గరుడవేగ.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత రాజశేఖర్ కు సక్సెస్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా. అటు దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కూడా మంచి విజయాన్నందించిన సినిమా. ఈ మూవీ సక్సెస్ తర్వాత వీళ్లిద్దరికీ ఇక తిరుగుండదని అంతా భావించారు. కానీ అవకాశాల్లేక మళ్లీ వీళ్లిద్దరే కలిసి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
గరుడవేగ తర్వాత రాజశేఖర్ తన రెమ్యూనరేషన్ పెంచాడని టాక్. పైగా కథలు కూడా ఏవీ సెట్ అవ్వలేదని తిరస్కరిస్తూ వస్తున్నాడు. అలా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ప్రకటించలేకపోయాడు.
అటు ప్రవీణ్ సత్తారు మాత్రం వెంటనే రామ్ తో ఓ సినిమాకు కమిటయ్యాడు. మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగింది. తీరా సెట్స్ పైకి వచ్చే ముందు భారీ బడ్జెట్ కారణంగా సినిమా చేయలేనని నిర్మాత స్రవంతి రవికిషోర్ చేతులెత్తేశాడు. అలా ప్రవీణ్ సత్తారు కూడా ఖాళీ అయిపోయాడు.
సో.. ఇప్పుడు మళ్లీ రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు కలిశారు. రామ్ కోసం అనుకున్న కథతోనే రాజశేఖర్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రవీణ్. దర్శకుడిపై నమ్మకంతో రాజశేఖర్ కూడా దాదాపు ఓకే చెప్పేశాడు. కాకపోతే నిర్మాత దొరకడం లేదు. ప్రొడ్యూసర్ దొరికితే సెట్స్ పైకి వెళ్లడమే.