రానా నిర్మాతగా మారితెే ఇంకేమన్నా వుందా?

రానా నిర్మాతగా మారుతున్నాడని, అఖిల్ అక్కినేని హీరోగా, సత్య పినిశెట్టి డైరక్షన్ లో సినిమా తీస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇండస్ట్రీ వ్యవహారాలు అందునా సురేష్ కాంపౌండ్ గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు…

రానా నిర్మాతగా మారుతున్నాడని, అఖిల్ అక్కినేని హీరోగా, సత్య పినిశెట్టి డైరక్షన్ లో సినిమా తీస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇండస్ట్రీ వ్యవహారాలు అందునా సురేష్ కాంపౌండ్ గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు మాత్రం ఇంకా ఇది నమ్మలేని వార్తే అంటున్నారు. ఇందులో నమ్మలేనిది రానా నిర్మాతగా మారడం ఒక్కటే అని అంటున్నారు.

ఎందుకంటే టాలీవుడ్ లో దగ్గుబాటి సురేష్ అంత పక్కా బిజినెస్ మెన్ మరోకరు లేరు. ఆయన నిక్కచ్చి బిజినెస్ వ్యవహారాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. పదికోట్లు పెడితే రూపాయిల లాభం వస్తుందన్నా ఆ ప్రాజెక్టు వదలరు. పదికోట్లు పెడితే రూపాయి నష్టం వస్తుందన్నా ఆ ప్రాజెక్టు టేకప్ చేయరు.

స్వంత మేనల్లుడు నాగ చైతన్య హీరోగా మారి ఇన్నాళ్లయినా ఒక్క సినిమా కూడా నిర్మించలేదు. కొడుకు రానా హీరోగా మారినా ఒక్క సినిమా నిర్మించలేదు. నేనేరాజు నేనే మంత్రి సబ్జెక్ట్ చూసి, రానా రెమ్యూనిరేషనుకు బదులు పార్టనర్ షిప్ తీసుకున్నారని గుసగుసలు వున్నాయి. యుద్ధంశరణం ప్రాజెక్టు చేయాలనుకుని, దాని విషయం ముందే పసిగట్టి, సాయి కొర్రపాటికి అందించేసారని గుసగుసలు వినిపిస్తుంటాయి. ఆ సినిమా ఢమాల్ మంది. పదికోట్ల నష్టం మిగిల్చింది.

రెండో కొడుకును హీరోను చేస్తామని వచ్చినా సురేష్ బాబు ఇప్పటి దాకా ఓకె అనలేదు. కొందరు ఇంకా ముందుకు వెళ్లినా టెస్ట్ షూట్ దాటనివ్వలేదు. అంతటి ఫిక్స్ డ్ మైండ్ తో వుంటారు దగ్గుబాటి సురేష్. హీరో వెంకటేష్ చిరకాలంగా ఖాళీగా వున్నారు కానీ, సరైన ప్రాజెక్టు రాకుండా సెట్ మీదకు వెళ్లలేదు. దీని వెనుక వున్నది సురేష్ బాబే అన్న సంగతి తెలిసిందే.

గుణశేఖర్ హిరణ్యకసిపుడు స్క్రిప్ట్ తో సురేష్ బాబును కలిసి, రానాతో నిర్మించమని అడిగారు. స్క్రిప్ట్ బాగుంది. మూడు భాషల్లో నిర్మించండి. నేను సపోర్ట్ గా వుంటానని అన్నారు తప్ప, నిర్మిస్తానని అనలేదని గుసగుసలు వుండనే వున్నాయి.

మరి అలాంటిది, అన్ని వ్యవహారాల్లో అంత పక్కాగా వుంటే సురేష్ బాబు ఇప్పుడు తన కొడుకు రానాను అంత సులువుగా నిర్మాతగా మారనిస్తారా? అన్నది అనుమానం. ఒకవేళ ప్రకటించినా, కప్ టు లిప్ అన్నట్లు చాలా వుంటుంది వ్వవహారం. ఎందుకంటే యుద్ధంశరణం కూడా రానానే నిర్మిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాదు అని తన చేతిలోకి తీసుకున్నారు సురేష్ బాబు ముందు. తరువాత మెల్లగా ఆ సాయి కొర్రపాటి కాంపౌండ్ లోకి చేరింది.

ఇప్పుడు అఖిల్ సినిమా ఏమవుతుందో చూడాలి.