టెలికం కంపెనీల మధ్య ధరల యుద్ధం ఇంకా చల్లారలేదు. మరీ ముఖ్యంగా ఎయిర్ టెల్, జియో మధ్య ఈ పోటీ రసవత్తరంగా సాగుతోంది. వీళ్లిద్దరి పోటీతో వినియోగదారుడు పండగ చేసుకుంటున్నాడు. జియో ప్రకటించిన రీచార్జ్ లకు పోటీగా తాజాగా ఎయిర్ టెల్, తన రీచార్జ్ ప్లాన్స్ ను ఇంకాస్త సవరించింది. డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్ లాంటి ఆఫర్లను మరింత ఎట్రాక్టివ్ గా మార్చింది.
మొన్నటివరకు రోజుకు 1జీబీ డేటాను ఉచితంగా అందించిన ఎయిర్ టెల్, జియోకు మరింత పోటీనిచ్చేందుకు ఆ ఆఫర్ ను సవరించింది. ఇకపై ప్రీ-పెయిడ్ కస్టమర్లు ఎవరైనా 199, 399, 448రూపాయల రీచార్జీ చేసుకుంటే.. గతంలో వాళ్లకిచ్చిన రోజుకు 1జీబీ డేటా బదులు రోజుకు 1.4జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్లను వెంటనే అమల్లోకి కూడా తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలతో పాటు తన ప్రతిష్టాత్మక 349రూపాయల ప్యాకేజీని కూడా సవరించి, మరింత ఆకర్షణీయంగా చేసింది ఎయిర్ టెల్.
అయితే జియో ఏం తక్కువ తినలేదు. ఎయిర్ టెల్ ఆఫర్లు ప్రకటించిన 24గంటల తేడాలోనే తన డేటా ప్యాక్స్ ను కూడా సవరించింది. రోజువారీ వినియోగించే డేటాను ఎయిర్ టెల్ 40శాతం పెంచితే, జియో ఏకంగా 50శాతం పెంచేసింది. రూ.149, రూ.349, రూ.399 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది.
తన జియో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఈ ధమాకా ఆఫర్ ప్రకటించింది జియో. తాజా ఆఫర్లతో వివిధ రీచార్జీలపై డేటా ఆఫర్ అమాంతం పెరిగింది. ఉదాహరణకు 349 రూపాయల ప్యాక్ తీసుకుంటే ఇందులో గరిష్ట డేటా వినియోగం 70రోజులకు 70 జీబీ మాత్రమే. తాజాగా ఇది 105 జీబీకి పెరిగింది. ఇలా తన ప్రతి ప్యాక్ లో వాలిడీటీ డేస్ తో పాటు డేటాను కూడా పెంచేసింది జియో.
రిలయన్స్ దెబ్బకు టెలికం దిగ్గజాల షేర్లు ఈరోజు కుప్పకూలాయి. జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్ల దెబ్బతో ఎయిర్ టెల్ 4శాతం, ఐడియా 5శాతం తమ షేర్ వాల్యూను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు జియో మాత్రం తొలిసారిగా లాభాల్లోకి ఎంటరైనట్టు ప్రకటించింది.