విశాల్ కోరిక తీరింది

చాలా రోజులుగా విశాల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విశాల్ సినిమాలన్నీ దాదాపు స్వంత సినిమాలే. పైగా అన్నీ తెలుగులో ఆల్ మోస్ట్ స్వంత విడుదలలే. అయితే ఏ సినిమా కూడా ప్రాపర్ గా…

చాలా రోజులుగా విశాల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విశాల్ సినిమాలన్నీ దాదాపు స్వంత సినిమాలే. పైగా అన్నీ తెలుగులో ఆల్ మోస్ట్ స్వంత విడుదలలే. అయితే ఏ సినిమా కూడా ప్రాపర్ గా లాంచ్ కాకపోవడం, టైమ్ బ్యాడ్ కావడంతో సరైన హిట్ లు పడలేదు. ఇప్పుడు అభిమన్యుడు రూపంలో అదృష్టం వరించింది. వాస్తవానికి తమిళంతో పాటు తెలుగులో అభిమన్యుడు విడుదల చేద్దాం అంటే కుదరలేదు.

తమిళంలో విడుదలైన మే 11 టైమ్ లో తెలుగులో చాలా సినిమాలు వుండడం, థియేటర్లు ఖాళీ లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అక్కడ మంచి టాక్ వచ్చినా, ఇక్కడ విడుదలకు స్లాట్ దొరకడం లేట్ అయింది. ఆఖరికి జూన్ 1కి మూడు సినిమాల మధ్యలో వచ్చింది. ముఖ్యంగా నాగ్-వర్మ కాంబినేషన్ లోని ఆఫీసర్ సినిమాతో కలిసి విడుదలయింది.

అయితే ఈవారం విడుదలయిన వాటిలో అభిమన్యుడే విజేతగా నిలిచింది. ఆఫీసర్ డిజాస్టర్ అయింది. రాజుగాడు బి సి సెంటర్లలో ఛాయిస్ గా వుంది. అభిమన్యుడు మాత్రం ఇటు అర్బన్ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ ల్లో కుమ్మేస్తోంది. ఫస్ట్ డే కోటి రూపాయిలకుపైగా షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ డే నే మల్టీ ఫ్లెక్స్ లు అన్నీ షోలు విపరీతంగా పెంచేసాయి. అలాగే అర్బన్ సెంటర్లలో థియేటర్లను పెంచారు.

ఫస్ట్ వీకెండ్ అభిమన్యుడు దాదాపు అయిదు కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను కూడా ఆంధ్రలో విశాల్ తన మిత్రులతో కలిసి స్వంతగా విడుదల చేసుకున్నాడు. కాబట్టి నాలుగు డబ్బులు కళ్ల చూసే అవకాశం వుంది.