భం మరిచి, వేదిక మరిచి, ఆంధ్రలో వినిపించగలరా?

పవన్ ఎంతకు దిగజారిపోయారు అంటే, తెలంగాణ వేదికగా జరిగిన ప్రపంచ మహాసభలకు ఆంధ్ర కవులను, రచయితలను పిలవకపోవడం అన్నది కేవలం తెలంగాణ భాష, యాసలను బలోపేతం చేయడానికి అంట. తెలంగాణ యాస వేరుకావచ్చు. తెలంగాణ భాష ఏమిటి? తెలుగునే కదా?, మన కళాకారులను గౌరవించాలి అంటే, అవతలి కళాకారులను వదిలేయాలా? ఇదెక్కడి లాజిక్ పవన్? మరీ ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఇంతటి ఆత్మవంచనా?

పవన్ కు ఇప్పటి వరకు ఒక అలవాటు వుంది. మామూలుగా ఎలావున్నా, రాజకీయ పర్యటన అనగానే గెటప్ మార్చేస్తారు. దుస్తులు మారిపోతాయి. గెడ్డం కాస్త మాస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ అదనపు టచ్ ఇచ్చారు. మెడలో ఎర్రరుమాలు కట్టుకున్నారు. ఏమైనా సినిమాల్లో నటించడం మరిచిపోయి, సినిమాలో నటిచడం మానేస్తాను అని చెప్పిన పవన్ రాజకీయాల్లో నటించడం మొదలెట్టారేమో?