అక్కినేని అఖిల్ సినిమా ‘హలో’ అనుకోని వివాదంలోకి ఎంటరైంది. దాదాపు నెల కిందట విడుదల అయిన ఈ సినిమా ఊహించని వివాదంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా రూపకర్తలు 50లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరాదికి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. ఈ మేరకు అతడు హలో మూవీ మేకర్లకు నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది అని అంటూ.. అతడు లాయర్ నోటీసుల్లో పేర్కొన్నాడు. తనకు జరిగిన నష్టానికి గానూ 50లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. అసలే తనయుడి సినిమాతో నాగార్జున బాగానే నష్టపోయాడు. అది కూడా కోట్ల రూపాయల నష్టం. అది చాలదన్నట్టుగా ఇదొకటి మొదలైంది.
అసలు ఆ వ్యక్తికీ, హలో సినిమాకూ సంబంధం ఏమిటి? అంటే.. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కథకు ఒక ఫోన్ నంబర్ ను వాడారు.. ఆ నంబర్ ను ఉత్తరభారతదేశంలో ఒక వ్యక్తి వాడుతున్నాడట! ఇంకేముంది.. ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఆ నంబర్ ను పట్టుకుని అనేక మంది కాల్స్ చేయడం, మెసేజ్ లు చేయడం చేస్తున్నారట.
ఒకరిద్దరు కాదు.. అలాంటి కాల్స్ తో మెసేజ్ లతో తను విసిగి వేసారి పోయాను అని.. తీవ్రమైన క్షోభను అనుభవించాను అని.. అతడు అంటున్నాడు. వరస ఫోన్ కాల్స్ వల్ల తన ఉద్యోగం కూడా పోయింది అని.. తన జీవితం నాశనం అయ్యిందని.. అతడు అంటున్నాడు. అందుకే లాయర్ ద్వారా నోటీసులు పంపించానని 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అతడు అంటున్నాడు.
అయితే.. అలాంటి అవసరం లేదని అంటున్నారు హలో రూపకర్తలు. తాము ఆ నంబర్ ను టెలికాం కంపెనీ అనుమతితోనే వాడుకున్నామని.. వీళ్లు అంటున్నారు. కానీ.. అలాంటి అనుతిని తాము ఇవ్వలేదని.. సదరు టెలికాం కంపెనీ అంటోంది. ఇలా వీళ్లిద్దరూ పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.